Share News

ట్రాఫిక్‌ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

ABN , Publish Date - Nov 22 , 2024 | 01:03 AM

అవినీతికి పాల్పడిన త్రీటౌన్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐతోపాటు స్టేషన్‌ రైటర్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి గురువారం సస్పెండ్‌ చేశారు.

ట్రాఫిక్‌ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

  • రైటర్‌పై కూడా...

  • డ్రంక అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్నట్టు అభియోగం

  • విచారణలో నిజమేనని తేలడంతో సీపీ యాక్షన్‌

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):

అవినీతికి పాల్పడిన త్రీటౌన్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐతోపాటు స్టేషన్‌ రైటర్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి గురువారం సస్పెండ్‌ చేశారు. గత కొద్దిరోజులుగా త్రీటౌన్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐగా ఎన్‌వీ భాస్కరరావు అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆయన తన సిబ్బందితో కలిసి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎస్‌ఐ భాస్కరరావు మరొకచోట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ స్పెషల్‌డ్రైవ్‌లో పాల్గొనేందుకు వెళుతూ...అక్కడ తనిఖీ చేసే బాధ్యతను ఏఎస్‌ఐకి అప్పగించారు. ఏఎస్‌ఐ తనిఖీలు చేస్తుండగా ఒకరు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టు పరీక్షలో తేలింది. దీంతో అతడి వాహనాన్ని సీజ్‌ చేసి త్రీటౌన్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ రైటర్‌ సీహెచ్‌ జయరావుకు అందజేశారు. ఇదిలావుండగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి ఒక మధ్యవర్తి ద్వారా త్రీటౌన్‌లో ట్రాఫిక్‌ ఎస్‌ఐతోపాటు రైటర్‌ను కలిసి డబ్బులిచ్చి బైక్‌ తాళాలను తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న ఎస్‌ఐ, రైటర్‌ కలిసి కేసును కోర్టులో ప్రవేశపెట్టకుండా వదిలేశారని ఎవరో సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై విచారణకు ఆదేశించిన సీపీ...తనకు అందిన ఫిర్యాదులో వాస్తవం ఉందని తేలడంతో ఎస్‌ఐ భాస్కరరావు, రైటర్‌ జయరావును విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్‌ శాఖలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు తెలిస్తే 7995095799 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

Updated Date - Nov 22 , 2024 | 01:03 AM