Share News

బదిలీలకు జోరుగా పైరవీలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:01 AM

బదిలీల ప్రక్రియలో పైరవీలు జోరుగా సాగుతున్నాయి.

బదిలీలకు జోరుగా పైరవీలు

  • ఒక్కొక్కరు వద్ద మూడు నుంచి నాలుగు సిఫారసు లేఖలు సమర్పణ

  • తలలు పట్టుకుంటున్న ఉన్నతాధికారులు

  • రెవెన్యూ బదిలీల్లో యూఎల్‌సీ కింగ్‌ హల్‌చల్‌

  • కూటమి కీలక నేత చీవాట్లు

  • వీఎంఆర్‌డీఎ సెక్రటరీ పోస్టుకు గట్టి పోటీ

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

బదిలీల ప్రక్రియలో పైరవీలు జోరుగా సాగుతున్నాయి. రెవెన్యూ శాఖలో డీటీ కేడర్‌ అధికారి ఒకరు తనకు పరిచయం ఉన్న ముగ్గురు కూటమి ప్రజా ప్రతినిధుల వద్ద నుంచి సిఫారసు లేఖలు సంపాదించారు. జల వనరుల శాఖలో పనిచేసే ఏఈ ఒకరు ఉత్తరాంధ్రలో ఒక మంత్రి, ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేల వద్ద సిఫారసు లేఖలు తీసుకున్నారు. అయితే ఆయనతోపాటు పనిచేసే ఒకరు ఆరు లేఖలు తీసుకున్నట్టు తెలిసి...మరో రెండు లేఖల కోసం యత్నిస్తున్నారు.

కోరుకున్న చోటకు బదిలీ, ఉన్నచోట నుంచి కదిలించకుండా ఉంచేందుకు ఉద్యోగులు తమకు తెలిసిన కూటమి ప్రజా ప్రతినిధుల నుంచి తీసుకున్న సిఫారసు లేఖలను ఉన్నతాధికారులకు ఇస్తున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు, కొందరైతే ఐదు సిఫారసు లేఖలు సమర్పిస్తుండడంతో ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో తమకు తెలిసిన ఒక ప్రజా ప్రతినిధి నుంచి లేఖ తీసుకుని ఫోన్‌ చేయించుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ద్వారా మూడు పార్టీల ప్రజా ప్రతినిధుల నుంచి లేఖలు తీసుకుంటున్నారు. ఇలా కుప్పలు తెప్పలుగా వస్తున్న సిఫారసు లేఖలను తీసుకుంటున్న ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి వెంటనే సంబంధిత ప్రజా ప్రతినిధులకు ఫోన్‌ చేసి ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలని అడుగుతున్నట్టు తెలిసింది. బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 22వ తేదీ వరకు గడువు ఉంది. ఇదిలావుండగా సిఫారసు లేఖలు ఇచ్చేందుకు కొందరు నేతలు తమ అనుచరులు, మధ్యవర్తుల ద్వారా సొమ్ములు తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతుంది.

యూఎల్‌సీ కింగ్‌ పైరవీలు

గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన యూఎల్‌సీ కింగ్‌ కూటమి ప్రభుత్వంలో తనకు తెలిసిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల ద్వారా రెవెన్యూ బదిలీల్లో పైరవీలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. మహిళా తహసీల్దారు ఒకరికి ప్రాధాన్యం కలిగిన మండలంలో పోస్టింగ్‌ వేయించాలని కోరేందుకు ఒక ప్రజా ప్రతినిధి సూచన మేరకు ఉమ్మడి జిల్లాలో కీలక నేతను కలిశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే యూఎల్‌సీ కింగ్‌పై కీలక నేత ఒంటికాలుపై లేచారని తెలిసింది. గత ప్రభుత్వంలో అనేక వివాదాస్పద భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నావని, చివరకు దసపల్లా భూముల్లో వైసీపీ నేతకు భారీగా లబ్ధి చేకూర్చడంలో కీలకపాత్ర పోషించావని మండిపడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చినా నీ పెత్తనం ఏమిటని చీవాట్లు పెట్టారని తెలిసింది.

వీఎంఆర్‌డీ సెక్రటరీ పోస్టుకు పైరవీ

విశాఖ జిల్లాలో రెండు చోట్ల తహసీల్దార్‌గా పనిచేసిన తరువాత పదోన్నతిపై బయటకు వెళ్లిన అధికారి ఒకరు వీఎంఆర్‌డీ సెక్రటరీగా రావాలని గట్టిగా యత్నించారు. నగరంలో కూటమికి చెందిన ప్రజా ప్రతినిధి ద్వారా సిఫారసు చేయించుకుని లేఖను మునిసిపల్‌ మంత్రికి అందజేశారు. అయితే సదరు అధికారి తహసీల్దారుగా ఉండగా ప్రభుత్వ చెరువులను జిరాయితీగా మార్చేసిన ఘనత ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఒక ఎమ్మెల్యే అప్రమత్తమై వెంటనే మంత్రి నారాయణకు సమాచారం అందించడంతో సదరు అధికారి పేరును తప్పించారు. ఇంకా నగరంలో తహసీల్దారుగా పనిచేసి పదోన్నత పొందిన ఒకరు, సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన మరొకరు వ్యక్తి వీఎంఆర్‌డీఎ సెక్రటరీ పోస్టుకు ప్రయత్నిస్తున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్ల బదిలీలకు మార్గదర్శకాలు జారీ

కొన్ని స్థానాలు ముందే భర్తీకి ప్రయత్నాలు?

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

సబ్‌ రిజిస్ట్రార్ల బదిలీలకు మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశారు. ఆదాయం బట్టి కార్యాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఒకేచోట రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారిని బదిలీకి అర్హులుగా ప్రకటించారు. అత్యధిక ఆదాయం వచ్చే కార్యాలయాలకు భారీ డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ బదిలీలకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చారు. అవి ఉన్నా సరే ఉన్నతాధికారుల కరుణ లేనిదే కీలక స్థానాలు దక్కే అవకాశం లేదు. అయితే ఆ శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దలు వారికి నచ్చిన వారికి ముందుగానే బదిలీ ఉత్తర్వులు ఇచ్చేసి, మిగిలిన స్థానాలకు ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బదిలీలలో భారీ మొత్తాలు చేతులు మారినట్టుగానే అనుమానించాల్సి ఉంటుంది. అలా కాకుండా అన్ని స్థానాలను 100 శాతం కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తే పారదర్శకంగా చేసినట్టు అవుతుంది. ఏదో మతలబు చేయాలనే ఉద్దేశంతో చివరి తేదీ వరకు ఊగిసలాడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - Sep 21 , 2024 | 01:01 AM