Share News

పారదర్శకంగా దీపం-2 పథకం

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:58 AM

కూటమి ప్రభుత్వం దీపం-2 పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తున్నదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ సందర్బంగా అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. దీపం-2 పథకం కింద వంద శాతం సబ్సిడీపై ఏటా మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు పొందడానికి రాష్ట్రంలో ఇంతవరకు 81 లక్షల కుటుంబాలు ఈకేవైసీ చేయించుకున్నాయని మంత్రి వెల్లడించారు.

పారదర్శకంగా దీపం-2 పథకం
మీడియాతో మాట్లాడుతున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ . పక్కన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు

ఉచిత గ్యాస్‌ సిలిండర్ల కోసంం ఏటా రూ.2,840 కోట్లు వ్యయం

రాష్ట్ర వ్యాప్తంగా 81 లక్షల కుటుంబాలు ఈకేవైసీ

ఆర్థిక ఇబ్బందులున్నా.. హామీలు అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

అనకాపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం దీపం-2 పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తున్నదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ సందర్బంగా అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. దీపం-2 పథకం కింద వంద శాతం సబ్సిడీపై ఏటా మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు పొందడానికి రాష్ట్రంలో ఇంతవరకు 81 లక్షల కుటుంబాలు ఈకేవైసీ చేయించుకున్నాయని మంత్రి వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో 2.2 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు వుండగా, ఇంతవరకు 1.75 లక్షల కనెక్షన్లకు సంబంధించి లబ్ధిదారులు మొదటి సిలిండర్‌ బుక్‌ చేసుకున్నారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక్కో గ్యాస్‌ కనెక్షన్‌కు ఒకటి చొప్పున సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నాలుగు నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని పేర్కొన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధరను తొలుత లబ్ధిదారులు చెల్లించాలని, గ్యాస్‌ కనెక్షన్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌-6 హామీల్లో ఒకటైన ఉచిత వంట గ్యాస్‌ సిలిండర్‌ (దీపం-2) కోసం ఏటా రూ.2,840 కోట్లు వ్యయం చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో లేనంతమంది లబ్ధిదారులు దీపం-2 పథకంలో ఉన్నారని తెలిపారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో వున్నారని, మిగిలిన హామీలను కూడా సంక్రాంతిలోపు అమలు చేయాలనే మంచి ఆలోచనతో మందుకు వెళుతున్నారని మనోహర్‌ చెప్పారు. మీడియా సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 12:58 AM