Share News

నేవీ రోడ్డులో ప్రయాణమంటే హడల్‌

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:44 AM

మండలంలోని నేవీ రోడ్డుపై రాయి లోడులతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో దుమ్ము, ధూళి ఎగసిపడి పరిసర ప్రాంతాలు అధ్వానంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా సమీప ఆరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి వస్తుండడంతో గగ్గోలు పెడుతున్నారు.

నేవీ రోడ్డులో ప్రయాణమంటే హడల్‌
నేవీ రోడ్డులో దుమ్ము, ధూళి వెదజల్లుతూ వెళుతున్న లారీ

- భారీ వాహనాల రాకపోకలతో ఎగసిపడుతున్న దుమ్ము, ధూళి

- ఇబ్బందులు పడుతున్న ద్విచక్ర వాహనచోదకులు

- పరిసర గ్రామాల ప్రజలకూ తప్పని అవస్థలు

- దుమ్ము రాకుండా ఇళ్ల చుట్టూ ప్లాస్టిక్‌ కవర్లు కట్టుకుంటున్న వైనం

రాంబిల్లి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి ): మండలంలోని నేవీ రోడ్డుపై రాయి లోడులతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో దుమ్ము, ధూళి ఎగసిపడి పరిసర ప్రాంతాలు అధ్వానంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా సమీప ఆరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి వస్తుండడంతో గగ్గోలు పెడుతున్నారు.

వాడనర్సాపురం సమీపంలోని ఎన్‌ఏఓబీ ఏర్పాటు కావడంతో భారీ వాహనాల రాకపోకలు పెరిగాయి. ఎన్‌ఏఓబీలో నిర్మాణ పనులు జరుగుతుండడంతో అధిక రాయి లోడులతో లారీలు ప్రతి రోజు ఎన్‌ఏఓబీలోకి వస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా రాయిలోడుతో భారీ వాహనాలు వస్తుండడంతో నేవీరోడ్డులో దుమ్ము, ధూళి ఎగసి వెనుక వస్తున్న ద్విచక్ర వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దుమ్ము, ధూళి సమీప గ్రామాల్లోని ఇళ్లు, దుకాణాల్లోకి ఎక్కువగా వస్తుండడంతో ప్రజలు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. దుమ్ము ఆహార పదార్థాలు, తాగునీటిలో పడుతుండడంతో అనారోగ్యానికి, చర్మవ్యాధులకు గురవుతున్నామని గోవిందపాలెం, రాంబిల్లి, కొండవారపాలెం, అప్పన్నపాలెం, సంతపాలెం, కృష్ణంపాలెం, తదితర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లోని ఇళ్లలోకి దుమ్ము, ధూళి వస్తుండడంతో ఇంటి చుట్టూ ప్లాస్టిక్‌ కవర్లు, సిమెంట్‌ సంచులు కట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ మార్గాన్ని పునర్నిర్మించడంతో పాటు దుమ్ము, ధూళి ఎగసిపడకుండా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 15 , 2024 | 12:44 AM