Share News

తుఫాన్‌ అలర్ట్‌

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:40 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్‌కు ఒమన్‌ దేశం సూచించిన ‘దాన’ అని పేరు పెట్టారు. కాగా గురువారంనాటికి తీవ్ర తుఫాన్‌గా మారి ఒడిశాలో తీరం దాటుతుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్‌ అనకాపల్లి జిల్లాపైనా ప్రభావం చూపనుండడంతో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

తుఫాన్‌ అలర్ట్‌
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం

భారీ వర్షాల హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తం

కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

అనకాపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్‌కు ఒమన్‌ దేశం సూచించిన ‘దాన’ అని పేరు పెట్టారు. కాగా గురువారంనాటికి తీవ్ర తుఫాన్‌గా మారి ఒడిశాలో తీరం దాటుతుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్‌ అనకాపల్లి జిల్లాపైనా ప్రభావం చూపనుండడంతో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంగళవారం జిల్లాలో పెద్దగా వర్షాలు కురవకపోయినా.. తుఫాన్‌ ప్రభావంతో ఈ నెల 24వ తేదీ నుంచి 26 వతేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకావం వుందని సమాచారం. అందువల్ల 26వ తేదీ వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, అవసరం మేరకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సహాయం అందించాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి ఫోన్‌ నంబర్లు 08924- 226599, 222888 అందుబాటులో ఉంచారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగిస్తారు. గ్రామాల్లో అధిక వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తే సహాయక చర్యలు చేపడతామని డీఆర్‌ఓ దయానిధి తెలిపారు.

విద్యుత్‌ శాఖ కార్యాలయంలో..

అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి, తుఫాన్‌గా బలపడనున్న నేపథ్యంలో విద్యుత్‌శాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ జి.ప్రసాద్‌ తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తినా 94906 10022 నంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు. కంట్రోల్‌ రూమ్‌లోని ఈ నంబరులో సిబ్బంది 24 గంటలూ మూడు షిఫ్ట్‌లలో అందుబాటులో వుంటారని చెప్పారు. వర్షాలు, ఈదురు గాలుల కారణంగా తెగిపడిన విద్యుత్‌వైర్లు, తడిసిన విద్యుత్‌ స్తంభాలను, విద్యుత్‌ వైర్లపై విరిగి పడిన చెట్ల కొమ్మలను ఎవరూ తాకవద్దని చెప్పారు. వర్షాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం, సమస్యలు తలెత్తిన ఎడల సమీపంలోని విద్యుత్‌ సెక్షన్‌ కార్యాలయం, టోల్‌ఫ్రీ నంబరు 1912, కంట్రోల్‌ రూమ్‌, సర్కిల్‌ ఆఫీస్‌.. ఏదో ఒకడానికి ఫోన్‌ చేసి ఫిర్యాదునమోదు చేసుకోవాలని సూచించారు. సమస్యను సత్వరమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ తెలిపారు.

Updated Date - Oct 23 , 2024 | 12:40 AM