కాఫీ రైతులకు దక్కని అంతర్జాతీయ ధరలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:27 PM
అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. కాఫీ ఉత్పత్తుల్లో దిగ్గజాలుగా పేరొందిన బ్రెజిల్, వియత్నం దేశాల్లో దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో దేశీయ మార్కెట్‌లో కాఫీ ధరలు ఒక్కసారిగా గణనీయంగా పెరిగాయి. అయితే ఆదివాసీ రైతులకు మాత్రం అంతర్జాతీయ ధరలు అందడం లేదు.
పార్చిమెంట్ కిలో రూ.440, చెర్రీ రూ.240గా ప్రకటించిన కర్ణాటక ఐసీటీఏ
ఆదివాసీలకు జీసీసీ ఇచ్చేది స్వల్పమే..
ధరలు పెంచాలని రైతుల వినతి
చింతపల్లి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. కాఫీ ఉత్పత్తుల్లో దిగ్గజాలుగా పేరొందిన బ్రెజిల్, వియత్నం దేశాల్లో దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో దేశీయ మార్కెట్‌లో కాఫీ ధరలు ఒక్కసారిగా గణనీయంగా పెరిగాయి. అయితే ఆదివాసీ రైతులకు మాత్రం అంతర్జాతీయ ధరలు అందడం లేదు.
కర్ణాటక ఇండియన్ కాఫీ ట్రేడింగ్ అసోసియేషన్(ఐసీటీఏ) కాఫీ పార్చిమెంట్‌కు కిలో రూ.440, చెర్రీ(గుళ్ల) రూ.240 ధరలు ప్రకటించింది. ఈ ధరలను రైతులకు తెలియజేసేందుకు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కృషి చేస్తున్నట్టు పాడేరు సీనియర్ లైజనింగ్ అధికారి ఎస్.రమేశ్ తెలిపారు. గత ఏడాది కర్ణాటక ఐసీటీఏ మార్కెట్‌లో కాఫీ పార్చిమెంట్ కిలో రూ.310, చెర్రీ రూ.150 గరిష్ఠ ధరలు లభించాయి. సాధారణంగా మార్కెట్ ప్రారంభం(డిసెంబర్, జనవరి)లో కాఫీ ధరలు తక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో క్రమంగా ధరలు పెరుగుతాయి. అయితే ఈ ఏడాది బ్రెజిల్, వియత్నం దేశాల్లో కాఫీ దిగుబడులు భారీగా పతనం కావడంతో కాఫీ మార్కెట్ ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ స్థాయిలో కాఫీకి మార్కెట్‌లో ధరలు లభించడం ఇదే ప్రథమమని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు.
గిరిజన రైతులకు అందని గరిష్ఠ ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీకి గరిష్ఠ ధరలు లభిస్తున్నప్పటికి ఆదివాసీ రైతులకు ఈ ధరలు అందడం లేదు. కర్ణాటక మార్కెట్‌లో కిలో పార్చిమెంట్‌కి రూ.440 ధర ఉండగా, గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కిలో రూ.320 ధరకు కొనుగోలు చేస్తోంది. ప్రైవేటు వర్తకులు రూ.335 వరకు కొనుగోలు చేస్తున్నారు. చెర్రీ కిలో ధర రూ.240 ఉండగా, జీసీసీ రూ.170కి కొనుగోలు చేస్తోంది. ప్రైవేటు వర్తకులు రూ.170- 180 మధ్య కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులు అంతర్జాతీయ ధరలు తమకు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.