Share News

టీడీఆర్‌లో జారీపై విజిలెన్స్‌

ABN , Publish Date - Dec 24 , 2024 | 01:39 AM

ట్రాన్స్‌ఫర్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) జారీ వ్యవహారం ఇప్పుడు జీవీఎంసీ అధికారుల్లో గుబులు రేపుతోంది.

టీడీఆర్‌లో జారీపై విజిలెన్స్‌

ఇటీవల కౌన్సిల్‌ సమావేశంలో టీడీఆర్‌లపై వాడీవేడి చర్చ

భారీగా అక్రమాలు జరిగాయని సభ్యుల ఆరోపణ

గత పదేళ్లలో జారీచేసిన టీడీఆర్‌ వివరాలు ఇవ్వాలని డిమాండ్‌

తలలుపట్టుకుంటున్న అధికారులు

మరోవైపు నిఘా వర్గాల ఆరాతో ఆందోళన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ట్రాన్స్‌ఫర్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) జారీ వ్యవహారం ఇప్పుడు జీవీఎంసీ అధికారుల్లో గుబులు రేపుతోంది. టీడీఆర్‌ల మంజూరులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు ఆరోపణలు గుప్పించారు. గత పదేళ్లలో జారీచేసిన టీడీఆర్‌ల జాబితా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ వివరాల సేకరణలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తలమునకలయ్యారు. ఇంతలో టీడీఆర్‌ల గురించి విజిలెన్స్‌, సీఐడీ విభాగాల అధికారులు కూడా ఆరా తీస్తుండడం టౌన్‌ప్లానింగ్‌తోపాటు జీవీఎంసీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

జీవీఎంసీలో ప్రస్తుతం టీడీఆర్‌ల అంశంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, గతంలో ఎప్పుడో రోడ్డు విస్తరణలో పోయిన భూములకు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్‌లు జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా టీడీఆర్‌ జారీచేసిన తర్వాత ఆయా భూములు/స్థలాలను స్వాధీనం చేసుకోవాల్సిన జీవీఎంసీ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఈనెల 11న జరిగిన జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో టీడీఆర్‌ల జారీపై వాడీవేడి చర్చ జరిగింది. ఎంతోమంది అనర్హులకు రూ.వందల కోట్ల విలువైన టీడీఆర్‌లు జారీ చేశారంటూ పలువురు కార్పొరేటర్లు ఆరోపించారు. అర్హులైన వారికి టీడీఆర్‌లు జారీచేయడానికి జాప్యం చేస్తున్న అధికారులు, దశాబ్దాల కిందట నిర్మించిన రోడ్డులో తమ స్థలం పోయినందున టీడీఆర్‌ జారీచేయాలంటూ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నవారికి టీడీఆర్‌లను ఎలా జారీచేస్తున్నారంటూ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను నిలదీశారు. టీడీఆర్‌ల పేరుతో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, జీవీఎంసీ ఆదాయానికి గండికొట్టేలా టీడీఆర్‌లను జారీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో కొందరు టౌన్‌ప్లానింగ్‌, జీవీఎంసీ అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు గుప్పించారు. గత పదేళ్లలో జీవీఎంసీ జారీచేసిన టీడీఆర్‌ల జాబితాను సభ్యులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. దీనికి కమిషనర్‌ సంపత్‌కుమార్‌ స్పందిస్తూ గత పదేళ్లలో 1,035 టీడీఆర్‌లు జారీచేసినట్టు వివరించారు. వాటి వివరాలను సభ్యులందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఒక్కో టీడీఆర్‌కు సంబంధించి కనీసం వంద పేజీల ఫైల్‌ ఉంటుందని, ఒకేసారి గత పదేళ్లలో జారీచేసిన 1,035 టీడీఆర్‌ల జాబితా తయారుచేయడం ఎలా సాధ్యమవుతుందని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ముందుగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉన్నంతలో టీడీఆర్‌ల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

టీ డీఆర్‌లపై విజిలెన్స్‌ ఆరా

జీవీఎంసీలో టీడీఆర్‌లపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతుండడం, పత్రికల్లో వరుస కథనాలు వస్తుండడంతో విజిలెన్స్‌, సీఐడీ విభాగాల అధికారులు కూడా దీనిపై దృష్టిసారించినట్టు తెలిసింది. ఇప్పటికే జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి కొన్ని టీడీఆర్‌లకు సంబంధించిన సమాచారం సేకరించినట్టు తెలిసింది. టీడీఆర్‌ జారీచేసిన కొన్ని స్థలాలకు సంబంధించిన ఫైళ్లను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నుంచి తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. పదేళ్లలో జారీచేసిన టీడీఆర్‌ల సమాచారాన్ని క్రోడీకరించే పనిలో ఉన్న అధికారులకు విజిలెన్స్‌, సీఐడీ అధికారులు అదే అంశంపై ఆరా తీస్తుండడంతో నిద్రపట్టడం లేదు. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితి ఎదురువుతోందోనని టీడీఆర్‌ల జారీలో అవకతవకలకు పాల్పడి నవారు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 24 , 2024 | 01:39 AM