విశాఖ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్
ABN , Publish Date - Dec 07 , 2024 | 01:21 AM
విశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విజన్ డాక్యు మెంట్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం
అనేక కీలక సంస్థలు రాబోతున్నాయి
మెట్రో రైలు డీపీఆర్‌ను ఆమోదించి కేంద్రానికి పంపించాం
రైల్వే జోన్ భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం
స్టీల్‌ప్లాంటును కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం
సీప్లేన్ నడిపేందుకు గల అవకాశాలు పరిశీలన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విజన్ డాక్యు మెంట్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ‘డీప్ టెక్నాలజీ’పై శుక్రవారం నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు అనంతరం మీడియాతో మాట్లాడారు. విజన్-2047లో భాగంగా విశాఖ కోసం ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్టు సీఎం తెలిపారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ మెట్రో రైల్ డీపీఆర్‌ను ఆమోదించి కేంద్రానికి పంపించినట్టు చెప్పారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కాబోతోందని, భవన నిర్మాణ ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్నారు. స్టీల్‌ప్లాంటును కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. విశాఖకు కూడా సీ ప్లేన్ అనుకూలతను పరిశీలిస్తున్నామని వివరించారు. రానున్న రోజుల్లో విశాఖ నగరం అన్ని రంగాల్లోనూ ముందుండేలా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. తనపై విశాఖ ప్రజలు ఎంతో నమ్మకాన్ని ఉంచి ఆదరించా రన్నారు. ఇక్కడి ప్రజలు ఎంతో మంచివాళ్లని, టీడీపీపై ఎంతో అభిమానాన్ని కలిగి ఉన్నారన్నారు. విశాఖ వాసులు కమిటెడ్‌గా ఉంటారన్నారు. తాను ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలను చూశానని, ఇటువంటి భిన్నమైన నగరాన్ని ఎక్కడా చూడలేదన్నారు. మంచి, చెడులను గమనించి నిర్ణయాలు తీసుకోవడంలో ఇక్కడి ప్రజలు ముందుంటారన్నారు. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశామని, ఇప్పుడు డీప్ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నా మన్నారు. విశాఖలో అనేక కీలక సంస్థలు తమ కార్యా లయాలను ప్రారంభిస్తున్నాయన్నారు.
ముఖ్యమంత్రికి వినతుల వెల్లువ
పని ఒత్తిడి తగ్గించాలని కోరిన నర్సులు
రెగ్యులర్ చేయాలని మలేరియా విభాగం కాంట్రాక్టు సిబ్బంది విజ్ఞప్తి
కమీషన్ 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని కోరిన మద్యం డీలర్లు
తమ ఆస్తులు కబ్జాకు గురయ్యాయని, విచారించి న్యాయం చేయాలని పలువురు వేడుకోలు
విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంరఽధజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. గురువారం రాత్రి ముంబై నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ముఖ్యమంత్రి నగరంలో ఉన్న విషయం తెలుసుకున్న పలువురు శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయానికి వచ్చారు. తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
నగరంలోని అల్లిపురం ప్రాంతంలో ఉంటున్న నరసింగరావు దంపతులు తమకు గోపాలపట్నంలో ఉన్న ఇంటిని వేరొకరు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. కేజీహెచ్‌లో వాటర్ వర్క్స్‌కు సంబంధించి సూపరింటెండెంట్ బిల్లులు ఇవ్వడం లేదని, ప్రస్తుతం తాను అప్పుల్లో ఉన్నానని కాంట్రాక్టరు గణేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, టీచింగ్ ఆస్పత్రుల్లో పని ఒత్తిడి తగ్గించాలని, అవసరం మేర కొత్తగా నియామకాలు చేపట్టాలని, భద్రత పెంచాలని నర్సులు వినతిపత్రం సమర్పించారు. వారసత్వంగా వచ్చిన భూమిని గ్రామంలో కొందరు వారి పేరిట మ్యుటేషన్ చేయించుకున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని రాంబిల్లి మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన నాగుమంతు నరసింహరావు విజ్ఞాపనపత్రం సమర్పించారు. పాతికేళ్లుగా పనిచేస్తున్న తమ సర్వీస్‌ను రెగ్యులర్ చేయాలని మలేరియా విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది కోరారు. జీవీఎంసీ పరిధిలోని లక్ష్మిపురం ఏరియాలో తాను కొనుగోలు చేసిన స్థలాన్ని వైసీపీ నేత ఆక్రమించుకున్నారని విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి సీహెచ్‌వీఎస్ నారాయణ ఫిర్యాదు చేశారు. పీఎం పాలెంలో మసీదును కొందరు అరాచకశక్తులు ఆక్రమించుకుని తోటి ముస్లింలను ఇబ్బందులు పెడుతున్నారని షేక్ సుభాని, టీడీపీ సానుభూతిపరుడననే అక్కసుతో ఏయూ మాజీ వీసీ తనకు రావల్సిన ఇంక్రిమెంట్లు నిలుపుదల చేశారని పరీక్షల విభాగం సూపరింటెండెంట్ సవర దావీదురావు ఫిర్యాదు చేశారు. మద్యంపై ప్రస్తుతం ఇస్తున్న 9.5 శాతం కమీషన్‌ను 20 శాతానికి పెంచాలని డీలర్లు కోరారు. 2020లో విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన తమను (చంద్రబాబు) అడ్డుకున్న వైసీపీ నేతలపై చర్యలు విషయంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని టీడీపీ పీఆర్వో కె.గోపాలరెడ్డి ఫిర్యాదు చేశారు. వైసీపీ కీలక వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా అప్పటి పోలీసులు తప్పించి, సామాన్య కార్యకర్తల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వైసీపీ నాయకుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.