Share News

ఉక్కులో వీఆర్‌ఎస్‌!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:57 AM

ఆది నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉక్కులో వీఆర్‌ఎస్‌!

15 ఏళ్ల సర్వీస్‌, 45 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారికి మాత్రమే అవకాశం

29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన

...అయితే ఇదంతా సర్వే మాత్రమేనని మరోవైపు నాటకం

పరిహారం గురించిన ఊసు లేదు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆది నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి వలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ (వీఆర్‌ఎస్‌)ను మంగళవారం ప్రకటించింది. ఇది కేవలం రెగ్యులర్‌ ఉద్యోగులు అంటే ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్స్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేసింది. కాంట్రాక్టు కార్మికులు ఎవరూ దీని పరిధిలోకి రారు. ఈ పథకానికి కొన్ని నిబంధనలు కూడా విధించింది.

వీఆర్‌ఎస్‌ కావాలని కోరుకునే ఉద్యోగి కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలి. ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ నాటికి 45 ఏళ్ల వయస్సు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఎంప్లాయీ పోర్టల్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ ద్వారా సమ్మతి తెలపాలని సూచించింది. ఇవన్నీ ఈ నెల 29వ తేదీలోపే జరిగిపోవాలని సూచింది. అయితే దీనిని వీఆర్‌ఎస్‌ దరఖాస్తుగా పరిగణించలేమని స్పష్టంచేసింది. ఇది కేవలం సర్వే మాత్రమేనని వివరించింది. ఎంతమంది నుంచి స్పందన వస్తుందో తెలుసుకోవడానికి, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి చేపట్టిన ప్రక్రియగా పేర్కొంది.

వీఆర్‌ఎస్‌ తీసుకుంటే ఏమి ఇస్తారు?

యాజమాన్యం చెప్పినట్టుగా విని వీఆర్‌ఎస్‌ తీసుకుంటే ఉద్యోగులకు ఏమి వస్తుందో స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇటీవల గుజరాత్‌లోని ఒక ప్రభుత్వ రంగ సంస్థలో వీఆర్‌ఎస్‌కు ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

- వీఆర్‌ఎస్‌ తీసుకునే ఉద్యోగి ఎన్ని సంవత్సరాల సర్వీసు పూర్తిచేశాడో లెక్కించి, ఏడాదికి 35 రోజుల జీతం చొప్పున ఇస్తారు.

- వీఆర్‌ఎస్‌ తీసుకున్న తేదీ నుంచి సదరు ఉద్యోగి పదవీ విరమణ తేదీ వరకు ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయో...ఏడాదికి 25 రోజుల వేతనం చొప్పున ఇస్తారు.

- ఉద్యోగికి ఇచ్చే నష్టపరిహారం కనీస మొత్తం రూ.25 వేలు ఉంటుంది. మొత్తం అన్ని లెక్కలు వేసి 250 రోజుల వేతనం ఇస్తారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది అందజేస్తారు.

- అయితే ఉద్యోగికి పరిహారంగా వచ్చే మొత్తం...అతడికి మిగిలిన సర్వీసులో ప్రస్తుత కేడర్‌ ద్వారా వచ్చే జీతానికి మించకుండా చూస్తారు.

- వీఆర్‌ఎస్‌ పథకానికి లెక్కించే జీతంలో బేసిక్‌ పే, కరువు భత్యం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. నెలకు 30 రోజుల చొప్పున లెక్కిస్తారు.

2,500 మందిని తగ్గించాలని యోచన

ప్రస్తుతం ప్లాంటులో ఉన్న ఉద్యోగులను 33 శాతం తగ్గించాలని ఉక్కు మంత్రిత్వ శాఖ చాలాకాలంగా చెబుతోంది. ముడి పదార్థాల కొనుగోలుకు కూడా నిధులు లేని సంస్థలో పనిచేస్తే భవిష్యత్తు ఉండదని యువ ఉద్యోగులు చాలా మంది ఇతర సంస్థల్లో అవకాశాలు చూసుకొని వెళ్లిపోతున్నారు. మరికొందరు పనిచేసినా జీతాలు ఇవ్వడం లేదని, ఆరోగ్యం పాడైపోతున్నదని ముందే ‘సిక్‌’ పేరుతో శాశ్వత సెలవు తీసుకుంటున్నారు. ఏడాదికి వేయి మంది వరకు రిటైర్‌ అయిపోతున్నారు. ఇప్పుడు మిగిలిన వారిలో కనీసం 2,500 మందిని వీఆర్‌ఎస్‌ ద్వారా ఇళ్లకు పంపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దీని కోసం కేంద్రం రూ.1,445 కోట్ల నిధులను ఎనిమిది నెలల క్రితమే కేటాయించి పెట్టింది. ప్లాంటు గడ్డు పరిస్థితుల్లో ఉందని, బొగ్గు కొనడానికి కూడా డబ్బులు లేవని తెలిసినా పైసా విదిల్చని కేంద్రం వీఆర్‌ఎస్‌కు మాత్రం దాదాపుగా రూ.1,500 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడడాన్ని ఉద్యోగ వర్గాలు తప్పుపడుతున్నాయి. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడిపే ఆలోచన ఉక్కు మంత్రిత్వ శాఖకు లేదని, అందుకే ఉద్యోగుల సంఖ్యను తగ్గించేస్తున్నదని ఆరోపిస్తున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:57 AM