ఆధార్ దిద్దుబాటుకు నిరీక్షణ
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:13 AM
విద్యార్థులకు ‘అపార్’ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ) నంబర్ల కేటాయింపు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిదిద్దేందుకు విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల రాకతో ఆధార్ కేంద్రం వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
చోడవరంలోని కేంద్రం వద్ద పెరిగిన రద్దీ
రెండు నియోజకవర్గాలకు ఇదే పెద్ద దిక్కు
గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి
చోడవరం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ‘అపార్’ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ) నంబర్ల కేటాయింపు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిదిద్దేందుకు విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల రాకతో ఆధార్ కేంద్రం వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
విద్యార్థులకు, వారి చదువుకు సంబంధించి సమస్త వివరాలను సమగ్రంగా నమోదు చేసేలా ‘అపార్’ నంబర్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అపార్ నంబరు కేటాయింపు సందర్భంగా ఆధార్ కార్డులో చిన్నపాటి తప్పు ఉన్నా సాఫ్ట్వేర్ తిరస్కరిస్తుండడంతో విద్యార్థులు తమ ఆధార్ కార్డుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు ఆధార్ నమోదు కేంద్రానికి వస్తున్నారు. చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతం చోడవరంలో మాత్రమే ఆధార్ నమోదు కేంద్రం వుండడంతో ఆయా మండలాల నుంచి విద్యార్థులు, ఇతరులు పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తున్నారు. వాస్తవంగా ఆధార్ కార్డుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు మీసేవా కేంద్రాలతోపాటు, పోస్టాఫీసు, బ్యాంకులకు ప్రభుత ్వం అవకాశం కల్పించింది. అయితే గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీసేవా కేంద్రాల సర్వీసులన్నింటినీ గ్రామ/ వార్డు సచివాలయాలకు బదలాయించడంతో చాలా వరకు మీ సేవాకేంద్రాలు మూతపడ్డాయి. ఒకటీ అరా కేంద్రాలు నడుస్తున్నప్పటికీఆధార్ కార్డుల్లో తప్పులు సరిదిద్దే అనుమతులు లేవు. మాడుగుల, బుచ్చెయ్యపేట మండలాల్లో ఉన్న ఆధార్ కేంద్రాలు ప్రస్తుతం పనిచేయడం లేదు. ఇక పోస్టాఫీసు, బ్యాంకుల్లో సిబ్బంది కొరత పేరుతో ఆధార్ కార్డుల్లో తప్పులను సవరించే పనులు తాము చేయడం లేదని చెబుతున్నారు. దీనితో మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లోని పలు మండలాలకు చెందిన విద్యార్థులు, సాధారణ ప్రజలు చోడవరం రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో స్థానిక పంచాయతీ కార్యాలయంలోని ఆధార్ కేంద్రం నిత్యం రద్దీగా వుంటున్నది. ఆధార్లో తప్పులను తప్పనిసరిగా సరిదిద్దుకోవాల్సి రావడంతో గంటల తరబడి నిరీక్షించి పనులు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతి మండలంలో ఆధార్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకు రావాలని పలువురు కోరుతున్నారు.