ఉద్యోగాలకు నిరీక్షణ!
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:11 PM
జిల్లాలోని వివిధ మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి ఈ ఏడాది అక్టోబరులో అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ నేటికీ ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగి రెండు నెలలు కావస్తున్నా నేటికీ ఇంటర్వ్యూలకు ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
కేజీబీవీల్లో పోస్టుల భర్తీ ఎప్పుడు..?
42 పోస్టులకు 436 మంది దరఖాస్తులు
రెండు నెలల క్రితమే ధ్రువపత్రాల పరిశీలన
ఇంటర్వ్యూల కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు
జాప్యంపై అభ్యర్థుల పెదవి విరుపు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని వివిధ మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి ఈ ఏడాది అక్టోబరులో అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ నేటికీ ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగి రెండు నెలలు కావస్తున్నా నేటికీ ఇంటర్వ్యూలకు ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
జిల్లా వ్యాప్తంగా 42 పోస్టుల భర్తీకి చర్యలు
జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 42 పోస్టుల భర్తీకి అధికారులు ఈ ఏడాది అక్టోబరులోనే చర్యలు చేపట్టారు. మొత్తం 42 పోస్టులకు గానూ 436 మంది దరఖాస్తులు చేశారు. మూడు ప్రిన్సిపల్ పోస్టులకు 38 మంది, నాలుగు అకౌంటెంట్ పోస్టులకు 52, 1 వార్డెన్ పోస్టుకు 68, 34 కాంట్రాక్ట్ టీచర్ పోస్టులకు 278 మంది దరఖాస్తు చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజిరావు ఆధ్వర్యంలో అక్టోబరు 19, 20, 21 తేదీల్లో కలెక్టరేట్‌లో ఆయా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను చేపట్టారు. త్వరలోనూ అర్హులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తామని అధికారులు ప్రకటించారు.
రెండు నెలలుగా అభ్యర్థుల నిరీక్షణ
జిల్లాలో వివిధ కేజీబీవీల్లో పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు రెండు నెలలుగా ఇంటర్వ్యూల పిలుపుల కోసం నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి అక్టోబరు నెలాఖరులోనే ఇంటర్వ్యూలకు ఆహ్వానించి, తర్వాత ప్రతిభ చూసిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేసి నవంబరులోనే వారికి పోస్టింగ్‌లు ఇస్తారని అభ్యర్థులు ఆశించారు. కాని అందుకు భిన్నంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తయి రెండు నెలలు దాటుతున్నప్పటికీ ఇంటర్వ్యూలకు పిలవకపోగా.. పోస్టుల భర్తీ ప్రక్రియను అధికారులు మర్చిపోయినట్టుగా మిన్నకున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఒక్కో పోస్టునకు ఐదుగురు అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూలకు ఆహ్వానించేందుకు విద్యాశాఖ ఫైలు సిద్ధం చేసి, జిల్లా కలెక్టర్‌కు సమర్పించిందని విద్యాశాఖాధికారులు అంటున్నారు. అయితే ఇంటర్వ్యూల ప్రక్రియను జాయింట్ కలెక్టర్ లేదా సబ్‌కలెక్టర్ ద్వారా నిర్వహించాలనే ఆలోచనతో ఇన్నాళ్లుగా ఆలస్యమైందని తెలిసింది. ఏదిఏమైనాప్పటికీ కేజీబీవీల్లోని ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అందుకు అవసరమైన చర్యలు చేపడతారని పలువురు అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.