ఇసుకకు నిరీక్షణ
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:18 AM
మండలంలో భవన నిర్మాణాలకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది.
సబ్బవరంలో ఆగిన ఇళ్ల నిర్మాణాలు
స్థానికంగా నదులు లేకపోవడం, ప్రభుత్వపరంగా సరఫరా కాకపోవడంతో సమస్య
ఒడిశా నుంచి ఇసుక రప్పిస్తున్న దళారులు
టన్ను రూ.1,500కు విక్రయం
అంత ధరకు కొనలేక భవన నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలుపుదల
పనులు లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులు
సబ్బవరం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):
మండలంలో భవన నిర్మాణాలకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. మండల పరిధిలో నదులు లేకపోవడం, ప్రభుత్వ ఇసుక సరఫరా ఇంకా మొదలు కాకపోవడంతో ఇసుక కొరత ఏర్పడింది. ఇదే అదనుగా భావించి కొంతమంది దళారులు ఒడిశా నుంచి ఇసుకను రప్పించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఎక్కువ రేటుకు ఇసుక కొనుగోలు చేయలేక పలువురు భవన నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ సబ్బవరం మండలంలో మాత్రం ఇసుక లభించని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ మండలంలో ఎక్కడా నదులు లేవు. ఇసుక విక్రయాలకు ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయలేదు. ఫలితంగా చాలా వరకు భవన నిర్మాణాలు ఆగిపోయాయి. వైసీపీ హయాంలో అనకాపల్లి మండలం కోడూరు, చోడవరం మండలం అడ్డూరు సమీపంలో ఏర్పాటుచేసిన ఇసుక డిపోలు రెండేళ్లకే మూసివేయడంతో దళారులు రాజమహేంద్రవరం, శ్రీకాకుళంతోపాటు ఒడిశా నుంచి ఇసుకను తీసుకొచ్చి టన్ను ఇసుక రూ.1,200కు విక్రయించేవారు. వైసీపీ ప్రభుత్వం విక్రయించిన ధరకే దళారులు కూడా ఇసుక విక్రయిస్తుండడంతో భవన నిర్మాణాలకు ఇబ్బంది కలగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు నెలలు వరకు ఇదే విధంగా ఇసుక అమ్మకాలు జరిగాయి. తరువాత ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావడం, నదుల్లో వరద పెరగడంతో ఇసుక సరఫరా నిలిచిపోయింది. కొద్ది రోజులకే దళారులు మళ్లీ రంగంలోకి దిగి ఒడిశా నుంచి భారీ వాహనాల్లో ఇసుక తీసుకొచ్చి, ఇక్కడ అధిక ధరకు విక్రయించడం మొదలు పెట్టారు. గతంలో టన్ను రూ.1,200కు లభించగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు విక్రయించారు. తరువాత చోడవరం, మాడుగుల నియోజకవర్గాలోని నదుల్లో ఇసుక అందుబాటులోకి రావడంతో క్రమంగా రేటు తగ్గించుకుంటూ ఇప్పుడు రూ.1,500కు అమ్ముతున్నారు. అయినప్పటికీ ధర అధికంగా వుండడంతో పలువురు భవన నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా భవన నిర్మాణ కార్మీకులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో మాదిరిగా ప్రభుత్వం డిపోలు ఏర్పాటు చేసి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని భవన నిర్మాణ యజమానులు, కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.