జల వనరుల బకాయిలు రూ.389.12 కోట్లు
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:22 AM
ఉత్తరాంధ్ర జిల్లాల్లో గడచిన రెండు, మూడేళ్లలో జల వనరుల శాఖ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి రూ. 389.12 కోట్ల బకాయిలు ఉన్నట్టు నార్త్ కోస్టల్ చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు
ప్రభుత్వానికి నివేదిక
కాలువల నిర్వహణ కోసం రూ.20 కోట్లతో ప్రతిపాదనలు
ఈ ఏడాది ఖరీఫ్‌లో 6.18 లక్షల ఎకరాలకు సాగునీరు
విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర జిల్లాల్లో గడచిన రెండు, మూడేళ్లలో జల వనరుల శాఖ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి రూ. 389.12 కోట్ల బకాయిలు ఉన్నట్టు నార్త్ కోస్టల్ చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రూ.121.12 కోట్ల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌కు అప్‌లోడ్ చేశామన్నారు. మరో రూ.29.09 కోట్ల బిల్లులు సిద్ధం చేశామన్నారు. ఇంకా రూ.238.89 కోట్ల విలువైన పనులు పూర్తికాగా వాటి వివరాలు ఎంబుక్‌లో నమోదుచేయాల్సి ఉందన్నారు. ఉత్తరాంధ్రలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు 18 ఉన్నాయని, వీటిలో వంశధార ప్రాజెక్ట్సు నిర్వహణ, అత్యవసర పనులు చేపట్టిందుకు రూ.25 కోట్లు, తారకరామా ప్రాజెక్టుకు రూ.20 కోట్లు, మూడు జిల్లాల్లో జపాన్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.35 కోట్లు బిల్లులు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇంకా మహేంద్రతనయా ఆఫ్‌షోర్ ప్రాజెక్టు కోసం రూ.35 కోట్లతో పనులు పూర్తిచేయగా, వాటిలో రూ.20.34 కోట్ల బిల్లులు అప్‌లోడ్ చేశామన్నారు. నదుల వరద కట్టల మరమ్మతుల కోసం రూ.51 కోట్లు వెచ్చించగా రూ.17 కోట్లు, తాటిపూడి ప్రాజెక్టు కింద రూ.17.6 కోట్ల పనులకు బిల్లులు అప్‌లోడ్ చేశామని వివరించారు. ఇటీవల జల వనరుల శాఖా మంత్రి సమీక్షలో బకాయిల వివరాలు ఇవ్వాలని ఆదేశించడంతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బిల్లులపై నివేదిక రూపొందించి అందజేశామన్నారు.
ఇదిలావుండగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఉత్తరాంధ్రలో 6.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలతోపాటు కొత్తగా తవ్విన కాలువల ద్వారా 84 వేల ఎకరాలకు నీరు విడుదల చేశామన్నారు. ఇంకా వంశధార, తాటిపూడి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీరు విడుదల చేశామన్నారు. కాగా, ప్రాజెక్టుల కింద కాలువల నిర్వహణ కోసం ఈ ఏడాది రూ.20 కోట్లు అవసరమని ప్రతిపాదించామన్నారు. ఇంకా నదులు, కాలువల గట్టు పటిష్టం చేయడం, గండ్లు పూడ్చడం, నిర్వహణకు నిధులు అవసరమని కోరినట్టు సీఈ సుగుణాకరరావు తెలిపారు. కాలువల పర్యవేక్షణకు 728 మంది లస్కర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తామన్నారు.