Share News

జీసీసీపై గిరిజనులకు నమ్మకం కలిగిస్తాం

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:06 PM

గిరిజనులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ.. జీసీసీ అండగా ఉందనే నమ్మకం కల్పించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

జీసీసీపై గిరిజనులకు నమ్మకం కలిగిస్తాం
కాశీపట్నం జీసీసీ గోదామును పరిశీలిస్తున్న జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌

దశల వారీగా భవనాల మరమ్శతులు

జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌

అనంతగిరి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ.. జీసీసీ అండగా ఉందనే నమ్మకం కల్పించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని కాశీపట్నం జీసీసీ గోదాము, బ్రాంచ్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీసీసీ ద్వారా గిరిజనులకు అందుతున్న నిత్యావసర సరుకులపై ఆరా తీశారు. జీసీసీ మేనేజర్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల నిల్వ ఉంచే గోదాము, డీఆర్‌ డిపోలు శిథిలావస్థకు చేరుకున్నాయని వివరించారు. అనంతరం కిడారి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరుకున్న గోదాములతోపాటు డీఆర్‌ డిపోల మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. గిట్టుబాటు ధరతో కాఫీ కొనుగోలు చేస్తున్నామని, దళారులను నమ్మి గిరిజనులు మోసపోవద్దని శ్రావణ్‌కుమార్‌ కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తరువాత గిరిజనాభివృద్ధిపై దృష్టిసారించిందని, గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలను కల్పిస్తుందన్నారు.

ఈ సందర్భంగా కాశీపట్నం వాసులు జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌ను కలిసి తమ గోడును చెప్పుకున్నారు. కాశీపట్నంలో పారిశుధ్యం మెరుగుపరచాలని, తాగునీటి పథకాల్లో క్లోరినేషన్‌ చేయడం లేదని వాపోయారు. అలాగే కాశీపట్నం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇటీవల నియమించిన రామస్వామిని బదిలీ చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈయన గతంలో విధులు నిర్వహించి, పలు అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. ఆయన్ని బదిలీ చేయకపోతే ఆందోళన చేపడతామని గ్రామస్థులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని సర్పంచ్‌ జె.లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు సన్యాసిరావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి టి.ఆనందరావు, కార్యవర్గ సభ్యుడు ఎం.జోగులు, టీడీపీ సీనియర్‌ నాయకులు శివ, లక్ష్మణ్‌, పుష్పనందం, కొత్తూరు వైస్‌ సర్పంచ్‌ నరేంద్ర, దాలమ్మ, అంగరయ్య, ఎస్సీ ఆర్గనైజేషన్‌ కార్యదర్శి నిర్మల, భీమరాజు, రంజీత్‌, పి.జగన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 10:06 PM