Share News

అర్హులందరికీ సంక్షేమం

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:15 AM

గత వైసీపీ ప్రభుత్వం వలంటీరు వ్యవస్థను అడ్డంపెట్టుకుని పలుచోట్ల వైసీపీకి అనుకూలంగా వున్న వారికే సంక్షేమ పథకాలు అందించింది.

అర్హులందరికీ సంక్షేమం

  • జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వే

  • వివరాలు సేకరిస్తున్న వార్డు/ గ్రామ సచివాలయాల సిబ్బంది

  • కుటుంబ సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, జియో ట్యాగ్‌

  • ఈ నెల 24వ తేదీనాటికి సర్వే పూర్తి

  • సూపర్‌-6తోపాటు అన్ని పథకాలకు అర్హుల గుర్తింపు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వం వలంటీరు వ్యవస్థను అడ్డంపెట్టుకుని పలుచోట్ల వైసీపీకి అనుకూలంగా వున్న వారికే సంక్షేమ పథకాలు అందించింది. ఏవేవో కుంటి సాకులు చెప్పి ఇతర రాజకీయ పార్టీ మద్దతుదారులకు సంక్షేమ పథకాలను అందకుండా చేసింది. కుటుంబ సభ్యుల వివరాల నమోదును మొక్కుబడిగా కానిచ్చారు. దీంతో పలు గ్రామాల్లో అర్హతలున్న ఎంతో మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వ బాధితులంతా తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చేస్తున్నారు. అర్హులందరికీ సూపర్‌-6తో అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించడానికి కూటమి ప్రభుత్వం కుటుంబాల వివరాలను సేకరిస్తున్నది.

పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పయనిస్తున్నది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇంటింటా జయో ట్యాగింగ్‌ ప్రక్రియకు గత వారం శ్రీకారం చుట్టింది. గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి ఇంటిని మ్యాపింగ్‌ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి క్టస్టర్ల వారీగా ప్రభుత్వ యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసి, జియో ట్యాగ్‌ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఫొటోను తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. నిరక్షరాస్యులైతే వేలిముద్ర, ముఖ ఆధారిత ఫొటో తీసుకుంటున్నారు. ఒక్కో ఉద్యోగి పట్టణ ప్రాంతాల్లో అయితే కనీసం 150 ఇళ్లను, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 70-80 ఇళ్లను మ్యాపింగ్‌ చేసేలా పని విభజన చేశారు. జియో ట్యాగింగ్‌ సర్వే పర్యవేక్షణ బాధ్యతలను మండలాల్లో అయితే ఎంపీడీఓలను, పట్టణాల్లో అయితే మునిసిపల్‌ అధికారులకు అప్పగించారు.

అనకాపల్లి జిల్లాలో మొత్తం 5,80,202 కుటుంబాలు వున్నాయి. జిల్లా అధికారుల గణాకాల ప్రకారం ఇప్పటి వరకు 3,02,913 (52 శాతం) కుటుంబాలకు సంబంధించి సర్వే పూర్తయ్యింది. మిగిలిన ఇళ్ల సర్వే కొనసాగుతున్నది. జియో ట్యాగింగ్‌ ప్రక్రియను ఈ నెల 24వ తేదీనాటికి పూర్తిచేయాలని ఎంపీడీవోను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారని గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది సమన్వయాధికారి మంజులావాణి తెలిపారు.

Updated Date - Nov 19 , 2024 | 01:15 AM