అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:08 AM
కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు అందితేనే అభివృద్ధి సాధ్యమని, పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.
జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలి
ఎంపీ సీఎం రమేశ్
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
మండలానికో అధికారిని నియమించి బాధ్యతలు అప్పగించాలి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
పథకాల అమలుపై విస్తృత చర్చ
ప్రతి గ్రామానికి రహదారి
నాన్ షెడ్యూల్ ఏరియాలోని గిరిజనులకు షెడ్యూల్ ఏరియాలోని పథకాలు వర్తింపు
ప్రతి మండలం నుంచి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన 200 మందికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు
అనకాపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు అందితేనే అభివృద్ధి సాధ్యమని, పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 38 శాఖల ద్వారా అమలు చేస్తున్న 58 రకాల పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా డెవలప్‌మెంట్ కో-ఆర్డినేషన్, మోనటరింగ్ కమిటీ (దిశ) సమీక్ష సమావేశాన్ని శనివారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలతో కలిసి ఆయన నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన నిధుల ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 58 రకాల పథకాలు, వాటిని క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు చేయాలనే దానిపై అధికారులకు సీఎం రమేశ్ దిశానిర్దేశం చేశారు. జిల్లా, నియోజకవర్గ, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తీసుకోవాలన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, కనీసం దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియక అనేకమంది పేదలు పథకాలను పొందలేకపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం గ్రామస్థాయిలో పథకాలపై ప్రచారం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని, దీంతో అనేక మందికి అవగాహన లేక లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. కలెక్టర్ చొరవ తీసుకొని పథకాలపై ప్రజలకు అవగాహన, ప్రచారం కల్పించేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. సమావేశానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, ప్రగడ నాగేశ్వరరావులు హాజరై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు తమ వంతు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశానికి కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లాలో వివిధ మండలాల ఎంపీపీలు, అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో చర్చించిన అంశాలు
- రోడ్డు సదుపాయం లేని ప్రతి గ్రామానికి రహదారి నిర్మించాలి. 20 ఏళ్ల కిందట వేసిన సిమెంట్ రోడ్లను మళ్లీ వేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలి.
- నాన్ షెడ్యూల్ ఏరియాలో వున్న గిరిజనులకు కూడా షెడ్యూల్ ఏరియాలో అమలు జరుగుతున్న పథకాలు వర్తింపజేయాలి.
- ప్రతి గ్రామంలో రోడ్లతోపాటు డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలి.
- అంగన్‌వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణాలు, పాఠశాలలకు ప్రహరీల నిర్మాణ పనులు, జిల్లాలో మరమ్మతులకు గురైన 182 పాఠశాల భవనాలకు మరమ్మతులు చేపట్టాలి.
- ప్రతి మండలం నుంచి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన 200 మంది యువతీ, యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వాలి.
- పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన గృహ నిర్మాణాలను పూర్తి చేయాలి. గతంలో అనర్హులకు కేటాయించిన గృహాలు రద్దు చేయాలి.
- ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డులు పంపిణీ చేయాలి.
- అనకాపల్లిలో 2025 మార్చి నాటికి డయాలిసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి.
- ముద్ర, ఎన్‌ఎన్‌ఎం పథకాల ద్వారా వ్యాపారాలు చేసుకొనేందుకు యూనిట్ల ఏర్పాటుకు ఏడాదిలో లక్ష మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి.
- అనకాపల్లి నుంచి అగనంపూడి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి. ఫ్లైఓవర్ల నిర్మాణాలకు డీపీఆర్‌లు రూపొందించాలి.
- అవసరమైన దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయాలి. సదరం నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలి.