Share News

ఆక్రమణదారులపై కొరడా

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:21 PM

పాడేరు మండలంలోని చింతలవీధి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ భూముల్లో మొత్తం 26 మంది అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించి మంగళవారం నుంచి ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. అక్రమార్కులకు కొమ్ముకాసిన రెవెన్యూ సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించనున్నారు.

ఆక్రమణదారులపై కొరడా
ఆక్రమణదారులకు మంగళవారం నోటీసులు ఇస్తున్న రెవెన్యూ సిబ్బంది

ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు

చింతలవీధి పంచాయతీ పరిధిలో 26 మంది అక్రమార్కులు ఉన్నట్టు నిర్ధారణ

నోటీసులు జారీ చేస్తున్న రెవెన్యూ అధికారులు

స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని.. లేకుంటే తొలగిస్తామని హెచ్చరిక

ఆక్రమణలకు సహకరించిన సిబ్బందిపైనా చర్యలకు సిద్ధం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు మండలంలోని చింతలవీధి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ భూముల్లో మొత్తం 26 మంది అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించి మంగళవారం నుంచి ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. అక్రమార్కులకు కొమ్ముకాసిన రెవెన్యూ సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించనున్నారు.

పాడేరు- అరకులోయ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి పలువురు గతంలో దుకాణ సముదాయాలను నిర్మించారు. వాస్తవానికి వారంతా ప్రైవేటు భూములు కొనుగోలు చేసినప్పటికీ హైవేను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి దుకాణాలను నిర్మించారు. అలాగే సచివాలయానికి చేరువలో మొత్తం ప్రభుత్వ భూమిలోనే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. దీంతో ఆయా అక్రమ నిర్మాణాలపై కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌కు పలువురు ఫిర్యాదులు చేయడం, దానిపై ఆయన సీరియస్‌ కావడం, భూముల ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఈ నెల 17న ‘భూ ఆక్రమణపై కలెక్టర్‌ సీరియస్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం కూడా ప్రచురితమైంది.

ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు

మండలంలోని చింతలవీధి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ్‌ను కలెక్టర్‌ ఆదేశించడంతో ఆయన రంగంలోకి దిగారు. ఇప్పటికే చింతలవీధి పంచాయతీలో ప్రధానంగా గ్రామ సచివాలయం సమీపంలో, తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో గల ఆక్రమణలను గుర్తించారు. మొత్తం 26 మంది ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టారని నిర్ధారించారు. వారికి మంగళవారం నుంచి నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం పలువురు అందుబాటులో ఉండగా, మరి కొంతమంది ఆచూకీ లేని పరిస్థితి నెలకొంది. తాము నోటీసులు జారీ చేసి, ప్రభుత్వ భూమిని అప్పగించేందుకు తగిన సమయం ఇస్తామని, గడువులోగా దుకాణాలను ఖాళీ చేయకుంటే తామే స్వయంగా ఆయా నిర్మాణాలను తొలగిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆయా దుకాణాలను ఖాళీ చేసిన అనంతరం వాటిని తొలగించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.

క్షేత్ర స్థాయి రెవెన్యూ సిబ్బందిపై త్వరలో చర్యలు

చింతలవీధి పంచాయతీలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించి పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే కనీసం పట్టించుకోకుండా మిన్నకున్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఆక్రమణల తొలగింపు అనంతరం రెవెన్యూ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. పాడేరు- అరకులోయ హైవేను ఆనుకుని ప్రభుత్వ భూమిని ఆక్రమించి దర్జాగా నిర్మాణాలు చేపట్టడంలో రెవెన్యూ సిబ్బంది ప్రోత్సాహం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయి రెవెన్యూ వర్గాల్లో గబులు నెలకొంది.

Updated Date - Oct 22 , 2024 | 11:21 PM