మన్యంలో పీహెచ్‌సీలు పెరిగేనా?
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:49 AM
గిరిజనాభివృద్ధి, ప్రధానంగా విద్య, వైద్య రంగాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుండడంతో గతంలో ఏజెన్సీలో ఆరు కొత్త పీహెచ్‌సీల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాలుస్తాయని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు
- కనీసం పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం
- ఇప్పటికే ఏజెన్సీ వ్యాప్తంగా 35 పీహెచ్‌సీలు
- కొత్తవి మంజూరైతే 41కి చేరే అవకాశం
- కూటమి ప్రభుత్వంపై గిరిజనుల ఆశలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గిరిజనాభివృద్ధి, ప్రధానంగా విద్య, వైద్య రంగాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుండడంతో గతంలో ఏజెన్సీలో ఆరు కొత్త పీహెచ్‌సీల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాలుస్తాయని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీలో మండలాల విస్తీర్ణం అధికంగా ఉండడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేని పరిస్థితుల దృష్ట్యా ఆయా ప్రాంత గిరిజనులకు వైద్యారోగ్య సేవలు సక్రమంగా అందడం లేదని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేస్తే వైద్య సేవలు గిరిజనులకు మరింత చేరువవుతాయని భావించారు. ఇందులో భాగంగా అవసరమైన సమగ్ర సర్వే చేపట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి రెండేళ్ల క్రితమే అప్పటి కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా 35 పీహెచ్‌సీలు ఉండగా, కొత్తవి మంజూరైతే 41కి చేరతాయి. ఏజెన్సీ 11 మండలాల పరిధిలో ఏడు లక్షల మంది గిరిజన జనాభాకు మండల, గ్రామ స్థాయిలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అలాగే జిల్లా కేంద్రం పాడేరులో రెండు వందల పడకల జిల్లా ఆస్పత్రి, అరకులోయ, చింతపల్లిలో వంద పడకల ఏరియా ఆస్పత్రులు, ముంచంగిపుట్టులో యాభై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. అయినప్పటికీ మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు సకాలంలో వైద్య సేవలు అందని దుస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో కొయ్యూరు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట, పాడేరు మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. మండల కేంద్రాలకు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఉండడం, ఆయా గ్రామాలకు ఎటువంటి రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో పాటు పీహెచ్‌సీలకు సైతం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గ్రామాలున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని గిరిజనులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడినా సకాలంలో వైద్య సేవలు అందని దుస్థితి కొనసాగుతున్నది. దీంతో మన్యంలో మారుమూల ప్రాంతాల్లో మరిన్ని పీహెచ్‌సీలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.
రెండేళ్ల క్రితమే కొత్త పీహెచ్‌సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
మన్యంలో కొత్తగా మరో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ సుమిత్‌కుమార్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపారు. ఏజెన్సీలో హుకుంపేట మండలం మజ్జివలస, పెదబయలు మండలం పెదకోడాపల్లి, పాడేరు మండలం డోకులూరు, కొయ్యూరు మండలంలో నడింపాలెం, జి.మాడుగుల మండలంలో మద్దిగరువు, సొలంభం ప్రాంతాల్లో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు. మన్యంలో ప్రైవేటు వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు ప్రభుత్వం అందించే వైద్య సేవలపైనే పూర్తిగా ఆధారపడతారు. అందువల్ల ఏజెన్సీలో కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని గిరిజనులకు మేలు జరుగుతుందని వైద్యారోగ్యశాఖాధికారులకు కలెక్టర్ సూచించారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం కొత్త పీహెచ్‌సీల ఏర్పాటు ప్రతిపాదనలపై కనీసం స్పందించలేదు.
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుండడంతో తమ ప్రాంతంలో కొత్త పీహెచ్‌సీల ఏర్పాటునకు సానుకూలంగా చర్యలు చేపడుతుందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో రోడ్డు, రవాణా సదుపాయాలు సంపూర్ణంగా లేకపోవడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సైతం దూరంగా ఉండడంతో మారుమూల ప్రాంత వాసులు వైద్య సేవలకు నోచుకోని దుస్థితి కొనసాగుతున్నది. ఈ తరుణంలో మన్యంలో కొత్త పీహెచ్‌సీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపితే తమకు న్యాయం జరుగుతుందని మారుమూల ప్రాంత గిరిజనులు అభిప్రాయపడుతున్నారు.