ప్రభుత్వ భూములకు రెక్కలు
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:19 AM
మండలంలోని వెదుళ్లనరవలో విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కబ్జాదారులు బేఖాతరు చేస్తున్నారు. కొంతమంది స్థానిక నాయకులు ఖాళీగా వున్న ప్రభుత్వ స్థలాలు, భూములను కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఏర్పాటు చేస్తున్న హెచ్చరిక బోర్డులను సైతం పీకిపారేస్తున్నారు. వెదుళ్లనరవ జీవీఎంసీ పరిధిలో ఉండడం, పారిశ్రామిక ప్రాంతం దువ్వాడకు అనుకొని ఉండడంతో ఇక్కడ భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. గజం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంది.
వెదుళనరవలో రూ.కోట్లు విలువైన స్థలాలు కబ్జా
ప్రజల ఫిర్యాదులతో ‘రెవెన్యూ’ హెచ్చరిక బోర్డులు
తెల్లవారేసరికి బోర్డులు మాయం చేస్తున్న ఆక్రమణదారులు
స్థలాల చుట్టూ ప్రహరీగోడల నిర్మాణం
మరికొన్నిచోట్ల జిరాయితీతో కలిపి.. ప్లాట్లుగా విక్రయం
సబ్బవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వెదుళ్లనరవలో విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కబ్జాదారులు బేఖాతరు చేస్తున్నారు. కొంతమంది స్థానిక నాయకులు ఖాళీగా వున్న ప్రభుత్వ స్థలాలు, భూములను కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఏర్పాటు చేస్తున్న హెచ్చరిక బోర్డులను సైతం పీకిపారేస్తున్నారు. వెదుళ్లనరవ జీవీఎంసీ పరిధిలో ఉండడం, పారిశ్రామిక ప్రాంతం దువ్వాడకు అనుకొని ఉండడంతో ఇక్కడ భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. గజం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంది.
వెదుళ్లనరవ సర్వే నంబరు 118లో 2.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే సుమారు 1.5 ఎకరాల భూమి అన్యాక్రాంతంకాగా సుమారు 80 సెంట్లు మిగిలి ఉంది. గతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకొని విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను పీకేశారు. భూమి చుట్టూ ఇటుకలు, కాంక్రీటు పలకలతో ప్రహరీ గోడ నిర్మించారు.
వెదుళ్లనరవ సర్వే నంబరు 102లో 3.87 ఎకరాలు గెడ్డ/వాగు పోరంబోకు భూమి, సర్వే నంబరు 101లో 96 సెంట్ల ప్రభుత్వ భూమి(గయాళు) ఉంది. వీటి పక్కనే వున్న జిరాయితీ భూములను ఓ వ్యక్తి కొనుగోలు చేసి, గెడ్డవాగు భూమి, గయాళు భూమి ఆక్రమించాడు. అనంతరం లే-అవుట్ వేసి ప్లాట్లుగా అమేశాడు. ఈ భూముల్లో కొంత మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, సర్వే నంబరు 101లో కొంత భూమి ఖాళీగా ఉంది. దీనిని గతంలో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా కొంత మంది చోటా నేతలు సర్వే నంబరు 102లో ఖాళీగా ఉన్న సుమారు 1,000 గజాల స్థలాన్ని అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
గెడ్డవాగును ఆక్రమించి లే-అవుట్
వెదుళ్లనరవ సర్వే నంబరు 77/2లో 1.08 ఎకరాల గెడ్డవాగు పోరంబోకు భూమి ఉంది. ఓ వ్యక్తి దీనికి ఆనుకొని రెండు ఎకరాల జిరాయితీ భూమిని కొనుగోలు చేశాడు. అనంతరం గెడ్డవాగును ఆక్రమించి లే-అవుట్ వేసి విక్రయిస్తున్నాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టడం.. ఆక్రమణదారులు తొలగించడం పరిపాటిగా మారింది. మరోవైపు లే-అవుట్‌కు వీఎంఆర్‌డీఏ అనుమతులు లేవని అధికారులు ప్రకటన జారీ చేయడం ఈ సందర్భంగా గమనార్హం.