ఆశల మోసులతో...
ABN , Publish Date - Dec 24 , 2024 | 01:42 AM
రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక చక్కెర కర్మాగారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మనుగడ కోసం చివరిపోరాట దిశగా అడుగులు వేస్తున్నది.
చెరకు క్రషింగ్‌కు గోవాడ షుగర్స్ అడుగులు
వెంటాడుతున్న బకాయిలు, అప్పులు
తగ్గిపోయిన చెరకు సాగు విస్తీర్ణం
ఒకప్పుడు ఐదు లక్షల టన్నులకుపైగా చెరకు క్రషింగ్
ఇప్పుడు రెండు లక్షల టన్నులకు చేరుకోవడం గగనం
ఇథనాల్ ప్లాంట్ లేదా డిస్టిలరీ ఏర్పాటుతోనే ఆర్థికంగా వెసులుబాటు
సానుకూలత చూపుతున్న కూటమి ప్రభుత్వం
ఈ సీజన్ గట్టెక్కితే గోవాడకు మంచి రోజులు?
2024-25 క్రషింగ్ సీజన్ ప్రారంభం రేపు
చోడవరం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక చక్కెర కర్మాగారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మనుగడ కోసం చివరిపోరాట దిశగా అడుగులు వేస్తున్నది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ ఫ్యాక్టరీని ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత క్రషింగ్ సీజన్ ఇటు రైతులకు, అటు కార్మికులకు కీలకంగా మారింది. క్రషింగ్ సజావుగా నిర్వహించి, చెరకు రైతులకు త్వరగా చెల్లింపులు జరపగలిగితే ఫ్యాక్టరీకి మంచి రోజులు వచ్చేనట్టేనని భావిస్తున్నారు. గత సీజన్‌కు సంబంధించి రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది క్రషింగ్ జరుగుతుందా, లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో 25వ తేదీ నుంచి క్రషింగ్ ప్రారంభం కానుండడంతో ఫ్యాక్టరీ పరిస్థితిపై అన్నివర్గాల్లో ఆసక్తి కలుగుతున్నది.
చోడవరం (గోవాడ) సహకార చక్కెర ఫ్యాక్టరీకి ఘనమైన చరిత్ర వుంది. సీజన్‌లో ఐదు లక్షల టన్నులకుపైగా చెరకు క్రషింగ్ చేసిన రికార్డు జిల్లాలో ఈ ఫ్యాక్టరీకే సొంతం. అయితే కర్ణుడి మరణానికి సవాలక్ష కారణాలు అన్నట్టు.. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పతనానికి ఎన్నో కారణాలు వున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పంచదార ధరలు పతనం కావడం, ఉత్పత్తి వ్యయం కన్నా పంచదార అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ వుండడం, పంచదార రికవరీ శాతంలో మెరుగుదల లేకపోవడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పుకోవాలి. వీటి కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రైతులకు చెరకు బకాయిల చెల్లింపుల్లో తీవ్రజాప్యం జరుగుతున్నది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడంతో ఫ్యాక్టరీకి చెరకు సరఫరా ఏటేటా తగ్గుతూ వస్తున్నది. 2010-11 నుంచి 2013-14 వరకు ప్రతి సీజన్‌లో ఐదు లక్షల టన్నులకు మించి చెరకు క్రషింగ్ జరిగింది. గత దశాబ్దాన్నర కాలంలో 2013-14 సీజన్ గోవాడ్ షుగర్ ఫ్యాక్టరీకి స్వర్ణ యుగంగా చెప్పాలి. రికార్డుస్థాయిలో 5,50,975 టన్నుల చెరకు గానుగాడారు. తరువాత నాలుగైదేళ్ల వరకు (2016-17 మినహా) ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ నాలుగున్నర లక్షల టన్నులకుపైగానే చెరకు క్రషింగ్ జరిగింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీకి కష్టకాలం మొదలైంది. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో చెరకు రైతులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా చెరకు సాగు తగ్గిపోగా, పలువురు రైతులు ప్రైవేటు ఫ్యాక్టరీలకు చెరకు విక్రయించారు. దీంతో 2021-22లో 2.91 లక్షల టన్నులకు పడిపోయింది. తరువాత ఏటేటా తగ్గిపోతూ గత సీజన్‌లో (2023-24) లక్షా 70 వేల 601 టన్నులకు దిగజారింది. ఎక్కడ ఐదున్నర లక్షల టన్నులు.. ఎక్కడ 1.7 లక్షల టన్నులు! పదేళ్ల కాలంలో 30 శాతానికి తగ్గిపోయింది.
పంచదార ధరల్లో పెద్దగా పురోగతి లేకపోవడం, పంచదార ఉత్పత్తి వ్యయం మరింత పెరిగిపోవడంతో అప్పుల ఊబిలో నుంచి బయటపడలేని పరిస్థితికి చేరింది. ఇదే సమయంలో చెరకు రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో చెరకు సాగును తగ్గించేశారు. గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇంకా టన్నుకు రూ.419 చొప్పున రూ.7.14 కోట్లు చెల్లించాల్సి వుంది. వీటికి తోడు రవాణా ఛార్జీల బకాయిలు మరో కోటి రూపాయల వరకు ఉన్నాయి. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు గ్రాట్యూటీతోపాటు, ఇతర బకాయిలు చెల్లించవలసి ఉంది. ప్రస్తుతం ఫ్యాక్టరీకి రూ.40 కోట్ల మేర ఆప్కాబ్ రుణ భారం వుంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న సీజన్‌లో రెండు లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేయాలని ఫ్యాక్టరీ అధికారులు యోచిస్తున్నారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఏడాది రైతులకు ఎరువులు, చెరకు దవ్వ సరఫరా చేయలేదు. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే చెరకు సాగు తగ్గింది. ఫ్యాక్టరీ సిబ్బంది గట్టిగా ప్రయత్నిస్తే తప్ప, రైతులు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసే వాతావరణం కనిపించడం లేదు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అప్పుల ఊబిలో నుంచి బయటపడాలంటే పంచదార ఉత్పత్తితో పాటు, ఇథనాల్ ప్లాంట్ లేదా డిస్టిలరీ ఏర్పాటు చేసి ఆదాయం వనరులు పెంచుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇథనాల్ ప్లాంట్ లేదా డిస్టిలరీ ఏర్పాటుకు సానుకూలంగా ఉండడంతో ప్రస్తుత క్రషింగ్ సీజన్ గట్టెక్కితే ఫ్యాక్టరీ గాడిలో పడుతుంది. ఈ మేరకు చెరకు రైతుల్లో నమ్మకం పెంచడంతోపాటు, చెరకు సాగు విస్తీర్ణం పెంచేదిశగా కృషి చేయాల్సి వుంది.