నారీమణుల జిమ్ బాట
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:21 AM
మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
గడచని నాలుగేళ్లుగా పెరిగిన సంఖ్య
ప్రతి జిమ్‌లో 40 శాతం మంది మహిళలే..
మహిళల కోసం ప్రత్యేకంగా జిమ్‌లు ఏర్పాటు
బరువు తగ్గేందుకు కొందరు, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మరికొందరు...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఒబేసిటీ, కీళ్లనొప్పులు వంటివి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలు, ఆరోగ్యంపై అవగాహనతో చాలామంది వ్యాయామంపై దృష్టిసారిస్తున్నారు. కొందరు ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తుండగా, మరికొందరు జిమ్‌లో చేరుతున్నారు. జిమ్ అంటే సాధారణంగా పురుషులు మాత్రమే వెళతారన్న భావన ఉండేది. అయితే, గడిచిన కొన్నాళ్లుగా జిమ్‌లో చేరుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా తరువాత జిమ్‌కు వస్తున్న మహిళలు 30 శాతం మేర పెరిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి జిమ్‌లోనూ 40 శాతం మంది మహిళలు ఉంటున్నారు.
ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోసం
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యులు, సహచరులు సూచనలు మేరకు జిమ్‌బాట పడుతున్న మహిళల సంఖ్య అధికంగా ఉంటోంది. వీరిలో ఎక్కువగా గృహిణులు ఉంటున్నారు. పీసీవోడీ, పీసీవోఎస్, థైరాయిడ్, మైగ్రేన్, ఫ్యాటీ లివర్, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి ఇబ్బందులతో బాధపడేవారు వాటి నుంచి ఉపశమనం పొందేందుకు జిమ్ బాట పడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గడంతోపాటు ఇతర సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో చాలామందికి జిమ్‌లో చేరిన నాలుగు, ఐదు నెలల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. గడిచిన కొన్నాళ్లుగా తాను అధిక బరువుతో బాధపడుతున్నానని, జిమ్‌లో చేరిన ఏడు నెలల్లో పది కిలోల వరకు బరువు తగ్గినట్టు జ్యోత్స్న అనే ఆమె చెప్పారు.
జిమ్‌కు వస్తున్న ప్రతి వంద మంది మహిళల్లో 30 మంది విద్యార్థినులు, మరో 30 మంది గృహిణులు, మరో 30 మంది వరకు ఉద్యోగినులు ఉంటుండగా, పది మంది పదేళ్లలోపు బాలికలు ఉంటున్నారు. బాలికలు స్పోర్ట్స్ కోసం జిమ్‌లో చేరి శరీర ఆకృతిని మార్చుకుంటున్నారు. నగరంలో జిమ్‌ను బట్టి నెలకు రూ.1500 నుంచి రూ.2500 వరకూ ఫీజు తీసుకుంటున్నారు. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ప్యాకేజీలు కూడా ఉంటాయి. జిమ్‌లో చేరే మహిళలు తప్పనిసరిగా రోజుకు కనీసం రెండు గంటలు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
ఇవీ వర్కౌట్స్..
మహిళల సమస్యలు, అవసరాలను బట్టి వర్కౌట్స్ చేయిస్తామని ట్రైనర్స్ చెబుతున్నారు. ఎక్కువగా స్ర్టెంత్ ట్రైనింగ్, హీట్ వర్కవుట్స్, బాడీ టోనింగ్, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్/గెయిన్ వర్కౌట్స్ చేయిస్తుంటారు. జిమ్‌లో చేరే మహిళలు తప్పనిసరిగా డైట్ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. పర్సనల్ ట్రైనర్స్ డైట్‌కు సంబంధించి మెనూ చెబుతారు. ఒకవైపు వర్కౌట్స్ చేస్తూనే డైట్ పాటించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అవకాశం ఉంటుంది.
కళకళలాడుతున్న జిమ్‌లు..
ఒకప్పుడు జిమ్‌లు పురుషులపైనే ఆధారపడి ఉండేవి. ఇప్పుడు మహిళలు కూడా భారీగా వస్తుండడంతో అందుకు అనుగుణంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం జిమ్స్‌లు నిర్వహిస్తున్నారు. మహిళల కోసం ఫిట్‌నెస్ ట్రైనర్స్‌ను నిర్వాహకులు నియమించుకుంటున్నారు. కొన్నిచోట్ల పురుష ట్రైనర్సే మహిళలతో వర్కౌట్లు చేయిస్తుంటారు. ఒకప్పుడు జిమ్ అంటే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే తెరిచి ఉండేది. ఇప్పుడు 24 గంటలు రన్ చేస్తున్నారు. మహిళలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే వెసులుబాటును జిమ్ నిర్వాహకుల కల్పిస్తున్నారు.
జిమ్‌లో చేసే వ్యాయామంతో ఫిట్‌గా ఉండొచ్చు
- ఎం.రమ్య, హెచ్‌ఆర్ మేనేజర్
జిమ్‌కు గడిచిన ఆరేళ్లుగా వెళుతున్నా. తొలుత బరువు తగ్గాలని చేరాను. బరువు తగ్గిన తరువాత కూడా వెళ్లడం మానలేదు. జిమ్‌కు వెళ్లినప్పటి నుంచి హెల్తీగా ఉంటున్నా. ప్రతిరోజూ రెండు గంటలు జిమ్‌కు కేటాయిస్తున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్తీగా ఉండేందుకు, ఫిజికల్, మెంటల్ స్ర్టెస్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు వ్యాయామం ఎంతగానో దోహదం చేస్తోంది. అదే సమయంలో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.