తప్పని డోలీ మోత
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:46 AM
మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ దిగువ సంపాల గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యానికి గురైన గ్రామస్థుడిని బుధవారం డోలీలో తరలించాల్సిన దుస్థితి నెలకొంది.
- నాలుగు కిలో మీటర్ల మేర రోగిని మోసుకెళ్లిన వైనం
- దిగువ సంపాల గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఇక్కట్లు
పాడేరురూరల్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ దిగువ సంపాల గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యానికి గురైన గ్రామస్థుడిని బుధవారం డోలీలో తరలించాల్సిన దుస్థితి నెలకొంది.
దిగువ సంపాల గ్రామానికి చెందిన వంతాల మిట్టన్న(50) బుధవారం ఉదయం 7 గంటల సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని గ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ కట్టి సంపాల నుంచి ఎగువ సంపాల గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటించారు. అక్కడ నుంచి కొత్తవలస గ్రామం వరకు సుమారు నాలుగు కిలో మీటర్ల వరకు డోలీలో మోసుకెళ్లారు. అక్కడ నుంచి ప్రైవేటు వాహనంలో పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు జగన్, నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.