వైసీపీ నిర్లక్ష్యం.. పేదలకు శాపం
ABN , Publish Date - Dec 25 , 2024 | 01:07 AM
విశాఖ నగర పరిధిలో టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి.
టిడ్కో ఇళ్ల నిర్మాణంలో తీవ్ర అలసత్వం
ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపు లబ్ధిదారులకు అప్పగిస్తామంటూ ఆర్భాటం
ఇదిగో...అదిగో అంటూ ఐదేళ్లపాటు కాలక్షేపం
టీడీపీ హయాంలో చివరి దశకు చేరిన ఇళ్లకు తుదిమెరుగులు దిద్దడానికే పరిమితం
కేవలం రంగులు మార్చడంతోనే సరి
ఎన్నికలకు ముందు 7,456 మందికి మాత్రమే కేటాయింపు
కొన్నిచోట్ల మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఇళ్ల అప్పగింత
ఇక మిగిలిన లేఅవుట్లలో ఎక్కడి పనులు అక్కడే...
ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ నగర పరిధిలో టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. 2024 ఎన్నికలకు ముందు హడావిడిగా కొన్ని లేఅవుట్లలో పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసినా, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో వాటిల్లో నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది.
పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణం) (పీఎంఏవై) పథకం-అందరికీ ఇళ్లు (అఫార్డబుల్ హౌస్ ఫర్ ఆల్) కింద రాష్ట్రానికి దాదాపు 7 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 3.19 లక్షల ఇళ్లు పట్టణ పేదలకు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. నోడల్ సంస్థగా టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) ఇళ్ల పనులు చూస్తోంది. టిడ్కో ఇళ్ల కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో 3,47,284 మంది దరఖాస్తు చేసుకోగా 2,03,438 మందిని అర్హులుగా గుర్తించారు. అందులో సొంత స్థలాలు కలిగి ఉన్న 8,262 మందికి బీఎల్‌సీ (లబ్ధిదారుడే నిర్మించుకోవడం) కింద పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించారు. స్థలాలు లేని వారికి 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 చదరపు అడుగులు కోసం రూ.25 వేలు, 365 చదరపు అడుగుల ఫ్లాట్ కోసం రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఫ్లాట్‌కు రూ.లక్ష డీడీలు తీయాలని ప్రభుత్వం సూచించింది. అర్హులుగా తేలిన వారిలో 43,844 మంది డీడీలు తీసి జీవీఎంసీ యూసీడీ అధికారులకు అందజేశారు. జీవీఎంసీ పరిధిలో 55 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంగివలస, బక్కన్నపాలెం, కొమ్మాది, దబ్బంద, అచ్చింనాయుడులోవ, ములగాడ, ట్రై జంక్షన్, దువ్వాడ, భానోజీతోట, అగనంపూడి, బర్మా కాలనీ, తలారివానిపాలెం, పెదగంట్యాడ, అనకాపల్లి, కొండకొప్పాక, సిరసపురం, సత్యనారాయణపురం, రాతిచెరువు, చినముషిడివాడ, చీమలాపల్లి, పరవాడ, అప్పికొండ, నడుపూరు, లంకెలపాలెం వంటి ప్రాంతాల్లో భూసేకరణ చేశారు. వీటితోపాటు సుద్దగెడ్డ, ఆదర్శనగర్, చిలకపేట, సీహార్స్ జంక్షన్, రాజీవ్ కాలనీ, పైడిమాంబ కాలనీ, ముత్యాలమ్మకాలనీ, రాజీవ్‌నగర్ కాలనీ, గౌరీనగర్, ఏఎస్‌ఆర్ నగర్‌లలో మురికివాడలను తొలగించి అదే స్థలంలో 1,256 ఫ్లాట్లు చొప్పున నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. మొత్తం 31 లేఅవుట్లలో 24,192 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. 2019 మార్చి నాటికి నాలుగు వేల ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ...గతంలో జరిపిన కేటాయింపులను రద్దు చేసింది. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించింది. సర్వే పేరుతో వడపోసి గత ప్రభుత్వ హయాంలో అర్హులుగా గుర్తించిన వారిలో 13,761 మందిని అనర్హులుగా తేల్చి, 30,083 మందిని మాత్రమే అర్హులుగా నిర్ధారించింది. జీవీఎంసీ పరిధిలో 24,192 ఇళ్ల నిర్మాణం మాత్రమే జరుగుతుండడంతో వాటికి మాత్రమే లబ్ధిదారులను లాటరీ ద్వారా 2020లో ఎంపిక చేసింది. మిగిలిన వారికి జగనన్న లేఅవుట్లలో సెంటు చొప్పున స్థలాన్ని కేటాయిస్తామని చెప్పింది. 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ను లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తామని, 365 చదరపు అడుగుల ఫ్లాట్‌కు రూ.50 వేలు కాకుండా రూ.25 వేలు, 430 చదరపు అడుగుల ఫ్లాట్‌కు రూ.లక్షకు బదులుగా రూ.50 వేలు చెల్లించాలని ప్రకటించింది.
ఐదేళ్లలో అడుగు ముందుకుపడని పనులు
2019లో వైసీపీ అధికారం చేపట్టినప్పుడు ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు అప్పగిస్తామని ప్రకటించింది. కానీ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించింది. టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తయిన సముదాయాలకు ఉన్న రంగులను మార్చి వైసీపీ జెండాను పోలిన రంగులను వేయించింది. నిర్మాణం చివరి దశలో ఉన్న వాటిని పూర్తిచేయడానికే పరిమితమైంది. ఐదేళ్లలో కేవలం 7,456 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లను అప్పగించింది. వీటిలో చాలాచోట్ల కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఆయా ఇళ్లలో దిగడానికి ఆసక్తి చూపలేదు. కేవలం నాలుగు వేలలోపు ఇళ్లలో మాత్రమే నివాసాలు ఉంటున్నారు.
టిడ్కో ఇళ్ల పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థలకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు పనులను నిలిపివేశారు. దాంతో చాలాచోట్ల టీడీపీ హయాంలో ఎక్కడ వరకూ పనలుఉ జరిగాయో...వైసీపీ అధికారీం నుంచి దిగిపోయేసరికి కూడా అదేస్థాయిలో ఉండిపోయాయి. ఐదేళ్లపాటు నిర్మాణపనులు నిలిచిపోవడంతో పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగిపోయాయి. బక్కన్నపాలెంలోని టిడ్కో సముదాయాలు మందుబాబులు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. చీమలాపల్లిలో మొండిగోడలతోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించి తిరిగి పనులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని టిడ్కో అధికారులు పేర్కొంటున్నారు.
కొమ్మాదిలోనూ అదే పరిస్థితి
కొమ్మాది, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
గత తెలుగుదేశం ప్రభుత్వం కొమ్మాదిలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాల సమీపాన 7 బ్లాకుల్లో 48 చొప్పున 336 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 144 డబుల్, 192 సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే బక్కన్నపాలెంలో 8 బ్లాకుల్లో 48 చొప్పున 384 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. 2019 ఎన్నికల నాటికి దాదాపు 75 శాతం నిర్మాణం పూర్తి కాగా, ఆ తరువాత ప్రభుత్వం మారడంతో పనులు ముందుకుసాగలేదు. కొమ్మాదిలో దాదాపు నిర్మాణం పూర్తయిన కొన్ని బ్లాకుల్లో ప్లంబింగ్, కరెంటు పనులు కాలేదు. రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. బక్కన్నపాలెంలో ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తికావలసి ఉంది. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టు సంస్థలు పనులు నిలిపివేశాయి. దీంతో బక్కన్నపాలెంలో టిడ్కో గృహ సముదాయాల చుట్టూ ముళ్లకంపలు పెరిగిపోయాయి. కనీసం లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను చూసుకోవడానికి వెళదామన్నా దారి లేని పరిస్థితి నెలకొని ఉంది. కొమ్మాది, బక్కన్నపాలెంలో పనులు త్వరలో పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని టిడ్కో ఈఈ సుధాకర్ తెలిపారు.
అసంపూర్తిగా నిర్మాణాలు
పెదగంట్యాడ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
పెదగంట్యాడ ప్రాంతంలో రెండుచోట్ల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వాటిలో కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. మరికొన్ని పూర్తయినా ప్రాథమిక వసతులు లేవు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేసేశామని అధికారులు చెబుతున్నారు. అయితే విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు లేని ఈ ఇళ్లల్లో తామెలా ఉండేదని పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో వసతులు కల్పించి తమకు అప్పగించాలని వారు కోరుతున్నారు.
దయాళ్‌నగర్‌లో బీసీ రోడ్డు పక్కన ఏడున్నర ఎకరాల్లో 654 గృహాల నిర్మాణ పనులను అప్పటి టీడీపీ ప్రభుత్వం 2017లో ప్రారంభించి 2019 నాటికి 90 శాతం పూర్తిచేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించి రిజిస్ట్రేషన్లు చేసింది. కానీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదు. అలాగే భానోజీ కాలనీలోని కొండవాలు ప్రాంతంలో 22 ఎకరాల్లో 1,056 గృహాల నిర్మాణం చేపట్టారు. అప్పటి టీడీపీ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరో పది శాతం పనులు చేసి లబ్ధిదారుల ఎంపిక, రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టింది.
భానోజీ కాలనీ టిడ్కో గృహ సముదాయంలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని ఇళ్లకు తలుపులు లేవు. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్కులు చేయలేదు. ఇళ్ల బ్లాక్‌ల మధ్య రోడ్డు లేకపోవడంతో ఖాళీ స్థలాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. తాగునీటి సౌకర్యం కోసం చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. దయాళ్‌నగర్ టిడ్కో గృహ సముదాయాలకు అప్రోచ్ రోడ్డు తప్ప వీధి రోడ్డు ఏర్పాటు చేయలేదు. రెండు ప్రాంతాల్లోనూ తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేవు. కిటీకీలకు గ్రిల్స్ లేవు. కాగా కొందరు లబ్ధిదారులు పగలంతా తమకు కేటాయించిన ఇళ్లల్లోనే ఉంటూ సాయంత్రం తాము ఉంటున్న అద్దె ఇళ్లకు వచ్చేస్తున్నారు.
జీవీఎంసీ పరిధిలో టిడ్కో లేఅవుట్‌లు 31
నిర్మాణం ప్రారంభించిన ఇళ్లు 24,192
ఇప్పటివరకూ లబ్ధిదారులకు అందజేసినవి 7,456
గృహ ప్రవేశాలు జరిగిన ఇళ్లు 4 వేలు లోపే