డోలీ మోతలు తప్పించేందుకు 47 ఫీడర్ అంబులెన్స్‌లు
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:15 AM
గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కొత్తగా 47 ఫీడర్ అంబులెన్స్‌లను కేటాయించామని గిరిజనశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
-ఎమ్మెల్యే లలిత కుమారి ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి సమాధానం
శృంగవరపుకోట, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కొత్తగా 47 ఫీడర్ అంబులెన్స్‌లను కేటాయించామని గిరిజనశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం శాసనసభ క్వశ్చన్ అవర్‌లో శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి గిరిజనులు డోలీమోతలకు స్వస్తి.. ప్లీడర్ అంబులెన్సుల పునరుద్ధరణ.. రహదారుల సమస్యలపై ప్రస్తావించారు. దీనికి బదులుగా మంత్రి సంధ్యారాణి సమాధానం ఇచ్చారు. 2014-2019 మధ్య సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గర్భిణులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులను ఆసుపత్రులకు తరలించేందుకు 122 ఫీడర్ అంబులెన్స్‌లు కేటాయించారన్నారు. 2019-2024 సంవత్సరాల మధ్య వైసీపీ హయాంలో ఫీడర్ అంబులెన్స్‌లు సగం మరుగునపడ్డాయన్నారు. రూ.280 కోట్లతో 315 కిలోమీటర్ల రోడ్లు పనులకు పరిపాలన అనుమతులు తీసుకున్నామని మంత్రి వివరించారు.