ఉద్యాన పంటలకు ఊతం
ABN , Publish Date - Jun 22 , 2024 | 11:58 PM
జాతీయ ఉపాధి హామీ పనులను ఉద్యాన పంటలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. కానీ ఆ దిశగా కార్యాచరణ జరగలేదు.
- ఉపాధి హామీ పథకానికి అనుసంధానం
- తగ్గనున్న పెట్టుబడి ఖర్చులు
- ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
(విజయగనరం-ఆంధ్రజ్యోతి)
జాతీయ ఉపాధి హామీ పనులను ఉద్యాన పంటలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. కానీ ఆ దిశగా కార్యాచరణ జరగలేదు. నూతనంగా అధికారం చేపట్టిన ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఈ దశగా అడుగులు వేసింది. ఉద్యాన పంటలకు ఉపాధి హామీని విస్తరిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ మొదటి సంతకం చేశారు. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయల పంటలన్నీ ఉద్యాన పంటల కోవకే వస్తాయి. ఆయిల్‌పామ్, అరటి వంటి పంటలు జిల్లాలో విస్తారంగా ఉన్నాయి. మామిడి, జీడి పంటలకు కొదవే లేదు. ఈ పరిస్థితిలో ఉపాధి హామీ పనులు చేయాలంటే ఏడాది పొడవునా పనులు ఉంటాయి. ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చేసిన పనులే మళ్లీ మళ్లీ..
ఉపాధి హామీలో ప్రతి ఏటా చేస్తున్న పనులనే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. చెరువుల్లో తవ్విన చోటే మళ్లీ మట్టి తవ్వి గట్టు వేస్తున్నారు. అంటే పని మారటం లేదు. ఫలితం ఉండటం లేదు. దీనికితోడు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉపాధి హామీ పనుల్లో భారీ మార్పు కన్పిస్తోంది. ప్రతి వేతనదారు నుంచి వారానికి కనిష్టంగా రూ.100 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి శనివారం వేతనదారు తన సొంత డబ్బులు ఉపాధి పనుల వద్దకు తీసుకు వెళ్లి మేట్ల ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్‌కు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని జిల్లా స్థాయి అధికారి వరకు వారు నిర్ణయించుకున్న పర్సంటేజీలకు అనుగుణంగా పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వేతనదారులు పూర్తిగా పనులు చేపట్టడం మానేశారు. పని ప్రాంతానికి వెళ్లి ఎంచక్కా చెట్ల నీడన కుర్చుంటున్నారని, నామ్‌కే వాస్తేగా అపుడపుడు లేచి ఏదో పని చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. వేతనదార్ల నుంచి వారానికి వంద వసూలు చేయటం కారణంగా టెక్నికల్ అసిస్టెంట్ జరగని పనికి జరిగినట్లు ఎమ్‌బుక్‌లో నమోదు చేస్తున్నారు. ఇలా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గత ప్రభుత్వం పెద్ద ఉపయోగం లేని కార్యక్రమంగా మార్చేసింది.
పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశం
ప్రస్తుత నూతన ప్రభుత్వం ఉద్యాన పంటలతో ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తున్న కారణంగా ఇటు వేతనదార్లు పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. దీని కారణంగా సంబంధిత భూ యజుమాని రైతు కూడా క్షేత్రంలోనే ఉంటాడు. పని ఎంత జరిగింది స్పష్టంగా కన్పిస్తుంటుంది. శ్రమ శక్తిని ఉపయోగ కరమైన మార్గంలో నడిపించడం ద్వారా రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఏది ఏమైనా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తన మొదటి సంతకం ద్వారా ఉపాధి పనులను రైతులకు వినియోగ పడే విధంగా నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామం. క్షేత్ర స్థాయిలో దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.