Share News

ఒకరోజు ముందే ...

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:14 AM

సామాజిక పింఛనుదారులకు ఒక రోజు ముందుగానే చేతికి డబ్బులు అందనున్నాయి. డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 30న ( శనివారం ) ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీకి అధికారులు సిద్ధమయ్యారు.

ఒకరోజు ముందే ...

రూ. 59 కోట్లు సిద్ధం

పార్వతీపురం/సాలూరు రూరల్‌, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛనుదారులకు ఒక రోజు ముందుగానే చేతికి డబ్బులు అందనున్నాయి. డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 30న ( శనివారం ) ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీకి అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో వృద్ధులు 77,227 మంది, చేనేత లబ్ధిదారులు 756 మంది, దివ్యాంగులు 16,812 మంది, వితంతువులు 34,419 మంది, ఒంటిరి మహిళలు 2,352 మంది ఉన్నారు. మొత్తంగా 14 రకాల పింఛనుదారులు 1,42,119 మంది వరకూ ఉన్నారు. వారికి పింఛను డబ్బులు అందించడానికి శుక్రవారం రూ. 59.07 కోట్లను బ్యాంకుల నుంచి విత్‌ డ్రా చేశారు. సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పింఛను అందించనున్నారు. ఈ నెల 30న పింఛను అందుకోని వారికి వచ్చే నెల రెండున పంపిణీ చేయనున్నారు. ఏదైనా కారణంతో పింఛను అందుకోకుంటే మూడు నెలల లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చుననే నిబంధనను అధికారులు అమలు చేయనున్నారు. ఇప్పుడు పింఛను తీసుకోని వారికి వచ్చే నెల బకాయి కలిపి అందించనున్నారు. దీంతో పింఛనుదారులు డబ్బులు ఇప్పుడు తీసుకోవాలనే టెన్షన్‌ తప్పిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత నెల అందుకోని వారికి ..

జిల్లాలో గత నెలలో 489 మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో పింఛన్‌ సొమ్ము అందుకోలేక పోయారు. వారికి కూడా నేడు అందించనున్నారు. జియ్యమ్మవలస మండలంలో 24 మంది, గుమ్మలక్ష్మీపురం ఏడుగురు, బలిజిపేటలో 36, భామిని 66, గరుగుబిల్లి 97, కొమరాడ 28, వీరఘట్టం 41, మక్కువ 11 మంది, కురపాంలో ఐదుగురు, పాచిపెంట 15, పాలకొండ 53, పార్వతీపురంలో 46, సాలూరులో 30 మంది గత నెలతో కలిపి పింఛన్‌ సొమ్ము అందుకోనున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు ఒక నెల పింఛను అందుకోకపోతే ఆ సొమ్మును ప్రభుత్వం వెనక్కి తీసుకొనేది. రెండో నెల ఆ పింఛను సొమ్ము లబ్ధిదారులకు అందించేవారు కాదు. అయితే కూటమి ప్రభుత్వం మూడు నెలల పాటు వెసులుబాటు కల్పించడంతో జిల్లాలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శతశాతం పంపిణీకి ప్రయత్నిస్తాం

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను ఒకరోజు ముందే లబ్ధిదారులకు అందించనున్నాం. శనివారం దాదాపు శతశాతం పంపిణీకి కృషి చేస్తాం. ఎవరైన మిగిలి ఉంటే సోమవారం పంపిణీ చేస్తాం. మూడు నెలల్లోగా పింఛను తీసుకోవాలనే నిబంధన అమల్లోకి తెస్తున్నాం.

- వై.సత్యంనాయుడు, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ, పార్వతీపురం మన్యం

Updated Date - Nov 30 , 2024 | 12:14 AM