‘కొనుగోలు’ ఏదీ?
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:00 AM
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని.. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని.. ఈ నెల మొదటి వారంలోనే కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలు రాకపోవడంతో ఇప్పటివరకు ‘మన్యం’లో ఒక్క కేంద్రం కూడా ప్రారంభం కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటివరకు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వని వైనం
జిల్లాలో తెరుచుకోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఆందోళనలో రైతులు.. రంగంలోకి దిగిన దళారులు
గరుగుబిల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని.. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని.. ఈ నెల మొదటి వారంలోనే కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలు రాకపోవడంతో ఇప్పటివరకు ‘మన్యం’లో ఒక్క కేంద్రం కూడా ప్రారంభం కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నూర్పులు పూర్తయిన వారు పంటను నిల్వ చేసుకోలేక దళారులు, ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గిట్టుబాటు ధర దక్కకపోయినా.. తప్పనిసరి పరిస్థితుల్లో వారికే పంటను విక్రయిస్తూ.. నష్టాలను చవిచూస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌లో సుమారు 1.66 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఈ మేరకు 15 మండలాల్లో 183 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటి పరిధిలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు నిర్ణయించారు. సాధారణ రకం క్వింటాకు రూ. 2,300, గ్రేడ్-ఏకు రూ. 2,320 మద్దతు ధరగా ప్రకటించారు. మరోవైపు రైస్ మిల్లుల నుంచి గోనె సంచులను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు తరలించారు. మిల్లుల పరిధిలో కస్టోడియన్ అధికారులుగా వీఆర్‌వోలను నియమించారు. మొత్తంగా 21,97,230 గోనె సంచులను సిద్ధం చేశారు. అయితే ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పీఏసీఎస్‌ల నుంచి గోనె సంచులు బయటకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. 15 మండలాల పరిధిలో ముందుగా తేలిక రకం వరి పంట నూర్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఒకవైపు ఆరబోత, మరోవైపు తూనికలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఈ ప్రాంతం నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ధాన్యం తరలిపోతోంది. ఇదే అదునుగా వ్యాపారులు 84 కిలోలకు రూ.1,460 మాత్రమే చెల్లిస్తున్నారు. లారీల అద్దె పెరిగితే చెల్లింపుల్లో మరికొంత కోత విధిస్తున్నారు.
బకాయిల కోసం ..
ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాలో 93 మిల్లులను గుర్తించారు. అయితే ముందుగా మిల్లలర్లు నిర్దేశించిన మొత్తాలను గ్యారంటీగా చూపించాలి. గ్యారెంటీ మొత్తం చెల్లిస్తేనే ఆ మిల్లుకు ధాన్యం సరఫరా చేస్తారు. కాగా గత వైసీపీ ప్రభుత్వం మిల్లర్లకు అధికంగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. అవి విడుదలైతే ఆ మొత్తాలు చెల్లించి ధాన్యం పొందొచ్చన్న ఆలోచనలో పలువురు ఉన్నారు. మరికొంత మంది చెల్లింపులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని పలు మండలాల్లో నూర్పులు కావడంతో అధికార యంత్రాంగం గ్యారంటీల కోసం మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. అయినా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఎటువంటి కదలికలు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిబ్బందికి శిక్షణ పూర్తి
జిల్లాలో 183 ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిధిలో సిబ్బందికి శిక్షణ పూర్తయ్యింది. ఒక్కో కేంద్రానికి ముగ్గురు చొప్పున నియమించిన తాత్కాలిక సిబ్బందికి కంప్యూటరీకరణ, ట్రక్ షీట్లు, మిల్లులకు తరలింపు, తేమ శాతం తెలుసుకోవడంపై అవగాహన కల్పించారు. మరోవైపు గోనె సంచులు సిద్ధమైనా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. కేంద్రాలు తెరవడం ఆలస్యమైతే రైతులు నష్టపోనున్నారు. నూర్పులు చేసిన ధాన్యం నిల్వ చేసుకోలేక తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
కేంద్రాల ప్రారంభానికి చర్యలు
జిల్లాలో 183 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. బ్యాంకు గ్యారంటీల విషయమై మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాం. గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులు కూడా వారికిష్టమైన మిల్లులకు పంట తరలించుకోవచ్చు. తొందరపడి దళారులు, ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించడం మంచిది కాదు.
- శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారి, పార్వతీపురం మన్యం
================================================
ప్రభుత్వానికి సహకరిస్తాం
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తాం. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రూ. 35 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఈ సమస్యను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. బకాయిలు విడుదల చేస్తే మాకు కొంతమేర ఉపశమనం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని ఆశతో ఉన్నాం. ఈ నెల 20లోపు బ్యాంకు గ్యారెంటీలు ఇస్తాం. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది.
- అక్కేన మధుసూదనరావు, జిల్లా మిల్లర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు