పోస్టు పెడుతున్నారా... జాగ్రత్త
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:47 PM
- విజయనగరానికి చెందిన ఓ యువకుడు ఆ మధ్య రాజకీయ నాయకులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అది వైరల్ కావడంతో ఆ బాధిత నేత జిల్లా కేంద్రంలోని సైబర్ పోలీసును ఆశ్రయించాడు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకునిపై లోతగా ఆరా తీసిన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
పోస్టు పెడుతున్నారా... జాగ్రత్త
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే జైలుకే
సోషల్ మీడియాపై డేగ కన్ను
అమల్లోకి కఠిన చట్టాలు, సెక్షన్లు
కుటుంబ సభ్యులనూ వెంటాడనున్న కష్టాలు
జిల్లాలో 11 కేసులు నమోదు
- విజయనగరానికి చెందిన ఓ యువకుడు ఆ మధ్య రాజకీయ నాయకులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అది వైరల్ కావడంతో ఆ బాధిత నేత జిల్లా కేంద్రంలోని సైబర్ పోలీసును ఆశ్రయించాడు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకునిపై లోతగా ఆరా తీసిన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
- నెల్లిమర్ల మండలానికి చెందిన ఓ పత్రికా విలేకరి 2023 నుంచి 2024 ఎన్నికల వరకూ కూటమి నాయకులను కించపరిచేలా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చేస్తూ వాటిని వైరల్ చేశాడు. సొంతంగా వందలాది మంది ఉండే గ్రూపుల్లో అదే పనిగా పోస్టులు పెట్టాడు. ఇటీవలే అతనిపై సైబర్ పోలీసులు కేసు నమెదు చేశారు.
విజయనగరం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి):
చేతిలో సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఉన్నాయని ఇష్టారాజ్యంగా ఇతరులను కించపరిచేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడతామంటే ఇక కుదరదు. ఒకప్పుడు సరదాగా గ్రూపుల్లో పోస్టులు పెట్టి నవ్వుకునేవారు. అవి నేడు హద్దులు దాటాయి. కొందరు రాజకీయ నాయకులకు అనుకులంగా వారి ప్రత్యర్థులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఇవి వారి మనుసులను, నేతల రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా పరిణమిస్తున్నాయి. దీంతో బాధితులు సైబర్ క్రైంలో ఫిర్యాదులు చేస్తున్నారు. నేరం రుజువైతే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సైబర్ నేరాలకు సంబంధించి కఠిన చట్టాలు, సెక్షన్లు అమల్లోకి వచ్చాయి. వాటిని అనుసరించి తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయి. గతంలో ప్రత్యర్థులపై వ్యక్తిత్వ హననానికి దిగిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) భారతీయ న్యాయ సంహిత (బీఎస్‌ఎన్‌ఏసీ)గా అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా సైబర్ నేరాలకు సంబంధించి కఠిన సెక్షన్లు తెరపైకి వచ్చాయి. జిల్లాలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలను ఇబ్బంది పెడుతూ, వారి గౌరవాన్ని కించపరిచేలా.. వారి గౌరవానికి భంగం కలిగేలా సోషల్‌మీడియా గ్రూపుల్లో పోస్టులు పెట్టిన 11 మందిపై జిల్లా సైబర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో కొంతమంది జైల్లో ఉన్నారు. మరో ఏడుగురుకు నోటీసులు జారీ చేశారు.
అప్పుడు ఇష్టారాజ్యంగా..
ఐదేళ్ల వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోయారు. కంటెంట్‌ను ఇష్టారాజ్యాంగా పోస్టు చేసేవారు. అవి ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో సీఎం జగన్‌ను ఎవరు విమర్శించినా తట్టుకునేవారు కాదు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులపై పోస్టు పెడితే తిట్లదండకంతో రెచ్చిపోయేవారు. అటువంటి వారి అరెస్టు క్షణాల్లో జరిగిపోయేది. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు, పవన్, లోకేశ్‌లతో పాటు టీడీపీ నాయకులను వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు వెంటాడారు. ఫలితంగా ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు.
- వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికల ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టేవారు. వైసీపీ అధికారం నుంచి దూరమైన ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్తుల్లో మాత్రం దురుసు తగ్గలేదు. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించడంతో సీన్ మారింది. పోలీసులు ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. కఠిన చట్టాలు, సెక్షన్లు మోపుతుండడంతో వైసీపీ సోషల్ మీడియా స్టార్లు బెంబేలెత్తిపోతున్నారు.
ఒకసారి కేసు నమోదైతే..
ఉద్దేశపూర్వకంగా కానీ.. దురుద్దేశంతో కూడిన పోస్టులు సోషల్‌మీడియాలో పెట్టకూడదు. షేర్ చేయకూడదు. వ్యక్తిత్వ హననం అనేది పెద్ద నేరం. పోస్టులతో మనోభావం దెబ్బతిని, మనస్తాపానికి గురై బాధితులకు అపాయం జరిగితే మాత్రం పోస్టు పెట్టిన వారికి కఠిన దండన విధించే శిక్షలు కొత్త చట్టాల్లో ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వ్యక్తుల కుటుంబాలను దూషిస్తూ పోస్టులు పెట్టకూడదు. వీటికి లైక్‌లు కొట్టడం, ఇతరులకు షేర్ చేయడం కూడా నేరమే. ప్రజలు, కులాలు, మతాల మధ్య విధ్వేషాలను రెచ్చగొడుతూ పోస్టులు పెడితే జైలుకు వెళ్లక తప్పదు. చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ అనుచిత పోస్టులు పెట్టి కేసులు నమోదుచేస్తే.. విదేశాలకు వెళ్లేందుకు పోలీసులు ఎన్‌వోసీ ఇవ్వరు. ఒకసారి కేసు నమోదైతే ఆ వ్యక్తిపై నిరంతర నిఘా ఉంటుంది. వారి పిల్లలతో పాటు తల్లిదండ్రులకూ ఇబ్బందే. తప్పుచేసిన పిల్లలు దొరక్కపోతే వారి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
కొత్త చట్టాలు, సెక్షన్లు..
- ప్రముఖ వ్యక్తుల పేరుతో పోస్టులు పెడితే..66 డీఐటీ యాక్టు కింద కేసు నమోదుచేస్తారు. నేరం రుజువైతే మూడేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకూ జరిమానా విధిస్తారు.
- జుగుప్సాకరంగా ఉన్న ఫొటోలు, వీడియోలు పోస్టు చేసినా, షేర్ చేసినా ఎలక్ర్టానిక్ అవిడెన్స్‌గా పరిగణిస్తారు. బీఎన్‌ఎస్ చట్టంలోని 353(2) సెక్షన్ కింద కేసు నమోదుచేస్తారు.
- అసభ్యకర పోస్టులు రూపొందించి అప్‌లోడ్ చేస్తే..67 ఐటీ యాక్టు కింద కేసు నమోదుచేస్తారు. నేరం రుజువైతే ఐదేళ్లు జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకూ జరిమానా విధిస్తారు.
- తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఒక వ్యక్తి పరువుకు భంగం వాటిల్లితే బీఎస్‌ఎన్ చట్టంలో 336(4) సెక్షన్ కింద కేసు నమోదుచేస్తారు. నేరం రుజువైతే ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
- సమాజంలో సంఘాలు, యూనియన్ల మధ్య విధ్వేషాలు రెచ్చగొడితే 356(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. పెద్ద ఎత్తున పరువునష్టం దావా కేసులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తీరు మార్చుకోవాలి
సోషల్ మీడియా పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు. వ్యక్తుల కోసం, రాజకీయ పార్టీల కోసం చాలా మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. అటువంటి వారు తీరు మార్చుకోవాలి. లేకుంటే చిక్కుల్లో పడడం ఖాయం. మత విద్వేసాలు రెచ్చగెట్టేలా..ఇతరులపై అసభ్యకర పదజాలం, ఫొటో మార్ఫింగ్‌కు పాల్పడితే సహించేదిలేదు. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు.
- వకుల్ జిందాల్, ఎస్పీ
------------------