Share News

doope police ఆ భూమి కోసం నకిలీ ఐపీఎస్‌గా..

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:51 PM

As fake IPS for that land.. ఆర్మీ నుంచి పారిపోయి వచ్చాడు. బీటెక్‌ పూర్తిచేసి వ్యాపారం చేశాడు. అదీ నచ్చక హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. కరోనా సమయంలో తండ్రి చనిపోవడంతో తిరిగి వచ్చాడు. అప్పుడే తండ్రి పురోణి రాయించుకున్న భూముల వ్యవహారం తెలిసింది.

doope police ఆ భూమి కోసం నకిలీ ఐపీఎస్‌గా..
నిందితుడు సూర్యప్రకాష్‌

ఆ భూమి కోసం నకిలీ ఐపీఎస్‌గా..

ఎంపికైనట్లు నమ్మించి హైదరాబాద్‌కు..

తిరిగి వచ్చి పోలీసు యూనిఫాంతో హల్‌చల్‌

అదే దుస్తులతో బంధువులు, స్నేహితుల ఇళ్లకు..

ఇటీవల డిప్యూటీ సీఎం కార్యక్రమానికి హాజరు

ప్రముఖులతో ఫొటోలు దిగి వాట్సాప్‌ స్టేటస్‌లు

పోలీసు అధికారుల విచారణతో గుట్టురట్టు

నిందితుడి అరెస్టు

సాలూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్మీ నుంచి పారిపోయి వచ్చాడు. బీటెక్‌ పూర్తిచేసి వ్యాపారం చేశాడు. అదీ నచ్చక హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. కరోనా సమయంలో తండ్రి చనిపోవడంతో తిరిగి వచ్చాడు. అప్పుడే తండ్రి పురోణి రాయించుకున్న భూముల వ్యవహారం తెలిసింది. వాటిని సొంతం చేసుకోవడానికి నకిలీ ఐపీఎస్‌ అవతారం ఎత్తాడు. యూనిఫారంలో ఉన్న ఫొటోలను చూపెడితే పని అయిపోతుందనుకున్నాడు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటనలో హల్‌చల్‌ చేశాడు. ప్రముఖులతో ఫొటోలు దిగి వాటిని వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. అనుమానం వచ్చి పోలీసు అధికారులు ఆరా తీశారు. అంతే.. నకిలీ ఐపీఎస్‌ గుట్టు రట్టు అయింది. విజయనగరం మండలం అంబటివలస గ్రామానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్‌ నడిపిన యాక్షన్‌ కథ ఇది. సాలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీలు దిలీప్‌కిరణ్‌, అంకిత సురానా శనివారం విలేకరులకు వివరాలను వెల్లడించారు.

విజయనగరం మండలం అంబటివలసలో ఉంటున్న బలివాడ సూర్యప్రకాష్‌ స్వగ్రామం దత్తిరాజేరు మండలం గడసాం. 2003 నుంచి 2005 వరకు ఇండియన్‌ ఆర్మీలో సిపాయిగా పనిచేసి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేశాడు. 2016 వరకు తన తండ్రి తవిటిబాబుతో కలిసి కాంట్రాక్ట్‌ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత తూనికలు, కొలతలకు సంబంధించిన షాపును విజయనగరంలో నడిపాడు. ఆ సమయంలో కూడా నకిలీ ఇన్‌స్పెక్టర్‌గా అందరినీ నమ్మించేవాడు. షాపును తన బంధువులకు అప్పగించి తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. 2020లో కరోనాతో తండ్రి మృతిచెందాడు. అయితే 2005లో తన తండ్రి ఎకరా రూ.30వేలు చొప్పున తొమ్మిది ఎకరాల 79 సెంట్లకు పురోణి రాసినట్లు తాజాగా తెలుసుకున్నాడు. ఆ భూమికి సంబంధించి తండ్రి కొంత మేర అడ్వాన్స్‌ చెల్లించినట్లు నిర్ధారించే ధ్రువపత్రాలను గుర్తించాడు. ఆ భూమి దక్కించుకోవడం కోసం నకిలీ ఐపీఎస్‌ అవతారం ఎత్తాడు. ఐపీఎస్‌ సెలెక్ట్‌ అయ్యాయని చెప్పి హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉన్నప్పుడే యూనిఫారం కుట్టించుకున్నాడు. నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకున్నాడు. తిరిగి వచ్చి పోలీసు యూనిఫాంతో హల్‌చల్‌ చేశాడు. అవే దుస్తులతో బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లాడు. ఈ నెల 20న సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోలలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కార్యక్రమం ఉందని తెలుసుకున్నాడు. అక్కడికి వచ్చే వీఐపీలతో ఫొటోలు తీసుకొని వాటిని చూపించి భూమిని పొందాలనుకున్నాడు. వీఐపీలంతా వ్యూపాయింట్‌ వద్దకు వెళ్లిన తర్వాత కారు పార్కింగ్‌ వద్ద కారు ఆపి ద్విచక్రవాహనంపై ఆ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కొంత మందితో ఫొటోలు దిగి కాలి నడకన కొండపై నుంచి కిందకు చేరుకొని తన వాహనంలో సాలూరు చేరుకున్నాడు. ఇది జరిగిన తర్వాత ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. సూర్యప్రకాష్‌ గురించి బాగా తెలిసిన వ్యక్తులు కొందరు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు సూర్యప్రకాష్‌ ప్రతి అడుగును పరిశీలించి శనివారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు నకిలీ ఐడీ కార్డులు, రెండు జతల యూనిఫారంలు, ఒక జంగిల్‌ ప్యాచ్‌ యూనిఫారం, నేమ్‌ప్లేట్స్‌, విజిల్‌ కార్డులు, పాత కారు, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై 165/24 కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సమావేశంలో సాలూరు రూరల్‌ సీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విశాఖలో అదుపులోకి..

విజయనగరంక్రైం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఫొటోలు దిగిన నకిలీ ఐపీఎస్‌ అధికారి బలివాడ సూర్యప్రకాష్‌ను శనివారం తెల్లవారు జామున విజయనగరం రూరల్‌, ఎస్‌బీ సీఐలు లక్ష్మణరావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి కలిసి విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో సూర్యప్రకాష్‌పై కేసు నమోదైన నేపథ్యంలో ఆ స్టేషన్‌కు అప్పగించారు.

-----------

Updated Date - Dec 28 , 2024 | 11:51 PM