Share News

బాబోయ్‌ ఎండలు

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:21 AM

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం 4 గంటల అధికంగా ఎండ వేడి, ఉక్కపోత ఉండడంతో జిల్లావాసులు విలవిల్లాడుతున్నారు.

బాబోయ్‌ ఎండలు
పాలకొండ ఏలాం సెంటర్‌లో నిర్మానుష్యంగా ఉన్న ప్రధాన రహదారి

40 డిగ్రీలకు దాటి నమోదు

అధిక వేడి, ఉక్కపోతకు విలవిల

ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్న ప్రజలు

పార్వతీపురం టౌన్‌/పార్వతీపురం రూరల్‌/సాలూరు/సాలూరు రూరల్‌/ పాచిపెంట/పాలకొండ/భామిని, ఏప్రిల్‌ 14 : జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం 4 గంటల అధికంగా ఎండ వేడి, ఉక్కపోత ఉండడంతో జిల్లావాసులు విలవిల్లాడుతున్నారు. వేడిగాలులు వీస్తుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. దీంతో మధ్యాహ్నం 10 గంటల తర్వాత ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఎండవేడిమికి వృత్తిదారులు తమ పనులు చేయలేకపోతున్నారు. ఉపాధి వేతనదారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రామికులు, ఫుట్‌పాత్‌ వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు కూడా రాకపోకలు సాగించలేకపోతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు సైతం ఉదయం 10 నుంచి 11 గంటల్లోపు పనులను చూసుకొని ఇళ్లబాట పడుతున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు అధికంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరికొందరు ప్రయాణాలు సాగిస్తున్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో అప్రకటిత విద్యుత్‌ కోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రతకు చెరువులు, వాగులు మైదానాలను తలపిస్తున్నాయి. ఈ నెలలోనే 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవు తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మే నెలలో పరిస్థితేమిటో అని టెన్షన్‌ పడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వడగాల్పులు వీస్తున్నట్టు ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ ఎండ తీవ్రత జూన్‌ వరకు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మొబైల్‌ ద్వారా పలు సూచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరికొద్దిరోజుల పాటు ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి 4 గంటల మధ్య బయట తిరగక పోవడం ఉత్తమని తెలియజేస్తున్నారు.

వివిధ చోట్ల ఇలా..

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, శ్రీలేఖ, నాలుగు రోడ్లు, పాతబస్టాండ్‌ కూడళ్లు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో జనసంచారం లేక బోసిపోయాయి. సాలూరులో39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రోడ్లుపై తిరిగేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాచిపెంట మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు చెట్ల వద్దకు వెళ్లి సేదతీరారు. రాత్రి ఏడు గంటల వరకు వేడి తగ్గలేదు. అందరూ చల్లగాలి కోసం ఆరుబయటే నిరీక్షించారు. పాల కొండతో పాటు సీతంపేట, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. సాలూరు ఏజెన్సీలో గ్రీష్మతాపం పెరిగింది. సాలూరు అర్బన్‌, మండలంలో ఆదివారం ఎండ మండింది. సాలూరు ఏజెన్సీలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు జనం , ఉపాధి కూలీలు ఇక్కట్లు పడ్డారు. ఉదయం 11 గంటలకే గ్రామాలు, పట్టణాల్లో వీధులు , ప్రధాన రోడ్లు బోసిపోయాయి. భామినిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటలకే తర్వాత ఎవరూ రోడ్డెక్కలేదు. ఇంకొందరు చెట్ల కిందకు చేరారు. బురుజోలలో వృద్ధులు, యువకులు తోటల్లోకి వెళ్లి ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం చెందారు.

Updated Date - Apr 15 , 2024 | 12:21 AM