రైతన్న క‘న్నీరు’
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:37 AM
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా కలవరపడుతున్నారు. పంటను రక్షించుకునేందుకు ఎంతో శ్రమించినా కొన్నిచోట్ల అపాయం తప్పలేదు. పంట నీటిపాలైన చోట తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా కష్టపడి పండించుకున్న పంట పోతుందేమోనని భయపడుతున్నారు.
రైతన్న క‘న్నీరు’
చివరి దశలో వరి పంట నీటి పాలు
విజయనగరం/ కలెక్టరేట్/ భోగాపురం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా కలవరపడుతున్నారు. పంటను రక్షించుకునేందుకు ఎంతో శ్రమించినా కొన్నిచోట్ల అపాయం తప్పలేదు. పంట నీటిపాలైన చోట తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా కష్టపడి పండించుకున్న పంట పోతుందేమోనని భయపడుతున్నారు. కొంతమంది రైతులు ముందుజాగ్రత్తల్లో భాగంగా పంటను మిల్లులకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 2.40 లక్షల విస్తీర్ణంలో వరిని పండిస్తున్నారు. ఇప్పటి వరకు 63 శాతం వరికోతలు పూర్తయ్యాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మిగిలిన 37 శాతం మంది వరికోతలు చేపట్టలేదు. వర్షాలకు ఈ రెండు రకాల రైతులు ఇబ్బంది పడుతున్నారు. తీర ప్రాంత గ్రామాలైన ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు గ్రామాల్లో మత్స్యకారులు ఎవరూ వేటకెళ్లలేదు. వలలు భద్రపర్చుకునేందుకు సరైన సౌకర్యంలేక తీరంలో వదిలేశారు.
జిల్లాలో 60,900 హెక్టార్లలో వరి కోతలు పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 50,852 హెక్టార్లలో పంట కుప్పలు రూపంలో ఉంది. 10,084 హెక్టార్ల పంటకు నూర్పులు వేశారు. 31,223 మెట్రిక్ టన్నులను అధికారులు సేకరించారు. మిగిలిన 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు.