Share News

AP development : విధ్వంసానికి బై.. అభివృద్ధికి సై

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:29 PM

AP development : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు.

AP development : విధ్వంసానికి బై.. అభివృద్ధికి సై
రాజాంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, ఎమ్మెల్యే మురళి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు (ఫైల్‌)

- కూటమి ప్రభుత్వం వచ్చాక మారిన పరిస్థితి

- ఎన్నికల హామీలను అమలు చేస్తున్న వైనం

- అన్నిరంగాలకు సమ ప్రాధాన్యం

- బాగుపడుతున్న రహదారులు

- మెరుగుపడుతున్న మౌలిక వసతులు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పాఠశాలలు, తదితర రంగాలు నిర్వీర్యమయ్యాయి. సంక్షేమ పథకాలు సైతం వైసీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా పొందేవారు. సామాన్య ప్రజలు చాలా తక్కువగా లబ్ధిపొందేవారు. ఇలా జిల్లాను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారింది. జిల్లా అభివృద్ధి బాటపడుతోంది. సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతోంది. ప్రాధాన్యతా క్రమంలో ఎన్నికల హామీలు అమలు దిశగా ప్రయత్నిస్తోంది. పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచింది. డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే టెట్‌ నిర్వహించింది. ఒక వైపు మౌలిక వసతులు, మరోవైపు అభివృద్ధి పనులు, ఇంకోవైపు వైసీపీ సర్కారు పెండింగ్‌లో ఉంచిన పనులు పూర్తిచేసేందుకు నడుంబిగించింది.


విజయనగరం డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, దీర్ఘకాలిక రోగులు.. తదితర 14 విభాగాలకు చెందిన 2,79,336 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో పాటు ప్రభుత్వ శాఖల సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వైసీపీ హయాంలో వీరికి చివరిగా రూ.3 వేల పింఛన్‌ అందింది. తాను అధికారంలోకి వస్తే పింఛన్‌ మొత్తాన్ని రూ.3వేలకు పెంచుతానని జగన్‌ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక మాటమార్చారు. ఏటా రూ.250 చొప్పున పెంచి..చివరకు రూ.3వేలు పింఛన్‌ చేశారు. అయితే, తాను అధికారంలోకి వస్తే పింఛన్‌ మొత్తాన్ని ఒకేసారి రూ.4 వేలకు పెంచుతానని ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2014లో రూ.వెయ్యి ఉన్న పింఛన్‌ మొత్తాన్ని ఏకకాలంలో రూ.2 వేలకు పెంచిన ఘనత కూడా ఆయనదే. ఇప్పుడు రూ.3 వేలు ఉన్న మొత్తాన్ని ఏకకాలంలో రూ.4 వేలకు పెంచారు.


  • దీపం పథకం..

జిల్లాలో దీపం పథకం-2 కింద 6,27,062 మంది లబ్ధి పొందారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు దీపావళి రోజు దీపం పథకం-2 ప్రారంభించారు. 35 గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో ఉచిత గ్యాస్‌ పథకం విజయవంతంగా అమలవుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


  • సాగునీటి వనరులకు ప్రాధాన్యం..

వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది. రైతులకు అందించే రాయితీలు, పథకాలకు మంగళం పాడింది. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిపై దృష్టిపెట్టింది. మొత్తం 55 పనులకు మోక్షం కలిగింది. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులకు రూ.2.95 కోట్లు, చిన్ననీటి వనరులకు సంబంధించి రూ.39.50 లక్షలు మంజూరయ్యాయి. కాలువల్లో పూడికతీత, కల్వర్టులు, మదుముల నిర్మాణం, పంట కాలువల్లో అడ్డంకులు తొలగించడం, మట్టికట్టలు పటిష్టం చేయడం, సైఫన్లు బాగుచేయడం వంటివి చేపడుతున్నారు. వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ, పెదంకలాం, సీతానగరం ప్రాజెక్టుల పరిధిలో మరమ్మతులు చేపట్టనున్నారు. జంఝావతి పరిధిలో మరికొన్ని పనులు పూర్తిచేయనున్నారు. ఇవన్నీ కేవలం అత్యవసర పనులకు సంబంధించినవే. వచ్చే ఖరీఫ్‌ నాటికి వేసవిలో శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తిచేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నీరు-చెట్టు పథకంలో భాగంగా చేపట్టిన 435 పనులకు సంబంధించి రూ.26.35 కోట్ల బిల్లులను వైసీసీ సర్కారు పెండింగ్‌లో పెట్టింది. వాటిని విడుదల చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.


  • పల్లెలకు పండగే..

జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో రూ.151.90 కోట్ల నిధులతో 2,199 పనులకు గాను కూటమి ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పల్లె పండగ పేరిట జిల్లా వ్యాప్తంగా 777 పంచాయతీల్లో అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతిలోగా ఈ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పనులు పూర్తయిన వాటికి ప్రతి గురువారం బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. అలాగే, జిల్లా వ్యాప్తంగా రహదారుల్లో గోతులు పూడ్చేందుకు రూ.23.51 కోట్లు మంజూరయ్యాయి. దీంతో 750 కిలోమీటర్ల పరిధిలోని రహదారుల్లో గోతులను పూడ్చుతున్నారు. తగరపువలస-విజయనగరం-పాలకొండ రహదారితో పాటు చిలకపాలెం-రాజాం-రాయగడ రోడ్డును పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు.


  • గాడిలో పడుతున్న విద్యాశాఖ

వైసీపీ సర్కారు విద్యాశాఖను గాలికొదిలేసింది. దీన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోంది. పాఠశాలల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లాకు సంబంధించి రూ.3.70 కోట్ల పెండింగ్‌ నిధులు మంజూరు చేసింది. గత ఐదేళ్లలో కనీసం సుద్దముక్కలు, బ్లాక్‌ బోర్డు తుడిచేందుకు డస్టర్లు కూడా అందించలేదు. దీంతో అతి కష్టమ్మీద పాఠశాలల నిర్వహణ సాగినట్టు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలాగే 42 ఎమ్మార్సీల కార్యక్రమాల నిర్వహణకు మరో రూ.54 లక్షలు కేటాయించింది. పాఠశాలల్లో పనిచేసే నైట్‌ వాచ్‌మెన్లు, పారిశుధ్య కార్మికులకు ఆరు నెలల జీతాలను కూడా విడుదల చేసింది. త్వరలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 6వేల పోస్టులు ప్రకటించగా.. వాటికి 10,300 పోస్టులు జతచేస్తూ మొత్తం 16,300 ఖాళీల భర్తీకి సన్నాహాలు ప్రారంభించింది.


  • చంద్రబాబుకు కృతజ్ఞతలు

ప్రభుత్వ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా పింఛన్‌ మొత్తాన్ని పెంచి చంద్రబాబు మా ఇంటి పెద్దకుమారుడు అయ్యారు. రూ.3 వేలు ఉన్న పింఛన్‌ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచడం శుభ పరిణామం. మాలాంటి వారికి ఆ మొత్తం కొండంత అండ. ఈ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు.

- సబ్బవరపు సింహాచలం, పింఛన్‌ లబ్ధిదారు, డెంకాడ

------------------------

  • చిన్న కుటుంబాలకు వరం

ధరలు బాగా పెరిగాయి. కుటుంబ జీవనం కష్టమవుతోంది. ఇటువంటి సమయంలో ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లను అందించడం ఆనందంగా ఉంది. పేద, మధ్యతరహ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏడాదికి రూ.2500 వరకూ ఆదా అవుతుండడం చిన్న కుటుంబాలకు వరమే.

- డి.త్రినాథమ్మ గృహిణి, గజపతినగరం

------------------------


  • డీఎస్సీలో పోస్టులు పెంచారు

డీఎస్సీలో భాగంగా పోస్టులు పెరగడం శుభ పరిణామం. మెగా డీఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. టెట్‌కు మరోసారి అవకాశమిచ్చారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తిచేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఉపాధ్యాయులను నియమించాలి.

-బోర లక్ష్మణ్‌, నిరుద్యోగ యువకుడు, బొబ్బిలి

--------------------

  • రోడ్లు బాగుపడుతున్నాయి

గత ఐదేళ్ల కాలంలో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. అప్పుడు ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో రోడ్లు బాగుపడుతున్నాయి. గతంలో మా ఊరుకి ద్విచక్ర వాహనంపై వెళ్లలంటే ఎంతో కష్టంగా ఉండేది. ఇప్పుడు రహదారిని నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది.

- షేక్‌పీరు పాతబగ్గాం

Updated Date - Dec 27 , 2024 | 11:29 PM