వెంటాడుతున్న వాన
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:03 AM
ఖరీఫ్‌లో ఎన్నో ఆశలతో వరిసాగు ఆరంభించిన అన్నదాతలకు చివరి వరకూ కష్టాలు పోలేదు. పంట చేతికందే దశలో మరింత టెన్షన్ పడ్డారు. అయినా కొంత పంటను కోల్పోవాల్సి వచ్చింది.
వెంటాడుతున్న వాన
వరుస అల్పపీడనాలతో కొనసాగుతున్న చిరుజల్లులు
పంట నష్టంతో రైతన్నల్లో ఆందోళన
పనుల్లేక భవన నిర్మాణ, ఇతర కార్మిక వర్గాల విలవిల
విజయనగరం/గంట్యాడ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి):
ఖరీఫ్‌లో ఎన్నో ఆశలతో వరిసాగు ఆరంభించిన అన్నదాతలకు చివరి వరకూ కష్టాలు పోలేదు. పంట చేతికందే దశలో మరింత టెన్షన్ పడ్డారు. అయినా కొంత పంటను కోల్పోవాల్సి వచ్చింది. వరుస తుఫాన్లను ఊహించని రైతులు తొలుత ఉత్సాహంగా కోతలు చేపట్టారు. అనుకోని వాతావరణ మార్పులతో మధ్య మధ్యలో విరామం ఇవ్వాల్సి వచ్చింది. దీనివల్ల కొంత పంట తడిచిపోయింది. ధాన్యానికి మొలకలు కూడా వచ్చేశాయి. ఈ వర్షాలకు వాణిజ్య, కూరగాయ పంటలకు కూడా నష్టం వాటిల్లింది. క్యాబేజీ, చిక్కుడు, మొక్కజొన్న పంటలతో పాటు కోతలు పూర్తయిన పొలాల్లో నాటిన పెసర, మినప తదితర పంటలూ కలిసిరాలేదు. ఇంకోవైపు వరుస వానలతో కార్మిక వర్గాలు ఉపాధి లేక విలవిల్లాడుతున్నాయి. వర్షాలకు చలిగాలులు తోడవడంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి తీవ్రతకు వృద్ధులు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఈనెల 18న జిల్లాలో సరాసరి 30.1 మీ.మీ వర్షం కురిసింది. అది మొదలు ఇప్పటికీ వరి దిబ్బలు, వరిచేలు నీటిలోనే ఉన్నాయి. అనేక చోట్ల వరి కంకులు మునిగి పోవటంతో మొలకలు వచ్చేశాయి.
తాటిపూడి నీరు విడుదల
తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు తాటిపూడి రిజర్వాయర్‌లోకి నీరు అధికంగా చేరడంతో గేట్ల ద్వారా బుధవారం నీటిని కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి మట్టం 295.4 అడుగులకు చేరింది. ఇరిగేషన్ ఏఈ తమ్మినాయుడు బుధవారం కిందకు నీరు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 297 అడుగులు కాగా తాజాగా 350 క్యూసెక్కులు విడుదల చేశారు.