Share News

రా.. నాన్నా! ఇంటికి వెళ్లిపోదాం

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:43 PM

రోజూలానే పనిలోకి వెళ్లిన ఆ కుటుంబ పెద్ద తిరిగి ఇంటికొస్తాడని అనుకున్నారు. కానీ విధి చిన్నచూపు చూసింది. పనిచేసిన చోటే ఆ ఇంటి పెద్ద దిక్కు ఊపిరి ఆగిపోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు.

రా.. నాన్నా! ఇంటికి వెళ్లిపోదాం

కన్నీరు పెట్టించిన ఘటన

గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడి మృతి

శోక సంద్రంలో కుటుంబ సభ్యులు

సాలూరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రోజూలానే పనిలోకి వెళ్లిన ఆ కుటుంబ పెద్ద తిరిగి ఇంటికొస్తాడని అనుకున్నారు. కానీ విధి చిన్నచూపు చూసింది. పనిచేసిన చోటే ఆ ఇంటి పెద్ద దిక్కు ఊపిరి ఆగిపోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. విగతజీవిగా పడి ఉన్న తండ్రిని చూసి కుమారుడు షాక్‌కు గురయ్యాడు. ‘ రా నాన్నా ఇంటికి వెళ్లిపోదాం... మా నాన్నను బయటకు తీసి లేపండి...నాతో ఇంటికి పంపించండి’ అంటూ ఆ కుర్రాడు ఏడుస్తున్న తీరు .. అక్కడున్న వారందర్ని కలిచివేసింది. ఈ విషాదకర ఘటన శనివారం సాలూరులో చోటుచేసుకుంది. సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం...

పట్టణానికి చెందిన నల్లా శంకరరావు(45) బంగారమ్మ పేటలో నివాసిస్తున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య మరియమ్మ కూడా కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. కుమారులు ప్రసాద్‌, సందీప్‌లను చది విస్తున్నారు. ఆరు నెలలు కిందట శంకరరావు తల్లి చిన్నామ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో వారంతా అదే ప్రాంతంలోని వేరే ఇంట్లో ఉంటున్నారు. కాగా రోజూలానే శంకరరావు శనివారం పట్టణంలోనే పనికి వెళ్లాడు. ఓ పాత ఇంటి గోడను కూలుస్తుండగా.. ఒక్కసారిగా అది ఆయనపై పడింది. దీంతో శంకరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య మరియమ్మ స్పృహ కోల్పోయింది. ఇరుగుపొరుగు వారు వచ్చి సపర్యాలు చేయడంతో కోలుకుంది. మరోవైపు విగతజీవిగా పడి ఉన్న తండ్రిని చూసి పెద్ద కొడుకు ప్రసాద్‌ భోరున విలపించాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు చూసి స్థానికులు కూడా కంటనీరు పెట్టుకున్నారు. ప్రసాద్‌ను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. కాగా మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:43 PM