అమ్మో హైవే!
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:30 AM
danger highway! ఈ నెల 26న భోగాపురం మండలం లింగాలవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందారు. చెన్నైకి చెందిన కుటుంబం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ కారులో విశాఖ వెళుతుండగా లింగాలవలస వద్ద ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఇద్దరు మృత్యువాతపడగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
అమ్మో హైవే!
జాతీయ రహదారిపై పెరుగుతున్న ప్రమాదాలు
మూడు నెలల్లో పదుల సంఖ్యలో మృత్యువాత
వేగ నియంత్రణపై నిఘా ఏదీ?
- ఈ నెల 26న భోగాపురం మండలం లింగాలవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందారు. చెన్నైకి చెందిన కుటుంబం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ కారులో విశాఖ వెళుతుండగా లింగాలవలస వద్ద ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఇద్దరు మృత్యువాతపడగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
- నవంబరు 30న భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం నుంచి విశాఖకు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ అవతలి వైపు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురూ మృతిచెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
- సెప్టెంబరులో పోలిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకులు దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలానికి చెంది తల్లీకుమారుడు భోగాపురం మండలం పోలిపల్లి వచ్చారు. తిరుగుప్రయాణంలో వెళుతుండగా వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు.
విజయనగరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన మూడు నెలల కాలంలో 15 మంది వరకూ మృత్యువాత పడ్డారు. జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఆరులైన్ల రహదారి ఏర్పాటైన తరువాత పరిమిత సంఖ్యలో యూటర్న్‌లు ఏర్పాటుచేశారు. అయితే వాటి వద్ద కొన్నిచోట్ల సూచిక బోర్డులు లేవు. ఉన్నా మట్టి.. దుమ్ముధూళి పట్టేశాయి. చెట్లకొమ్మలు అడ్డుతగిలి కూడా ఉన్నాయి. సూచిక బోర్టులు కనిపించక ప్రయాణికులు, వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. చాలా దూరం వెళ్లిన తరువాత తిరిగి వెనక్కి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక ఇతర కారణాలతోనూ ప్రమాదాలకు గురవుతున్నారు.
ప్రధానంగా వంతెనలున్న కందివలస, కనిమెళ్ల, పోలిపల్లి, రాజపువలస ప్రాంతాలు ప్రమాద స్థలాలుగా తయారయ్యాయి. వాహనాల అతివేగం, వేగ నియంత్రణ చేసుకోలేకపోవడంతో పాటు పోలీసు తనిఖీలు లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో జాతీయ రహదారిపై చాలా చోట్ల ప్రమాద స్పాట్లను గుర్తించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులు సైతం గుర్తించారు. సర్వీసు రోడ్లు ప్రారంభం, ముగింపుల వద్ద భారీ బోర్డులు కనిపించేలా ఏర్పాటుచేయడం లేదు. చిన్నపాటి బోర్డులు ఏర్పాటుచేయడంతో వాహనదారులు గుర్తించడం లేదు. ఇష్టారాజ్యంగా లారీలు నిలిపివేస్తుండడం కూడా ప్రమాదానికి ఒక కారణం. అందుకే భోగాపురం, పూసపాటిరేగ మండలం పేరాపురం వద్ద లారీల పార్కింగ్ స్థలాలను అన్వేషించారు. చివరకు వదిలేశారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రేడియం స్టిక్కర్ల అంటింపు, సూచిక బోర్డుల ఏర్పాటు నామమాత్రంగా ఉంది. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.
వెలగని విద్యుత్ లైట్లు..
రెండు మండలాల్లో జాతీయ రహదారిపై భారీగా వంతెనలు నిర్మించారు. వాటిపై వందల కొద్దీ విద్యుత్ లైట్లను ఏర్పాటుచేశారు. అటు సర్వీసుల రోడ్డుల్లో సైతం విద్యుత్ స్తంభాలను ఏర్పాటుచేశారు. వాటికి ఎల్‌ఈడీ విద్యుత్ లైట్లను అమర్చారు. ప్రారంభంలో ఇవి బాగానే వెలిగాయి. తరువాత నిర్వహణ సరిగా లేక వెలగడం మానేశాయి. పూర్తిస్థాయిలో విద్యుత్ లైట్లు వెలగడం లేదు. చాలాచోట్ల ఈ దీపాలకు సంబంధించి ఏర్పాటుచేసిన ఫ్యూజు బాక్సులు సైతం అస్తవ్యస్తంగా ఉన్నాయి.
ప్రమాదాల నియంత్రణకు చర్యలు
జిల్లాలో రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. 26, 16 జాతీయ రహదారులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ప్రమాద స్పాట్లను గుర్తించాం. 16 ఉండగా హైవే అధికారులను సంప్రదించి లైట్లు, సూచిక బోర్డులు సైతం ఏర్పాటయ్యలా చర్యలు తీసుకుంటాం. హైవే భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటు చేస్తాం. ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తాం. జాతీయ రహదారి 26లో 16 బ్లాక్ స్పాట్‌లు ఉన్నాయి. హైవేకు కనెక్ట్ అయ్యే రోడ్లులో డమ్రులు ఏర్పాటు చేసి రేడియం స్టిక్కరింగ్ చేశాం. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నాం.
- వకుల్‌జిందాల్, ఎస్పీ, విజయనగరం