Darkness : గిరిశిఖర గ్రామాల్లో చీకట్లు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:26 AM
Darkness : సీతంపేట మన్యంలో గిరిపుత్రులు కనీస సౌకర్యాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ విద్యుత్ వెలుగులు చూడని గిరిజన గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
- ఐదేళ్లూ నిర్లక్ష్యం చేసిన వైసీపీ సర్కారు
- కనీస సదుపాయాల కల్పనా లేదాయె
- ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
- కూటమి ప్రభుత్వంపైనే వారి ఆశలు
సీతంపేట రూరల్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో గిరిపుత్రులు కనీస సౌకర్యాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ విద్యుత్ వెలుగులు చూడని గిరిజన గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా వీరి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఐటీడీఏ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఎన్నో ఏళ్లుగా గూడంగి, యరకరాయగూడ, పాత పెద్దగూడ గ్రామాల్లోని 80 గిరిజన కుటుంబాలు చిమ్మచీకట్లో మగ్గుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం..
పాలకొండ నియోజకవర్గంలో 2014కి ముందు మొత్తం 12 గిరిజన గ్రామాలు విద్యుత్ వెలుగులకు దూరంగా ఉండేవి. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు శ్రీకారం చుట్టింది. మొదటి విడత ఎగువ బండలోయ, దిగువ బండలోయ, మల్లమ్మతల్లిగూడ తదితర గిరిశిఖర గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించింది. రెండో విడతగా గూడంగి, యరకరాయగూడ, పాత పెద్దగూడ తదితర గ్రామాల్లో విద్యుత్ కాంతులు నింపాలని భావించింది. కానీ, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో అది సాధ్యపడలేదు. అయితే, అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసింది. ఫలితంగా గూడంగి, యరకరాయగూడ, పాత పెద్దగూడ తదితర గ్రామాలకు విద్యుత్, రహదారి, తాగునీరు తదితర సౌకర్యాలు కరువయ్యాయి. మంచినీటి కోసం ఊటలు, చెలమలు, గ్రావిటేషన్ ఫ్లో నుంచి పైపుల ద్వారా వచ్చే నీటిపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం పథకాలతో పాటు రేషన్, పింఛన్, పొందాలన్నా, అటవీ ఉత్పత్తులను వారపు సంతలకు తరలించాలన్నా ఎన్నో కష్టాలనుకోర్చి కొండదిగువకు రావాల్సిందే. వైద్య సేవల కోసం వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులను డోలి ద్వారా కొండ కిందకు దించాల్సిన పరిస్థితి నెలకొంది.
దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే గూడంగి గ్రామానికి రహదారి మంజూరు చేసింది. సుమారు రూ.30 లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో 600 మీటర్ల సీసీ రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గూడంగి గ్రామానికి విద్యుత్ స్తంభాలు పైకి తీసుకువెళ్లేందుకు కొంతవరకు అవకాశం ఉండనుంది. మిగిలిన గ్రామాలకు కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
సౌకర్యాలు కల్పించాలి
గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలి. విద్యుత్, రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలి. కూటమి ప్రభుత్వం గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కనీస అవసరాలను గుర్తించి పరిష్కరించాలి.
-పత్తిక కుమార్, సీపీఎం నాయకుడు
చీకట్లో మగ్గుతున్నాం
పగలంతా ఎలాగో ఒకలాగ బతికేస్తున్నాం. రాత్రి అయితే చీకట్లో మగ్గుతున్నాం. బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా మాకు చీకటి బతుకులు అలవాటై పోయాయి. పింఛన్ తీసుకునేందుకు కొండ దిగువ ప్రాంతానికి వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
-సవర సొంబారీ, గిరిజన వృద్ధురాలు, గూడంగి
ప్రతిపాదనలు పంపాం
సీతంపేట ఏజెన్సీలో ఇంకా విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గ్రామాలు మూడు వరకు ఉన్నాయి. ఈ గ్రామాల్లో విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సోలార్ ద్వారా విద్యుత్ సదుపాయం కల్పిం చేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
కృష్ణమూర్తి, డీఈ, విద్యుత్‌శాఖ