Decline in Crimes మహిళలపై నేరాలు తగ్గుముఖం
ABN , Publish Date - Dec 30 , 2024 | 10:42 PM
Decline in Crimes Against Women గతేడాదితో పోలిస్తే జిల్లాలో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సోమవారం బెలగాంలోని పోలీస్ సమావేశ మందిరంలో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
బెలగాం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గతేడాదితో పోలిస్తే జిల్లాలో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సోమవారం బెలగాంలోని పోలీస్ సమావేశ మందిరంలో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024లో జిల్లా పోలీస్ శాఖ సాధించిన ప్రగతి, ఛేదించిన కేసుల వివరాలను తెలియజేశారు. ‘ 2023లో హత్యలు, హత్నాయత్నాలు, కిడ్నాప్ కేసులు 175 వరకు నమోదు కాగా 2024లో 168 వరకు నమోదయ్యాయి. గత సంవత్సరం 126 చోరీ కేసులుండగా.. ఈ సంవత్సరం 109 నమోదయ్యాయి. మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి 2023లో 189 కేసులు రికార్డవగా 2024లో 165 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఎస్సీ, ఎస్టీ కేసులు 36 వరకు నమోదు కాగా ఈ ఏడాది 33 వరకు రికార్డయ్యాయి.’ అని ఎస్పీ తెలిపారు.
- రోడ్డు ప్రమాదాల విషయానికొస్తే.. ‘2023లో 275 కేసులు నమోదవగా ఈ ఏడాదిలో 178 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాలు మాత్రం గతంతో పోలిస్తే పెరిగాయి. 2023లో 42 కేసులు నమోదవ్వగా 2024లో 42 కేసులు నమోదయ్యాయి. వైట్ కాలర్ నేరాలు 41శాతం తగ్గాయి.’ ఎస్పీ వెల్లడించారు.
- గంజాయికు సంబంధించి.. ‘2023లో 14 కేసులు నమోదు చేసి 28 మందిని అరెస్ట్ చేశాం. 205.640 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. ఐదు వాహనాలు సీజ్ చేశాం. 2024లో 39 కేసులు నమోదు చేసి 78 మందిని అరెస్ట్ చేశాం. వారి నుంచి 736.34 కిలలో గంజాయి స్వాధీనం చేసుకున్నాం. పది వాహనాలు సీజ్ చేశాం. నాటు సారా, మద్యం అక్రమ రవాణా కేసులు 2023లో 684 వరకు నమోదవగా.. 2024లో 794 కేసులు నమోదయ్యాయి.’ ఎస్పీ తెలిపారు.
- ‘జిల్లాలో పోలీస్ సిబ్బందికి డ్రోన్ ఆపరేటింగ్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. నేరాల నియంత్రణ, గంజాయి సాగు అరికట్టడానికి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై నిఘా పెట్టేందుకు డ్రోన్లును ఉపయోగిస్తున్నాం. జిల్లాలో నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి దాతల సహకారంతో 296 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. జిల్లా పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించాం. పోలీస్ అమరవీరుల దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించాం. ఈ-శిక్షణ కేంద్రంలో ప్రతి స్టేషన్లో కానిస్టేబుల్‌కి కంప్యూటర్ శిక్షణ ఇచ్చాం.’ అని ఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ దిలీప్ కిరణ్, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.