Share News

చి‘వరి’లో కష్టాలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:35 PM

ఒకపక్క వేసవిని తలపించేలా ఎండలు.. మరోపక్క ముఖం చాటేసిన వరుణుడు.. ఇంకొకపక్క ప్రాజెక్టులో తగ్గిన నీటి సామర్థ్యం. ఫలితంగా వరి పంట చివరి దశలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి.

      చి‘వరి’లో కష్టాలు
వెలగవాడ వద్ద తోటపల్లి ఎడమ ప్రధాన కాలువలో చుక్కనీరు లేని దృశ్యం

- తోటపల్లి కాలువల ద్వారా అందని సాగునీరు

- శివారు ప్రాంత రైతుల ఆందోళన

- దిగుబడులపై ప్రభావం చూపుతుందని గగ్గోలు

ఒకపక్క వేసవిని తలపించేలా ఎండలు.. మరోపక్క ముఖం చాటేసిన వరుణుడు.. ఇంకొకపక్క ప్రాజెక్టులో తగ్గిన నీటి సామర్థ్యం. ఫలితంగా వరి పంట చివరి దశలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తోటపల్లి ఎడమ, కుడి పాత ప్రధాన కాలువల ద్వారా శివారు రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. రైతులు శ్రమదానం చేసి కాలువలు బాగు చేస్తున్నా నీరు మాత్రం చేరడం లేదు. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. కాలువల ఆధునికీకరణను గత సర్కారు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

పాలకొండ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తోటపల్లి పాత ఎడమ ప్రధాన కాలువ 37 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీనిద్వారా గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం మండలాల్లో సుమారు 40వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం శివారు పాంత్రాల్లోని సుమారు 20 వేల ఎకరాలకు నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకటో బ్రాంచి పరిధి వీరఘట్టం మండలంలోని కిమ్మి, గడగమ్మ, తదితర గ్రామాలకు, 7వ బ్రాంచి పరిధి పాలకొండ మండలంలోని అట్టలి, తుమరాడ, బుక్కూరు, తంపటాపల్లి బెజ్జి, పారాపురం తదితర గ్రామాలకు, 8వ బ్రాంచి పరిధిలోని ఓని, గుడివాడ, వెలగవాడ, పీఆర్‌రాజుపేట, సింగన్నవలస, పాలకొండ, వడమ తదితర గ్రామాలకు పూర్తిగా సాగునీరు రావడం లేదు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని కొన్ని గ్రామాలకు చుక్క నీరు అందడం లేదు. అలాగే తోటపల్లి పాత కుడి కాలువ బలిజిపేట, వంగర మండలాల్లో విస్తరించి ఉంది. ఈ కాలువ ద్వారా వంగర మండలంలోని శివారు ప్రాంతాలకు సాగునీరు చేరడం లేదు. దీంతో చివరి దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. చెరువులు, కొండవాగులు, గెడ్డలకు నీటి ఇంజన్లు పెట్టి పంటలకు తడి అందిస్తున్నారు. మరికొంతమంది చేసేది లేక వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టామని, పంట చేతికందుతున్న సమయంలో సాగునీరు అందడం లేదని వాపోతున్నారు. దీనివల్ల దిగుబడులు తగ్గిపోతాయని ఆవేదన చెందుతున్నారు.

కాలువల ఆధునికీకరణపై నిర్లక్ష్యం..

తోటపల్లి కాలువల ఆధునికీకరణపై గత వైసీపీ ప్రభుత్వం దృష్టిసారించకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని రైతాంగం పెదవి విరుస్తుంది. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రూ.200 కోట్లతో పూర్వపు కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు చర్యలు చేపట్టింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీసీ ప్రభుత్వం ఈ పనులను నిర్లక్ష్యం చేసింది. కేవలం ఎడమ ప్రధాన కాలువ పరిధిలో 17 కిలోమీటర్లు, కుడి ప్రధాన కాలువ పరిధిలో 9 కిలోమీటర్ల మేర మాత్రమే లైనింగ్‌ పనులు పూర్తి చేసింది. బ్రాంచి కాలువలకు షట్టర్లను ఏర్పాటు చేయలేదు. కుడి, ఎడమ కాలువ పరిధిలో 33 మంది లస్కర్లకు గాను కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. దీంతో సాగునీటిపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుతం జిల్లాతో పాటు ఒడిశాలోని క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కూడా నెల రోజులుగా వర్షాలు కురవడం లేదు. పైగా వేసవిని తలపించేలా ఎండలు దంచికొడుతున్నాయి. ఫలితంగా సాగునీటి సమస్య మరింత జఠిలమవుతోంది. ప్రస్తుతం తోటపల్లి ప్రాజెక్టులో 102 మీటర్ల నీరు మాత్రమే ఉండడంతో కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది.

శ్రమదానం చేసినా ప్రయోజనం శూన్యం

తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ పరిధిలో ఉన్న 7, 8 బ్రాంచిలకు చెందిన శివారు ప్రాంత రైతాంగం చివరి దశలో ఉన్న పంటలను రక్షించుకొనేందుకు గ్రామాల వారీగా శ్రమదానం చేస్తున్నారు. కాలువలోని పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు. అలాగే కాలువ పైభాగంలో ఉన్న రైతులు వేస్తున్న పూనెలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సాగునీరు ఫ్లో తక్కువగా ఉండడంతో శివారు ప్రాంతానికి రావడం లేదు. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రాజెక్టులో 104 మీటర్ల మేర నీరు అందుబాటులో ఉంటే కాలువల ద్వారా పుష్కలంగా నీరు అందే అవకాశం ఉంది.

400 క్యూసెక్కుల విడుదల చేస్తున్నాం

తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ద్వారా ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉంది. దీంతో కాలువల ద్వారా సాగునీటి ప్రవాహం తగ్గింది. 7, 8 బ్రాంచిలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం.

-రంగనాయకులు, ఇన్‌చార్జి, డీఈ

Updated Date - Oct 22 , 2024 | 11:35 PM