Share News

bogus pensions అలా చేయకుండా ఉండాల్సిందే!

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:27 AM

Don't do that! జిల్లాలో బోగస్‌ పింఛన్‌దారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులు నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందినట్టు ఆరోపణలున్నాయి.

bogus pensions అలా చేయకుండా ఉండాల్సిందే!

అలా చేయకుండా ఉండాల్సిందే!

పింఛన్‌ అనర్హుల్లో గుబులు

బోగస్‌ లబ్ధిదారులకు త్వరలో నోటీసులు

జిల్లాలో అడ్డగోలుగా సదరం సర్టిఫికెట్లు జారీ

ఆ వైద్యులపై సైతం చర్యలకు అవకాశం

సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం

రాజాం/బొబ్బిలి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో బోగస్‌ పింఛన్‌దారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులు నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందినట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్ల విషయంలో పెద్ద దందాకు తెరతీసినట్టు విమర్శలు వినిపించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీని మార్చేసి చాలా మంది పింఛన్లు పొందినట్టు తెలుస్తోంది. వాటన్నింటిపై పరిశీలన జరుగుతుండడంతో బినామీ పింఛన్లు పొందుతున్న వారు టెన్షన్‌ పడుతున్నారు. బినామీ పింఛన్ల విషయంలో సీఎం చంద్రబాబు సైతం కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పింఛన్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని.. దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి సదరం సర్టిఫికెట్లు అడ్డదిడ్డంగా ఇచ్చిన వైద్యులపై సైతం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. అమరావతిలో కలెక్టర్ల సమీక్షలో సైతం దీనిపైనే ఎక్కువ మాట్లాడారు. దీంతో కాసులకు కక్కుర్తిపడి సదరం సర్టిఫికెట్లు జారీచేసిన వైద్యుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది.

బినామీ ఆటకట్టు ఖాయం

జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రూ.3 వేలు ఉన్న పింఛన్‌ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచింది. ఏప్రిల్‌నుంచి మూడు నెలల పాటు పెంచిన మొత్తాన్ని కలిపి జూలై నెలలో అందించింది. అటు దివ్యాంగుల పింఛన్‌ మొత్తాన్ని రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచింది. జూన్‌ నెలకు సంబంధించి 2,83,773 మందికి పింఛన్లు అందించింది. డిసెంబరు వచ్చేనాటికి 2,76,058 మందికి మాత్రమే అందించారు. మరణాలు, వివిధ కారణాలతో పింఛన్‌ లబ్ధిదారుల సంఖ్య 8 వేలు తగ్గాయి. అయితే రాజకీయ కారణాలతో కోత విధించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తప్పుడు ధ్రువీకరణపత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా చాలామంది పింఛన్లు పొందుతున్నారని.. అటువంటి వారి పింఛన్లు తొలగించడం ఖాయమని కూటమి పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. దీంతో వచ్చే నెలలో బినామీ పింఛన్ల తొలగింపు ఖాయమని ప్రచారం నడుస్తోంది.

ప్రయోగాత్మకంగా సర్వే..

జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు సచివాలయాల పరిధిలోని ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. బోగస్‌ పింఛన్లను పెద్ద ఎత్తున గుర్తించినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వా నికి నివేదికలు వెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల్లోనూ సర్వే ప్రారంభించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రతి 10 వేల పింఛన్లలో 500 వరకూ బోగస్‌ పింఛన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. అందుకే సచివాలయాల్లో సర్వే ప్రారంభించి.. పింఛన్‌ లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని.. వారి పింఛన్‌ అర్హతను వారే నిరూపించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సచివాలయాల్లో బోగస్‌, అనుమానిత పింఛన్‌ లబ్ధిదారులకు నోటీసులు జారీచేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది.

జిల్లాలో చాలాచోట్ల సదరం ధ్రువీకరణపత్రాల జారీలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. కొంతమంది వైద్యులు కాసులకు కక్కుర్తిపడినట్టు ఆరోపణలున్నాయి. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా.. చాలా మందికి వైకల్య శాతం అధికంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక్కో సదరం ధ్రువీకరణపత్రానికి రూ.10 వేలు వరకూ తీసుకున్నట్టు ఆరోపణలు వినిపించాయి. దీంట్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ నేతల పాత్ర అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కలెక్టర్ల సమీక్షలో దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. తప్పుడు సదరం సర్టిఫికెట్లు జారీచేసిన డాక్టర్లపై సైతం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు.

నోటీసులకు సిద్ధం..

బోగస్‌ పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులకు నోటీసులు అందించేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ముందుగా గ్రామంలో సచివాలయ సిబ్బంది సర్వే చేస్తారు. అన్నిరకాల పింఛన్లను పరిశీలిస్తారు. లబ్ధిదారులకు తమకు తాము అర్హులమని నిరూపించుకునేలా వైకల్య నిర్ధారణ, వయసు నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను మరోసారి వైద్య పరీక్షలకు సైతం సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే నోటీసులు అందుకున్న వారు స్పందించకపోతే అటువంటి వారి పింఛన్లను హోల్డ్‌లో పెడతారు. నిరూపించుకున్న తరువాతే అందిస్తారు. ఒక వేళ బోగస్‌ అని తేలితే రద్దుకు సిఫారసు చేస్తారు. ఈ బోగస్‌ పింఛన్లు తేలాకే కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశముంది.

అర్హులూ ఆందోళన వద్దు

పింఛన్‌ లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అర్హులకు సంబంధించి ఎటువంటి నష్టం జరగదు. అనర్హుల విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తాం. బోగస్‌ పింఛన్లను ఏరివేస్తాం. తప్పుడు ధ్రువీకరణపత్రాలు జారీచేసిన వైద్యులపై సైతం చర్యలు తప్పవు. ఈ విషయంలో ఎటువంటి వివక్ష ఉండదు.

- అంబేడ్కర్‌, కలెక్టర్‌, విజయనగరం

------------

Updated Date - Dec 30 , 2024 | 12:27 AM