Share News

ఇంటింటికీ జియోట్యాగింగ్‌

ABN , Publish Date - Nov 15 , 2024 | 11:58 PM

జిల్లాలో ఇంటింటికీ జియోట్యాగింగ్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ‘మన్యం’లో 3,03,111 గృహాలు ఉండగా, ఇప్పటివరకు 1,07,344 ఇళ్లకు జియోట్యాగింగ్‌ పూర్తయింది. మిగిలిన 1,95,767 ఇళ్లను మరో వారం రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు.

 ఇంటింటికీ జియోట్యాగింగ్‌
కొమరాడలో జియో ట్యాగింగ్‌ చేస్త్తున్న దృశ్యం

ఇప్పటికే 1,07,344 గృహాలు పూర్తి

ముందంజలో పార్వతీపురం మండలం

మరో వారం రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు

పార్వతీపురం/కొమరాడ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటింటికీ జియోట్యాగింగ్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ‘మన్యం’లో 3,03,111 గృహాలు ఉండగా, ఇప్పటివరకు 1,07,344 ఇళ్లకు జియోట్యాగింగ్‌ పూర్తయింది. మిగిలిన 1,95,767 ఇళ్లను మరో వారం రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్వతీపురం మండలం మొదటి స్థానంలో ఉండగా, కొమరాడ మండలం చివరి స్థానంలో ఉంది. పార్వతీపురం మండలంలో 2,21,241 ఇళ్లకు గాను ఇప్పటివరకు 10,919 గృహాలకు ట్యాగింగ్‌ పూర్తయింది. కొమరాడ మండలంలో 17,096 ఇళ్లకు గాను కేవలం 3,938 గృహాలకు మాత్రమే పూర్తి చేశారు.

ఒక్కొక్క ఉద్యోగికి 160 ఇళ్ల బాధ్యత

హౌస్‌ హోల్డ్‌ జియో ట్యాగింగ్‌ బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అప్పగించింది. ఒక్కొక్క ఉద్యోగి 100 నుంచి గరిష్టంగా 160 ఇళ్లను జియో ట్యాగింగ్‌ చేయాలి. ప్రస్తుతం సాంకేతిక సమస్యల కారణంగా జియో ట్యాగింగ్‌ కొన్ని చోట్ల మందకొడిగా సాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లాలో ఎన్ని గృహాలు ఉన్నాయన్నది పక్కాగా లెక్క తేలనుంది.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం హౌస్‌ హోల్డ్‌ జియో మ్యాపింగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలో ప్రతి ఇంటినీ ప్రభుత్వంతో అనుసంధానిస్తుంది. జీఎస్‌డబ్ల్యూఎస్‌ ఎంప్లాయిస్‌ అనే యాప్‌లో జియో ట్యాగింగ్‌ చేస్తారు. ఆ యాప్‌లో ప్రతి ఇంటి ఫొటో, డోర్‌ నెంబరు, లొకేషన్‌ను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రతి కుటుంబం వద్దకు సచివాలయ ఉద్యోగులు వెళ్లి ఆ కుటుంబానికి చెందిన ఇంటిని అప్‌లోడ్‌ చేస్తున్నారు. వాటిని ధ్రువీకరించేలా కుటుంబ సభ్యుల్లో ఒకరితో ప్రత్యేక డివైజ్‌ ద్వారా వేలి ముద్రలు, ఫేస్‌, ఐరీష్‌ పద్ధతిలో ఆమోదం తీసుకుంటున్నారు. గతంలో సంక్షేమ పథకాల ఆధారంగా హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ ఉండేది. ఉదాహరణకు పింఛన్లకు సంబంధించి ఒక మ్యాపింగ్‌, రేషన్‌కార్డులకు సంబంధించి మరొక మ్యాపింగ్‌ ఉండేది. ఫలితంగా ఆయా పథకాల పంపిణీకి మాత్రమే అవి ఉపయోగపడేవి. ఈ చిక్కులను తొలగించి మొత్తం వ్యవహారాన్ని ఒక చోటికి చేర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి ఇంటికి సంబంధించి ఆ ఇల్లు ఉండే అక్షాంశం, రేఖాంశం ఆధారంగా జియో ట్యాగింగ్‌ చేస్తుంది. ఈ పద్ధతి ద్వారా ఎవరెక్కడ ఉన్నారనే విషయం సెకండ్లలో తేలిపోతుంది. ఒక వ్యక్తి, ఆ కుటుంబ సభ్యులు, వారు నివశించే ఇల్లు, ఆ గృహం పూరిల్లా, రేకిల్లా, పక్కా ఇల్లా వంటి వివరాలు, వీధి సమాచారంతో సహా మొత్తం అధికారుల లాగిన్‌లో కనిపిస్తాయి. మ్యాపుల్లో వారున్న ప్రదేశం కనిపిస్తుంది.

ఎంతో ఉపయోగం..

ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో ఒక్కొక్కసారి తెలియని పరిస్థితి ఉంటుంది. దీంతో వారిని గుర్తించేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభిం చింది. ఇటీవల సంభవించిన విజయవాడ వరదలను దృష్టిలో ఉంచుకొని ఇళ్లకు జియోట్యాగింగ్‌ చేపట్టాలని నిర్ణయించింది. వ్యక్తి పేరు, ఆధార్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ లేదా ఇంటి నెంబర్‌.. ఇలా ఏదో ఒక దానితో వ్యక్తి వివరాలు ఉండే ప్రాంతాన్ని గుర్తించి వారికి అవసరమైన సమయాల్లో సహాయాన్ని అందించేందుకు వీలుంటుంది.

వారం రోజుల్లో పూర్తి చేస్తాం

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జియోట్యాకింగ్‌ కార్యక్రమం మరో వారం రోజుల్లో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని మండలాల్లో కొన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది ఈ కార్యక్రమానికి సహకరించాల్సి ఉంది. మాతృ శాఖ విధుల్లో ఆ సిబ్బంది ఉన్నారు. త్వరలోనే వారి సేవలను వినియోగించుకుంటాం.

-రామచంద్రరావు, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ప్రత్యేకాధికారి

=================================================

వేగవంతం చేస్తాం

అన్ని ఇళ్లకు మ్యాపింగ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొన సాగుతుంది. సచివాలయ ఉద్యోగులు రోజూ చేపడుతున్నారు. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించాం.

-మల్లికార్జునరావు, ఎంపీడీవో, కొమరాడ

Updated Date - Nov 15 , 2024 | 11:58 PM