Share News

సాగునీటి సంఘాలకు ఎన్నికలు

ABN , Publish Date - Oct 10 , 2024 | 11:53 PM

వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్వీర్యమైన సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ మేరకు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది.

సాగునీటి సంఘాలకు ఎన్నికలు
పెద్దగెడ్డ జలాశయం

- ఈ నెల 16న షెడ్యూల్‌ విడుదల

- జిల్లాలో 213 నీటి సంఘాలు

- ఓటర్ల జాబితా తయారీలో అధికారులు

(కొమరాడ)

వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్వీర్యమైన సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ మేరకు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ నెల 16న మొదలై వచ్చే నెల 20వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేపడుతుంది. సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగనున్నాయి. 9 ఏళ్ల తరువాత సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనుండడంతో గ్రామాల్లో సందడి మొదలైంది.

తొమ్మిదేళ్ల తరువాత..

సాగునీటి కాలువల నిర్వహణ, చెరువుల ఆయకట్టుకు సక్రమంగా సాగునీటి సరఫరా వంటివి జల వనరులశాఖతో పాటు సాగునీటి సంఘాలు పర్యవేక్షించాలి. సాగునీటి వనరుల విషయంలో రైతులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి సంఘాలు కృషి చేస్తుంటాయి. అయితే, సాగునీటి సంఘాలకు చివరిసారిగా 2015లో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో సాగునీటి సంఘాల చైర్మన్ల ఆధ్వర్యంలో పంట కాలువల్లో పూడికల తొలగింపు, నీరు చెట్టు పథకం కింద సాగునీటి చెరువుల అభివృద్ధి, ఆయకట్టు చివరి భూములకు సకాలంలో సాగునీరందించడం వంటి పనులు చేపట్టారు. కోతకు గురైన పంట కాలువల గట్లను సరిచేయించారు. సాగునీటి సంఘాల పదవీ కాలం ముగిసిన కొద్ది కాలానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తన ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆ సంఘాలకు ఎన్నికలు నిర్వహించిన పాపాన పోలేదు. కాలువల్లో పూడికతీత, తుప్పల తొలగింపు, రెగ్యులేటర్‌ గేట్ల మరమ్మతులు వంటి పనులకు నిధులు విడుదల చేయాలని రైతులు ఎంత మొత్తుకున్నా వైసీపీ పాలకులు పట్టించుకోలేదు. దీంతో సాగునీటి వనరులు అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేప థ్యంలో దాదాపు 9 ఏళ్ల తరువాత సాగునీటి సంఘాల ఎన్నికలకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

జిల్లాలో 213 సంఘాలకు ఎన్నికలు

పార్వతీపురం మన్యం జిల్లాలో మేజర్‌, మైనర్‌, మీడి యం ఇరిగేషన్‌ కింద సుమారు 1.31 లక్షల ఎకరాలకు గాను 213 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. మేజర్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కమిటీకి, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు నాలుగు, వాటర్‌ యూజర్‌ అసోసియేషన్‌ కమిటీలు 22, మీడియం ఇరిగేషన్‌కు సంబంధించి 25 సంఘాలకు, మైనర్‌ ఇరిగేషన్‌ కింద 106 చెరువులకు ఎన్నికలు జరిపేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నమయ్యారు.

40 రోజుల్లో ప్రక్రియ పూర్తి

ఈ నెల 16న సాగునీటి సంఘాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. మొదట సాగునీటి సంఘాలకు, ఆ తదుపరి డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, ఆ తరువాత ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ అంతా 40 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయమై జిల్లా నోడల్‌ అధికారి, జల వనరులశాఖ ఈఈ ఆర్‌.అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా.. సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రెవెన్యూశాఖతో ఆయా సంఘాల పరిధిలో ఉన్న ఓటర్ల గుర్తింపు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

Updated Date - Oct 10 , 2024 | 11:53 PM