చెత్తను తొలగించండి... ప్రజారోగ్యాన్ని కాపాడండి
ABN , Publish Date - Sep 28 , 2024 | 11:06 PM
స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా డంప్ చేస్తున్న చెత్తను తక్షణమే తొలగించాలని సమీప వీధి వాసులు ప్రజా సంఘాల నాయకులతో కలిసి శనివారం ధర్నా నిర్వహించారు. డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసి.. పట్టణంలోని చెత్తాచెదారాలను అక్కడకు తరలించాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలని కార్యాలయం ప్రాంగణంలో నినాదాలు చేశారు.
పాలకొండ: స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా డంప్ చేస్తున్న చెత్తను తక్షణమే తొలగించాలని సమీప వీధి వాసులు ప్రజా సంఘాల నాయకులతో కలిసి శనివారం ధర్నా నిర్వహించారు. డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసి.. పట్టణంలోని చెత్తాచెదారాలను అక్కడకు తరలించాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలని కార్యాలయం ప్రాంగణంలో నినాదాలు చేశారు. నగర పంచాయతీ సమీపంలో చెత్తను వేయడం వల్ల దుర్వాసనను భరించలేకపోతున్నామని, అనారోగ్యం బారిన పడుతున్నామని వారు తెలిపారు. అనంతరం కమిషనర్ సర్వేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న అరకు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పల్లా కొండలరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్‌కుమార్ అక్కడకు చేరుకొని వీధి వాసులతో చర్చించారు. నాలుగు రోజుల్లో చెత్త సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ నిరసనలో సీపీఎం నాయకుడు దావాల రమణారావు, 15, 16 కౌన్సిలర్ ప్రతినిధులు శంకరరావు, వెంకటరమణ, మరో కౌన్సిలర్ కాంతారావు, ఎమ్మెల్సీ విక్రాంత్ నగర పంచాయతీ చైర్ పర్సన్ రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు.