నిధులున్నా.. నిర్లక్ష్యమే!
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:52 PM
సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన జగతిపల్లి వ్యూపాయింట్, రిసార్ట్స్ అభివృద్థి పనులకు మోక్షం లభించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. నిధులున్నా.. పనులు పూర్తికాని పరిస్థితి.
సీతంపేట ఏజెన్సీలో నిలిచిన జగతిపల్లి ప్రాజెక్టు
కదలని వ్యూపాయింట్, రిసార్ట్స్ పనులు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
సీతంపేట రూరల్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన జగతిపల్లి వ్యూపాయింట్, రిసార్ట్స్ అభివృద్థి పనులకు మోక్షం లభించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. నిధులున్నా.. పనులు పూర్తికాని పరిస్థితి. ప్రస్తుతం అక్కడ నిర్మాణాల కోసం వినియోగించిన విలువైన ఐరన్ తుప్పుపట్టి పాడవుతోంది. ఆ స్థలంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోవడంతో పనులు జరిగిన ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. గత ఏడాది అప్పటి ఐటీడీఏ పీవో కల్పనకుమారి చొరవతో రూ.15 లక్షలు వెచ్చించి జగతిపల్లి వ్యూ పాయింట్‌ను నిర్మించారు. కానీ మిగిలిన పనులు చేపట్టకపోవడంతో జగతిపల్లి వ్యూ పాయింట్ అందాలను చూసేందుకు పర్యాటకులు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇదీ పరిస్థితి..
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జగతిపల్లి వ్యూ పాయింట్, రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్, గ్రీనరీ, పార్కింగ్ వంటి పనులకు రూ.27 కోట్లు కేటాయించారు. వాటిల్లో మొదటి విడతగా జగతిపల్లి పనులకు రూ.7కోట్లు మంజూరు చేశారు. ఆ నిధుల్లో రూ.49 లక్షలతో రిసార్ట్స్ నిర్మాణం చేపట్టారు. 2018లో నిర్మాణం ప్రారంభించినా.. గిరిశిఖర ప్రాంతం కావడంతో నిధులు ఉన్నప్పటికీ పనులు వేగవంతం కాలేదు. ఇంతలో ఎన్నికలు జరగడం, వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ ప్రాజెక్ట్ అలానే నిలిచిపోయింది. మరోవైపు సున్నపుగెడ్డ, బెన్నరాయి జలపాతాల అభివృద్ధికి అటవీశాఖ అభ్యంతరాలు ఉండడంతో వాటి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగతిపల్లి వ్యూ పాయింట్, రిసార్ట్స్‌పై ఐటీడీఏ ఇన్చార్జి పీవో యశ్వంత్‌కుమార్ రెడ్డిని వివరణ కోరగా.. గతంలో వాటి అభివృద్ధికి మంజూరైన నిధులు ల్యాప్స్ అయ్యాయన్నారు. ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. నిధులు మంజూరైన వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపడతామని స్పష్టం చేశారు.
దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం..
- సీతంపేట ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు జగతిపల్లి వ్యూపాయింట్, రిసార్ట్స్ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల ఐటీడీఏ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.
- పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.2.5 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. వాటిలో రూ.1.5 కోట్లతో ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్‌లో మరికొన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేయనున్నారు. మరో రూ.కోటితో అసంపూర్తిగా నిలిచిపోయిన గిరిజన మ్యూజియం పనులు చేపట్టనున్నారు. తురాయిపువలస ఉద్యానవన నర్సరీలో ఏకో పార్క్‌తో పాటు పర్యాటకులు రాత్రి బస చేసేందుకు కాటేజీలు నిర్మించేందుకు ఐటీడీఏ అధికారులు ఇప్పటికే స్థల పరిశీలన చేపట్టారు.
- పులిపుట్టి పంచాయతీ పరిధిలో కన్నెధార కొండను పర్యాటకంగా అభివృద్థి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు రూ.5 కోట్లతో కొండపై వ్యూ పాయింట్, ట్రక్కింగ్, రహదారులు వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. కన్నెధార కొండ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి జరిగితే ఆదివాసీ యువతకు స్థానికంగానే ఉపాధి దొరుకుతుందని గిరిజన సంఘం నాయకులు సవరతోట ముుఖలింగం, సవర బాజన్న, పొట్టేసులు తదితరులు చెబుతున్నారు.