Share News

ప్రతి ఇంటి లెక్క పక్కా!

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:02 AM

విజయవాడ నగరం ఇటీవల వరదలకు మునిగిపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లు ముంపులోనే రోజుల తరబడి ఉండిపోయాయి. బాధితులకు సరైన ఆహారం అందలేదు. మంచి నీటికి కూడా ఇబ్బందిపడ్డారు.

ప్రతి ఇంటి లెక్క పక్కా!

ప్రతి ఇంటి లెక్క పక్కా!

జిల్లాలో హౌస్‌ హోల్డ్‌ జియో ట్యాగింగ్‌

సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు

అక్కడక్కడా సాంకేతిక సమస్యలు

అధిగమిస్తామంటున్న అధికారులు

జిల్లాలో 6,38,787 గృహాలు

విజయనగరం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరం ఇటీవల వరదలకు మునిగిపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లు ముంపులోనే రోజుల తరబడి ఉండిపోయాయి. బాధితులకు సరైన ఆహారం అందలేదు. మంచి నీటికి కూడా ఇబ్బందిపడ్డారు. సాయం చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉన్నా.. బాధితులు ఎవరు? వారి స్థితిగతులు ఏంటి? ఏ ప్రాంతంలో, ఏ ఇంట్లో నివాసముంటున్నారు? వారి చుట్టుపక్కల హద్దులు ఏంటి? అన్నది తెలియకుండా పోయింది. దీంతో వరద బాధితులకు సాయం అందించడంలో కాస్త జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. విపత్తుల సమయంలో సాయం అందించడంతో పాటు ప్రతి నివాసితుడి వివరాలు సులువుగా తెలుసుకునేందుకు ‘హౌస్‌ హోల్డ్‌ జియోట్యాగింగ్‌’ చేయాలని నిర్ణయించింది. ఒక వ్యక్తి పేరు, ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌, ఇంటి నంబరుతో ఇళ్ల వివరాలు ఇట్టే తెలిసిపోయే వీలుగా జియోట్యాగింగ్‌ను చేయిస్తోంది. ఈ కీలక బాధ్యతలను ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ప్రకృతి విపత్తుల సమయంలో చిన్న ఆధారాలతో ఆచూకీ కనుగొనేలా ఈ సరికొత్త విధానం ఉపయోగపడనుంది. ప్రస్తుతం జియో ట్యాగింగ్‌ ప్రక్రియ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చురుగ్గా జరుగుతోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 626 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. మొత్తం 10,601 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఉద్యోగి క్లస్టర్లలో హౌస్‌ జియో ట్యాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. అంటే 100 పైగా ఇళ్ల వరకూ చేయాల్సి ఉంది. జిల్లాలో 6,38,787 ఇళ్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ లక్ష ఇళ్ల వరకు మాత్రమే ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తోంది. సచివాలయ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ బాధ్యతలను అప్పగిస్తే కొన్నిశాఖల కార్యదర్శులు మాత్రమే ట్యాగింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ, ఇంజనీరింగ్‌ సహాయకులు, మహిళా పోలీసులు మాత్రమే పాల్గొంటున్నారని.. మిగతా వారు డుమ్మా కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. పర్యవేక్షణ బాధ్యతలను మండలాల్లో ఎంపీడీవోలకు, మునిసిపాల్టీల్లో కమిషనర్లకు అప్పగించారు. మరోవైపు సాంకేతిక సమస్యలతో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్టు సమాచారం. వేలిముద్రలు అనుసంధానం చేయడంలో కొన్నిప్రాంతాల్లో డివైస్‌లు మొరాయిస్తున్నాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్య కూడా ఉంది. దీంతో మ్యాపింగ్‌నకు సమస్య ఏర్పడుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే కానీ జిల్లాలో నివాసాలపై ఒక స్పష్టత రాదు.

ప్రతిష్ఠాత్మకంగా..

కూటమి ప్రభుత్వం హౌస్‌ హోల్డ్‌ జియో ట్యాగింగ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ ప్రభుత్వంతో అనుసంధానించాలన్న కృతనిశ్చయంతో ఉంది. గతంలో సంక్షేమ పథకాల ఆధారంగా మ్యాపింగ్‌ ఉండేది. రేషన్‌కార్డులకు, పింఛన్లకు ఇలా వేర్వేరుగా మ్యాపింగ్‌ ఉండేది. అయితే ఆ మ్యాపింగ్‌ కేవలం పథకాల పంపిణీకి మాత్రమే ఉపయోగపడేది. అందుకే వేర్వేరుగా కాకుండా అన్నిరకాల సంక్షేమ పథకాలకు,అవసరాల కోసం ఒకే జియో ట్యాగింగ్‌ చేయాలని భావిస్తోంది. ప్రతి ఇంటికి సంబంధించి రేఖాంశం, అక్షాంశాన్ని పరిగణలోకి తీసుకుంది. ఈ విధానంతో ఏ వ్యక్తి ఎక్కడ ఉన్నారో క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ వ్యక్తి, కుటుంబసభ్యులు, రేకింట్లో ఉన్నారా? డాబా ఇంట్లో నివాసముంటున్నారా? వీధి సమాచారంతో సహా మొత్తం అధికారుల లాగిన్లో కనిపిస్తాయి. మ్యాపుల్లో వారు ఉండే ప్రదేశం సైతం కనిపిస్తుంది. తద్వారా విపత్తుల సాయంలో సత్వర సాయం కూడా అందించవచ్చు.

చాలా ప్రయోజనాలు

ప్రస్తుతం కొనసాగుతున్న హౌస్‌ హోల్డ్‌ జియో ట్యాగింగ్‌తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో ఏదైనా సమస్యపై ఫిర్యాదుచేస్తే సంబంధిత వ్యక్తి ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబరు, ఇంటి నంబరు అందించాల్సి వచ్చేది. వాటిని నమోదు చేసుకుని సమస్య పరిష్కారాం కోసం వారిని ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ జియో ట్యాగింగ్‌తో వ్యక్తికి సంబంధించి ఏదైనా ఒక్క ఆధారంతో క్షణాల్లో నేరుగా వివరాలు పొందవచ్చు. మ్యాపింగ్‌ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. మరోవైపు చాలా మంది బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌, ఫోన్‌ నంబర్లు అనుసంధానం కాలేదు. ఎవరెవరైతే ఇలా అనుసంధానం కాలేదో.. వారి వివరాలు సచివాలయ ఉద్యోగుల వద్ద ఉన్నాయి. పనిలో పనిగా వాటిని సైతం అనుసంధానం పూర్తిచేస్తున్నారు. ఈ జియో ట్యాగింగ్‌తో చాలారకాలుగా ప్రయోజనాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం జిల్లా ప్రజలపై ఉంది.

చురుగ్గా ప్రక్రియ

జిల్లా వ్యాప్తంగా హౌస్‌హోల్డ్‌ జియో ట్యాగింగ్‌ చురుగ్గా కొనసాగుతోంది. లెక్క పక్కాగా ఉండేటట్లు జియోట్యాగింగ్‌ చేయాలని ఇప్పటి వరకు 52 శాతానికి పైగా మ్యాపింగ్‌ చేశాం. మిగిలిన హౌస్‌ట్యాగింగ్‌ మరో వారం రోజుల్లో పూర్తి అవుతుంది. ఇంటింటికీ వెళ్లి సచివాలయ సిబ్బంది ట్యాగింగ్‌ చేస్తున్నారు. అక్కడక్కడా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. కానీ వాటిని అధిగమించి పూర్తిచేస్తున్నారు. సచివాల ఉద్యోగులు విధిగా తమకు కేటాయించిన ఇళ్లకు జియో ట్యాగింగ్‌ చేయాల్సిందే. హౌస్‌ మ్యాపింగ్‌ తోపాటు, ఫొటో తీసుకుని గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.

- అంబేడ్కర్‌, కలెక్టర్‌

-----------------

Updated Date - Nov 20 , 2024 | 12:02 AM