Extension మళ్లీ పొడిగింపు
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:20 AM
Extension Granted Again జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు(పీఏసీఎస్) పర్సన్ ఇన్‌చార్జిల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పర్సన్ ఇన్‌చార్జిల పాలన మరో ఆరు నెలలు
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
పాలకొండ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు(పీఏసీఎస్) పర్సన్ ఇన్‌చార్జిల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలను నిర్వహించి ప్రాజెక్టు కమిటీల చైర్మన్లను నియమించింది. ఈ కోవలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రచారం సాగింది. అయితే వాటికి ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెడుతూ.. పర్సన్ ఇన్‌చార్జిల పాలన కొనసాగింపునకే మొగ్గు చూపింది. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలను కూటమి సర్కారు రద్దు చేస్తూ డీసీసీబీలో ఉద్యోగులుగా ఉన్న వారిని పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించింది. అయితే ఇటీవల పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలం పూర్తయినప్పటికీ మరో ఆరు నెలల పాటు పొడిగించింది. జిల్లా వ్యాప్తంగా 43 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి గాను 16 మంది పర్సన్ ఇన్‌చార్జిలను నియమించారు. ఒక్కో పర్సన్ ఇన్‌చార్జికి నాలుగు నుంచి ఆరు వరకు సహకార సంఘాల బాధ్యతలను అప్పగించారు. కాగా సహకార సంఘాల పాలన సక్రమంగా సాగాలంటే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను నియమించాలని జిల్లా రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పట్లో సహకార ఎన్నికలకు ఎన్నికలు లేకపోవడంతో కూటమి నాయకులు నిరుత్సాహం నెలకొంది.
గాడి తప్పిన సంఘాలు
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు నిర్వీర్యమయ్యాయి. రైతులకు సేవలందించాల్సింది పోయి వ్యాపార ధోరణిలోకి మారిపోయాయి. పీఏసీఎస్‌ల్లో 50 శాతం వాటాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై రైతులతో పాటు పీఏసీఎస్ ఉద్యోగులు, సిబ్బంది నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెనక్కితగ్గారు. గతంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతు సేవలో తరించేవి. తొలుత ఎటువంటి రుసుం చెల్లించకుండానే..రైతులు ఈ సంఘాల ద్వారా పంట రుణాలు, ఎరువులు పొందేవారు. పంట ఉత్పత్తులు విక్రయించిన తరువాత చెల్లించేవారు. అక్కడకు కొద్దిరోజుల తరువాత సభ్యత్వ రుసుం కింద రూ.10 వసూలు చేసేవారు. సంఘ సభ్యులుగా చేర్చకునేవారు. ప్రాంతీయ వ్యవసాయ కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా త్రిసభ్య కమిటీ పేరుతో ఐదేళ్ల పాటు కాలయాపన చేసింది. మరోవైపు రైతులను సొసైటీలకు దూరం చేసింది. సకాలంలో పంట రుణాలు కూడా అందించకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వచ్చింది. దీంతో పీఏసీఎస్‌ల్లో అన్నదాతల సభ్యత్వం తగ్గిపోయింది. సభ్యత్వ రుసుం ఏకంగా రూ.300కు పెరిగింది.
పొడిగింపు వాస్తవమే..
జిల్లాలో సహకార సంఘాలకు పర్సన్ ఇన్‌చార్జిల పాలనను మరో ఆరు నెలలు పొడిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వాస్తవమే. వచ్చే ఏడాది జూన్ వరకు గడువు పెంచింది.
- శ్రీరామమూర్తి, జిల్లా సహకార సంఘ అధికారి, పార్వతీపురం మన్యం