Share News

టేకు చెట్ల నరికివేత

ABN , Publish Date - Feb 18 , 2024 | 11:53 PM

లింగాలవలస పంచాయతీ మూలపాడు గ్రామం సమీపంలోని ఆండ్ర సెక్షన్‌ అటవీ ప్రాంతంలో ఆదివారం కొందరు వ్యక్తులు టేకు చెట్లను అక్రమంగా నరికి తరలించేందుకు సిద్ధమయ్యారు..

 టేకు చెట్ల నరికివేత

మెంటాడ: లింగాలవలస పంచాయతీ మూలపాడు గ్రామం సమీపంలోని ఆండ్ర సెక్షన్‌ అటవీ ప్రాంతంలో ఆదివారం కొందరు వ్యక్తులు టేకు చెట్లను అక్రమంగా నరికి తరలించేందుకు సిద్ధమయ్యారు.. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు మెరుపు దాడి చేసి, టేకు చెట్లను, వాటిని తరలించేందుకు తీసుకొచ్చిన రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. అటవీ అధికారులు ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా నిఘా పెట్టారు. అక్రమ నరికివేతపై సమాచారం ఇవ్వాలని స్థానిక గిరిజనులకు సూచించారు. ఆదివారం దత్తిరాజేరు మండలానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అటవీ ప్రాంతంలోని ఫారెస్ట్‌ ప్లాంటేషన్‌లో రెండు టేకు చెట్లను నరికి ముక్కలుగా కోసి ట్రాక్టర్లు లోడ్‌ చేస్తుండగా, గిరిజనుల ద్వారా సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కేవీఎన్‌ రాజు సిబ్బందితో కలిసి దాడి చేశారు. అటవీ శాఖ అధికారులను చూసిన ఆరుగురిలో నలుగురు టేకు దొంగలు పరారయ్యారు. మిగిలిన ఇద్దరు ట్రాక్టర్‌ డ్రైవర్లను ఫారెస్ట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రావాణాకు సిద్ధంగా ఉన్న టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. కేసు నమోదు చేస్తామని ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఈ దాడిలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌లు బి.అప్పలరాజు, కేవీఎన్‌ రాజు, వై.కేశవ, పి.మధు, సిబ్బంది యు.సమత, రామారావు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2024 | 11:53 PM