సాంస్కృతిక వైభవం చాటిచెప్పేలా విజయనగరం ఉత్సవాలు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:05 PM
జిల్లా సాంస్కృతిక వైభవం చాటిచెప్పేలా విజయనగరం ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ బీఅర్ అంబేడ్కర్ అన్నారు.
- ఏర్పాట్లు పకడ్బంధీగా చేయాలి
- కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం (ఆంధ్రజ్యోతి)/విజయనగరం రూరల్: జిల్లా సాంస్కృతిక వైభవం చాటిచెప్పేలా విజయనగరం ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ బీఅర్ అంబేడ్కర్ అన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బంధీగా చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం ఉత్సవాలు, పైడిమాంబ సిరిమానోత్సవానికి సంబంధించిన వేదికలను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలసి ఆయన మంగళవారం పరిశీలించారు. సిరిమాను తిరిగే ప్రధాన రహదారి, విజయనగరం కోట, మెగా ఈవెంట్ జరిగే కార్యక్రమాలు జరిగే ఆయోధ్య మైదానం, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే మాన్సాస్ గ్రౌండ్, క్రీడాపోటీలు నిర్వహించే విజ్జీ స్టేడియాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ.. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఆర్వో అనిత, సీపీవో బాలాజీ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య, ఆర్డీవో కీర్తి, పైడిమాంబ దేవస్థానం ఈవో ప్రసాద్‌రావు, పూజారి బంటుపల్లి వెంకటరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.