Share News

మడ్డువలసకు వరద పోటు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:25 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ కారణంగా మడ్డువలస రిజర్వాయర్‌ పరిసరాలతో పాటు ఎగువ ప్రాంతం ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

మడ్డువలసకు వరద పోటు
నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన దృశ్యం

- అప్రమత్తమైన అధికారులు

- నాలుగు గేట్ల ద్వారా నాగావళికి నీరు విడుదల

వంగర, జూలై 26, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ కారణంగా మడ్డువలస రిజర్వాయర్‌ పరిసరాలతో పాటు ఎగువ ప్రాంతం ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మడ్డువలస ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం ఉదయానికి 64.50 మీటర్లు ఉన్న నీటి మట్టం సాయంత్రానికి 64 .55 మీటర్లకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నాలుగు ప్రధాన గేట్లు పైకెత్తి నాగావళికి నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 65మీటర్లు అయినప్పటికీ నిర్వాసిత గ్రామాల్లో సమస్యలు దృష్ట్యా 64. 50 మీటర్లకు స్థిరీకరించారు. వేగావతి, సువర్ణముఖి నదుల ద్వారా ఇన్‌ ఫ్లో 3,800 క్యూసెక్కులు మడ్డువలసకు వచ్చి చేరుతుంది. దీంతో ప్రధాన గేట్ల ద్వారా 5,600 క్యుసెక్కుల నీరు విడుదల చేసినట్లు ఏఈ నితిన్‌ తెలిపారు. రాత్రి సమయానికి ఇన్‌ఫ్లో అధికంగా వచ్చి ప్రాజెక్టులో నీరు పెరిగితే మరికొన్ని గేట్లు తెరిచి నీరు దిగువకు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎవరూ భయపడనవసం లేదని తెలిపారు. రిజర్వాయర్‌ సమీప గ్రామాలు ఓని, సంగాం, కొట్టిశలో ఇంజనీరింగ్‌ అధికారులు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. మడ్డువలస కాలువ ద్వారా పంట భూములకు 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంగమేశర్వస్వామి ఆలయంలోకి నీరు..

భారీ వర్షాలకు సంగాంలోని సంగమేశర్వస్వామి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతంలో ఈ ఆలయం ఉండడంతో లోపలకు నీరు చేరింది. దీంతో శుక్రవారం దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. కాగా, ఈ ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరయ్యాయని, వెంటనే పనులు జరుపుతామని చెప్పి గత వైసీపీ పాలకులు హడావిడిగా శంకుస్థాపన చేశారు. కానీ, పనులు మాత్రం చేపట్టడం లేదు. దీంతో చిన్నపాటి వర్షాలకే సంగమేశ్వర ఆలయంలోకి నీరు చేరుతుంది.

Updated Date - Jul 26 , 2024 | 11:25 PM