Freehold ఫ్రీహోల్డ్‌పై ఫోకస్!
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:50 PM
Focus on Freehold! త వైసీపీ సర్కారు హయాంలో జిల్లాలో అడ్డగోలుగా సాగిన ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వాటిపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది సర్వం సిద్ధం చేశారు.
గత వైసీపీ సర్కారు హయాంలో అడ్డగోలుగా సాగిన వ్యవహారం
రెవెన్యూ శాఖపై ఆ పార్టీ నేతల ఒత్తిడి
అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌పై ఎన్నో అనుమానాలు
నివేదికలు సిద్ధం చేసిన అధికారులు
అక్రమార్కుల్లో వణుకు
పార్వతీపురం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు హయాంలో జిల్లాలో అడ్డగోలుగా సాగిన ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వాటిపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది సర్వం సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం ఫ్రీ హోల్డ్ అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ అందుకు విరుద్ధంగా జరిగినట్లు రుజువైతే మాత్రం సంబంధిత సిబ్బంది లేదా అధికారులపై చర్యలు ఉంటాయి. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి నేతల ఒత్తిడి మేరకు నడుచుకున్న కొంతమంది రెవెన్యూ సిబ్బంది, అధికారుల్లో ఆందోళన నెలకొంది. నివేదికలు సిద్ధంగా ఉండడంతో ఎవరిపై ఎటువంటి చర్యలు ఉంటాయో.. ఎవరు బాధ్యులవుతారోనని టెన్షన్ పడుతున్నారు.
వైసీపీ హయాంలో..
గతంలో ప్రభుత్వాలు పేదలకు భూములు పంపిణీ చేసి వారి జీవనోపాధికి మార్గం చూపేవారు. అయితే కొంతమందికి ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడం తదితర కారణాలతో భూములను ఇతరులకు విక్రయించేవారు. ఇదే సమయంలో కొంతమంది బడా బాబులు పేదల భూములను కొనుగోలు చేసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. కాగా వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్‌ను ఆసరాగా తీసుకున్న అక్రమార్కులు పేదల పేరున ఉన్న అసైన్డ్ భూములపై కన్నేశారు. జీవోను అడ్డం పెట్టుకొని ఆ భూములను కొనుగోలు చేసుకుని రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు. అధికారుల సహకారంతో మరికొందరు బరితెగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములను సొంతం చేసుకున్నారు. పార్వతీపురం మండలం ములగ పంచాయతీతో పాటు వివిధ మండలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొంతమంది వైసీపీ నాయకులు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో భూములు ఫ్రీహోల్డ్ చేశారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో జరుగుతున్న ఈ అవకతవకలపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
ఇదీ పరిస్థితి..
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా పరిధిలో 16,153 మందికి సంబంధించి సుమారు 16,201 ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయ్యాయి. ఇందులో 58 ఎకరాలకు రిజిస్ర్టేషన్ చేశారు.
- కొమరాడ మండలంలో 552 ఎకరాల 942 సెంట్లు, గరుగుబిల్లిలో 262 ఎకరాల 64 సెంట్లు, పార్వతీపురంలో 2672 ఎకరాల 56 సెంట్లు, బలిజిపేటలో 754 ఎకరాల 46 సెంట్లు, సాలూరులో 525 ఎకరాల 92 సెంట్లు, పాచిపెంటలో 18 ఎకరాల 63 సెంట్లు, మక్కువలో 2472 ఎకరాల 42 సెంట్లు, సీతానగరంలో 737 ఎకరాల 135 సెంట్లు చొప్పున మొత్తంగా పార్వతీపురం డివిజన్‌లో 7, 996 ఎకరాల 707 సెంట్లు ఫ్రీ హోల్డ్ భూములుగా నమోదయ్యాయి. ఇందులో 50 ఎకరాల 891 సెంట్లకు రిజిస్ర్టేషన్ పూర్తయింది.
- పాలకొండ డివిజన్ పరిధి గుమ్మలక్ష్మీపురం మండలంలో 677 ఎకరాల 221 సెంట్లు, కురుపాంలో 68 ఎకరాల 67 సెంట్లు, పాలకొండలో 39 ఎకరాల 93 సెంట్లు, సీతంపేటలో 4,674 ఎకరాల 58 సెంట్లు, భామినిలో 1,824 ఎకరాల రెండు సెంట్లు చొప్పున అన్ని మండలాల్లో 8,205 ఎకరాల 22 సెంట్లు భూమి ఫ్రీ హోల్డ్‌గా మారింది. ఇందులో 7.54 ఎకరాలకు రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తయింది.
- పార్వతీపురం, సీతంపేట, భామిని, మక్కువ తదితర మండలాల్లో వేలాది ఎకరాలు ఫ్రీ హోల్డ్‌గా మారాయి.
నివేదిక సిద్ధం చేశాం
ఫ్రీ హోల్డ్ జరిగిన భూముల వివరాలను నివేదిక రూపంలో సిద్ధం చేశాం. ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్టు రుజువైతే ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం చర్యలు ఉంటాయి.
- హేమలత, జిల్లా రెవెన్యూ అధికారి, పార్వతీపురం మన్యం