Share News

విద్యార్థుల ‘బంగారు భవిత’ కోసం..

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:07 AM

జిల్లాలో రక్తహీనత నివారణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్రధానంగా పాఠశాల విద్యార్థులను ఆ ముప్పు తప్పించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ చర్యల్లో భాగంగా గత నెలలో ‘బంగారు భవిత’ పేరిట కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 విద్యార్థుల ‘బంగారు భవిత’ కోసం..

-రక్తహీనత నివారణకు సరికొత్త కార్యక్రమం

- త్వరలో పాఠశాలల్లో అమలుకు శ్రీకారం

-సన్నాహాల్లో అధికారులు

పార్వతీపురం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రక్తహీనత నివారణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్రధానంగా పాఠశాల విద్యార్థులను ఆ ముప్పు తప్పించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ చర్యల్లో భాగంగా గత నెలలో ‘బంగారు భవిత’ పేరిట కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని అమలుకు క్షేత్రస్థాయి సిబ్బంది పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి.. మెరుగైన వైద్యసేవలు, పౌష్టికాహారం అందించనున్నారు. వాస్తవంగా జిల్లాలోని 15 మండలాల్లో 187 హైస్కూళ్లు ఉన్నాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వివరాలను ముందుగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు బంగారు భవిత పేరిట ఒక కార్డును అందించనున్నారు. ఇందులో వారి ఆరోగ్య వివరాలు ఉంటాయి. జిల్లాలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 49,836 మంది విద్యార్థులు చదువుతుండగా.. వారిలో 20 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు ప్రాథమిక అంచనా. ఈ సంఖ్య మరింత పెరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. విద్యార్థుల ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. రక్తహీనత నివారణకు కృషి చేయనున్నారు. హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్న వారికి ఐరెన్‌ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు అందించనున్నారు. మధ్యాహ్న భోజనంలో రాగిజావ, గుడ్డు, చిక్కీలు అందజేయనున్నారు. ఇంటిలోనూ గుడ్లుతో పాటు బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. రోజూ పిల్లలకు ఉపాధ్యాయుల ద్వారా రెండు ఐఎఫ్‌ఏ టాబ్లెట్స్‌ ఇవ్వనున్నారు. అదే విధంగా నులిపురుగుల నివారణకు ఆరు నెలలకొకసారి ఆల్‌బెండాజోల్‌ మాత్రలు అందించనున్నారు. ఈ విధంగా బంగారు భవిత ద్వారా విద్యార్థులకు ఆరోగ్యాలకు భరోసా కల్పించనున్నారు. త్వరలో ఈ కార్యక్రమం జిల్లాలో అన్ని పాఠశాలలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఎంతో ఉపయోగం

బంగారు భవిత కార్డులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కార్డులో విద్యార్థుల వ్యక్తిగత వివరాలతో పాటు ఆరోగ్య వివరాలు ఉంటాయి. వీటి ఆధారంగా వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారం అందిస్తాం. ఇప్పటికే ఈ కార్డులను వారికి పంపిణీ చేస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నాం.

-ఎన్‌.తిరుపతినాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం

Updated Date - Nov 15 , 2024 | 12:07 AM